ప్రకాశం జిల్లా, మోటుపల్లి లో బయల్పడిన 700 ఏళ్ల విష్ణు విగ్రహాన్ని పరిరక్షించాలి.
చారిత్రక తొలి, మధ్యయుగాల్లో రోము, చైనా దేశాలతో, విస్తృత వర్తక కార్యకలాపాలకు నిలయమైన ప్రకాశం జిల్లా, చీరాల సమీపంలోని, మోటుపల్లి రేవు పట్టణం వద్ద చారిత్రక ఆనవాళ్లు బయల్పపడుతూనే ఉన్నాయని, పురావస్తు, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సీసీఐఏ), సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. రుద్రమదేవి పాలనా కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కోపోలో సందర్శించిన మోటుపల్లి మధ్యాంధ్రయుగ ఆర్థిక రాజధానిగా విలసిల్లిందనీ, 1970 వ దశకంలో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో చోళుల కాలం నాటి నటరాజ కంచు విగ్రహం ఇంకా ఎన్నో వస్తువులు, కస్టమ్స్ హౌస్, చైనా నాణేలు, మట్టి పాత్రలు లభించాయని ఆయన చెప్పారు.
ప్రకాశం జిల్లాలో, కోఅపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్, పర్చూరు నియోజకవర్గ బాధ్యులు అయిన రావి రామనాథబాబు ఇచ్చిన సమాచారం మేరకు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి చేపట్టిన వారసత్వ సంపద పరిరక్షణలో స్థానికులను భాగస్వామ్యం చేసే ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టారిటీ’లో భాగంగా, శివనాగిరెడ్డి బుధవారం నాడు మోటుపల్లిలో బయల్పడిన నిలువెత్తు ప్రసన్న కేశవ విగ్రహాన్ని సందర్శించారు. మోటుపల్లి రామాలయం చుట్టుపక్కల పొలాల్లో చెల్లాచెదురుగా పడివున్న రామ లక్ష్మణ సీతా, విష్ణు, విగ్రహాలను, కాకతీయ గణపతి దేవుని తెలుగు శాసనాన్ని,
రామాలయ ప్రాంగణానికి చేర్చి పదిలపరిచారు. అనంతరం మోటుపల్లి వీరభద్రాలయం ఎదురుగా గల దిబ్బ పైన బయల్పడిన క్రీ.శ. 14వ శతాబ్ది నాటి బుద్ధ విగ్రహాన్ని పరిశీలించారు. వీరభద్రాలయంలో నున్న కాకతీయ గణపతి దేవుడు క్రీ.శ. 1244 లో, ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర వ్యాపారుల కోసం ప్రవేశ పెట్టిన బీమాను తెలియజేసే అభయ శాసన వివరాలను, క్రీ.శ. 1364 లో అనవోతా రెడ్డి, క్రీ.శ. 1416 లో మొదటి దేవరాయలు అదే శాసనాన్ని పునరుద్ధరించిన విషయాన్ని రామనాధబాబు బృందానికి శివనాగిరెడ్డి వివరించారు. భారతీయ విదేశీ వర్తక చరిత్రలో ప్రధాన భూమికను పోషించిన
మోటుపల్లిని పునరుద్ధరించడానికి పందిళ్లపల్లికి చెందిన రొండా దశరధరెడ్డి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రస్తావించారు. రామనాధబాబు మాట్లాడుతూ, మోటుపల్లి ఆలయాల పునరుద్ధరణ చేపట్టి, వారసత్వ, సముద్రతీర (బీచ్ టూరిజం), పర్యావరణ హిత (ఎకో టూరిజం), గ్రామాణ పర్యాటకాల్ని అభివృద్ధి చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించే విషయమై ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు.
ఈ కార్యక్రమంలో చినగంజాంకు చెందిన కోమట్ల అంకమ్మరెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఆది బాబు, రుద్రమాంబపురం మాజీ సర్పంచ్ గోవింద్, ఇంకా మోటుపల్లి, రుద్రమాంబపురం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా, శివనాగిరెడ్డి వారికి వారసత్వ సంపద పై అవగాహన తరగతులు నిర్వహించారు.