తెలుగు శిల్పుల ఔన్నత్యాన్ని తెలియజేసేలా ‘తెలుగు శిల్పుల వైభవం’ ప్రస్తకం ఉందని సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో శుక్రవారం(07-02-2020) డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన తెలుగు శిల్పుల వైభవం(వంశ చరిత్ర-శాసనాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుస్తకానికి డాక్టర్ కొండా శ్రీనివాసులు సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా అప్పాభక్తుల శివకేశవరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ శిల్పులు, కుల గోత్రాలు, బిరుదులు, వారి జీవితంలోని అన్ని అంశాలను రచయిత వివరించారని చెప్పారు. విశ్వజ్యోతి ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాభక్తుల శివకేశవరావు మాట్లాడుతూ శిల్పుల గొప్పతనాన్ని పుస్తకంలో తెలియజేశారని పేర్కొన్నారు. సభ అనంతరం శ్రీ విశ్వజ్యోతి ఫౌండేషన్ సంస్థ శివనాగిరెడ్డికి ‘శిల్పి బంధు’ బిరుదును ప్రదానం చేశారు. సంపాదకులు డాక్టర్ కొండా శ్రీనివాసులు గారిని సత్కరించారు. బెంగళూరుకు చెందిన శిల్పాచార్యులు తామాడ మోహనరావు, శివనాగిరెడ్డిని నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎం.సోమయాజులు, కూర్మాచారి, వెంకటేశ్వర్లు, సుభాష్ చంద్రబోస్, పి.సోమశేఖరాచార్యులు, కామేశ్వరరావు, పి. నాగవెంకట ప్రసాద్, గోళ్ళ నారాయణరావు, ఎంసీదాస్, శుభాకర్ మేడసాని తదితరులు పాల్గొన్నారు.
శిల్పుల వంశచరిత్ర రాయడం గొప్ప కృషి
తెలుగు శిల్పుల వైభవం’ అనే తెలుగు శిల్పుల వంశచరిత్ర, శాసనాల గ్రంథం అపురూపమైంది. ఎంతోశ్రమించి ఈ గ్రంథశిల్పం చెక్కిన వారు మన చరిత్రకారుడు, స్థపతి, ఆత్మీయత మూర్తీభవించిన మనిషి శివనాగిరెడ్డి. శిల్పి లేకుండ ఇల్లు, గ్రామం, నగరం, కోట, యజ్ఞకుండం, దేవాలయాలు, దేవాలయాల్లో శిల్పాలు లేవు. వాటన్నింటికి రూపకల్పన చేసిన వాస్తువేత్త శిల్పి. దైవాన్ని విశ్వసించే దైవారాధకుల విశ్వాసాలకు, వారి, వారి ధ్యానాలకు తగినట్టు లక్షణసహితంగా ప్రతిమలను చెక్కినవాడే శిల్పి. లలితకళలలో ప్రతికళ దేనికదే సాటి. కాని శిల్పకళలో ద్రవ్యం వేరు. మిగతా కళలకున్నంత సులభసాధ్యం కాని ద్రవ్యంతో శిల్పి శిల్పాలను రూపొందిస్తాడు. ఏ రాతిలో ఏ బొమ్మ చెక్కాలో, ఏ మూర్తిలో ఏ భావం స్ఫురింపచేయాలో ఆ శిల్పికే సాధ్యం. మైకోలాంజిలో అన్నట్టు శిల్పి తాను రాతిలో దర్శించిన ప్రతిమను వ్యక్తీకరించడానికి కేవలం ‘పరస్థలాల’ను తొలగిస్తాడంతే. అంటే శిల్పం కాని రాతిముక్కలను రాల్చివేస్తాడని. ఇంత శ్రమించి, అనంతమైన శిల్పకళా శోభలను సృష్టించే శిల్పుల చరిత్ర అజ్ఞాతమే. జక్కన, ఢక్కణల వంటి లేని శిల్పుల కథలు చెప్పేవారే కాని, నిజంగా గుళ్ళు, గోపురాలు చెక్కిన శిల్పుల గురించి చెప్పినవారు తక్కువ. ఈ పుస్తకంలో ఆనాటి తెలుగుశిల్పులకు గౌరవమిచ్చి, శాసనాలలో వారి పేర్లను వెతికి, వారి వంశచరిత్రలను కూడా రాయడం గొప్ప కృషి.