*ఘనంగా గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు
*గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ‘శ్రీనాధుడు నాటకం’ 108వ ప్రదర్శన
తెలుగు నేర్చుకోవడానికి పిల్లలను అమెరికా పంపించే రోజులు రానున్నాయని, ఇక్కడి కన్నా అక్కడే తెలుగు భాష వికసిస్తోందని ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు రాని ఆంగ్ల యాసలో మాట్లాడే పిల్లలు చక్కగా ఎంతో ఆసక్తిగా తెలుగు భాష నేర్చుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 25 డిసెంబర్, సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. 14 మంది వృద్ద కళాకారులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల వంతున గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ఆర్ధిక సహకారం అందించింది. ఈ సందర్భంగా తెలుగు భాషా వికాసం కోసం అమెరికాలో విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ కూచిభోట్ల ఆనంద్ ను ఆత్మీయ స్వర్ణకంకణ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతిని అమెరికాలో పోషిస్తున్న మహాన్నత వ్యక్తి కూచిభోట్ల ఆనంద్ ను, తెలుగు పద్యం కోసం తపిస్తున్న మహావ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ స్వర్ణకంకణంతో సత్కరించుకున్న దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేనంత ఆనందం కలిగించిందని అభినందించారు. అంతర్జాలంలో తెలుగు ఫాంట్స్ అందుబాటులోకి తెచ్చి గూగుల్ ద్వారా యునికోడ్ ఫాంట్స్ ను ఉచితంగా అందించడానికి కృషిచేసిన వ్యక్తి ఆనంద్ అని ప్రశంసించారు. సభాధ్యక్షత వహించిన వేమన ఫౌండేషన్ చైర్మన్ చెన్నూరు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ కొత్త నటులను తీర్చిదిద్దుతున్న గుమ్మడి గోపాలకృష్ణ అభినందనీయులని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమెరికాలో లలిత కళల విశ్వ విద్యాలయం(సిలికానాంధ్ర) స్థాపించిన తొలి భారతీయుడు మన తెలుగుతేజం కూచిభోట్ల ఆనంద్ కావడం గర్వకారణం అన్నారు. అమెరికా నుంచి విచ్చేసిన విద్యావేత్త ఆచార్య డాక్టర్ వెంకటరావు మూల్పూరు మాట్లాడుతూ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అయితే అమెరికాలో తెలుగు పిల్లలకు గుమ్మడి గోపాలకృష్ణ దేవుడు అని అభివర్ణించారు.
స్వర్ణ కంకణ పురస్కార గ్రహీత కూచిభొట్ల ఆనంద్ స్పందిస్తూ సిలికానాంధ్ర జగమంత కుటుంబం తరఫున స్వర్ణ కంకణం ధరించినట్లు వినమ్రంగా తెలిపారు. అమెరికాలో ఆవకాయ నుంచి బిర్యానీ పాయింట్ వరకు పెట్టారని, యూనివర్సిటీ పెట్టని లోటును అందరి సహకారంతో తాను నెలకొల్పినట్లు చెప్పారు. తెలుగు భాషకు కృత్రిమ మేధను జోడించి అద్భుతాలు చేయబోతున్నామని, లలితకళలు, తెలుగు భాషతో పాటు, యోగా, అల్లోపతి, ఆయుష్, నేచర్ క్యూర్ అన్ని కలగలసి వున్న ప్రపంచంలోనే తొలి విశ్వ విద్యాలయంగా సిలికానాంధ్ర యూనివర్సిటీ త్వరలోనే గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిఇవో డాక్టర్ కె. కృష్ణయ్య, మూలా సిద్ధారెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, అరవా రామకృష్ణ, గీత (కెనడా), చింతలపూడి జ్యోతి (అమెరికా), త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి, డా. మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ పర్యవేక్షించగా, వి. సతీష్ బాబు సమన్వయ సహకారం అందించారు. సత్యసాయి కళా నికేతన్ బృందం గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించిన శ్రీనాధుడు నాటకం 108వ ప్రదర్శన అద్భుతంగా ఉంది. సమయాభావం వల్ల శ్రీనాధుడి కనకాభిషేకం ఘట్టం వరకు మాత్రమే ప్రదర్శించారు. ఈ నాటకంలో ప్రౌఢ దేవరాయలు పాత్రను కూచిభోట్ల ఆనంద్ పోషించడం విశేషం.
గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహకారం తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి విచ్చేసిన కళాకారులు గొల్ల జంబులయ్య, కె. కనకయ్య, ఎం.రమేష్, వెంకట రాములు, కొండయ్య వేదిక పై స్వీకరించారు. కె. రాఘవయ్య (మిర్యాలగూడ), ఆంధ్రప్రదేశ్ నుంచి నూకతోటి జయసుందర్ కుమార్ (అద్ధంకి), లోక సులోచన (నెల్లూరు), ఎస్తెర్ల వెంకటేశ్వర్లు (అద్దంకి), వనారస విమలాదేవి (నెల్లూరు), వంజా సుబ్బారావు (చీమకుర్తి), టి. అనురాధ (విజయవాడ), విశ్వామిత్ర ప్రసాద్ (నందిగామ), పి. కోటేశ్వరరావు (చిలకలూరిపేట)లను ఎంపిక చేసి వారి అకౌంట్ లో ఒక్కొక్కరికి పది వేలు పంపించినట్లు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు.
–డా. మహ్మద్ రఫీ
Best wishes to all💐💐