లక్షాధికారికి షష్టిపూర్తి

తెలుగు చలనచిత్ర పరిశ్రమ నాటి మద్రాసు మహానగరంలో త్యాగరాయ నగర్, పాండీబజారు లకు పరిమితమైన రోజుల్లో, హైదరాబాదులో చిత్రపరిశ్రమను అబివృద్ధి చేయాలని తన మకాం మార్చిన అక్కినేని నాగేశ్వరరావుకి చేదోడువాదోడుగా శ్రీ సారథీ స్టూడియో నిర్వహణా బాధ్యతను తలకెత్తుకొని, అందులో తెలుగు చిత్రాలను నిర్మించేందుకు శ్రమించిన తెలుగు సినీ కృషీవలుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనే గోపాల కృష్ణమూర్తి. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల నిర్మాణంతో ఊపందుకున్న చిత్రపరిశ్రమలో శ్రమించే కళాకారుల వసతికోసం ‘ఫిలిం నగర్’ను స్థాపించి టాలీవుడ్ హోంగా తీర్చిదిద్దిన ఘనత కూడా తమ్మారెడ్డికి చెల్లుతుంది. సారథి స్టూడియోలో జనరల్ మేనేజరుగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వుంటూ 1962లో రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా విక్టరి మధుసూదనరావు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి జంటగా నిర్మించిన ’లక్షాధికారి’ చిత్రం 27-09-1963న విడుదలై షష్టిపూర్తి చేసుకుంది. స్వయంగా వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా, ఉన్నత ఆదర్శభావాలతో, సామాజిక చైతన్యానికి విలువనిచ్చి తన సొంతబ్యానర్ పై చిత్రనిర్మాణం సాగించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి “సారథి స్టూడియో నా విశ్వవిద్యాలయం” అని చెబుతుండేవారు. విశ్వకవి రవీంద్రుడు అంటే ఇష్టపడే తమ్మారెడ్డి తన సంస్థ లోగో మీద రవీంద్రుని రేఖాచిత్రంతో బాటు శృంఖలాలు తెంచుకుంటున్న కార్మికుని చిత్రాన్నికూడా వుంచారు. “స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం” అనే సందేశం లోగోలో కనిపిస్తూ తమ్మారెడ్డి ఆశయాలను గుర్తుచేస్తుంటుంది. అటు ‘లక్షాధికారి’ చిత్రానికే కాదు, ఇటు రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థకూ ఇది షష్టిపూర్తి సంవత్సరం కావడం విశేషం.

భలే చిత్ర కథ

లక్షాధికారి రంగయ్య (నాగయ్య) వజ్రాల వ్యాపారం చేస్తుంటాడు. అతని ఏకైక కుమారుడు ప్రసాద్ (ఎన్.టి.రామారావు). సీతయ్య (గుమ్మడి) రంగయ్యవద్ద గుమస్తాగిరి చేస్తూ, వ్యాపారంలో నమ్మినబంటుగా, కుటుంబలో ఒక సభ్యునిగా కలిసిపోతాడు. సీతయ్య భార్య ఋష్యేంద్రమణి ఉత్తమురాలు. వీరి కూతురు పద్మ (కృష్ణకుమారి). పానకాలు (మిక్కిలినేని) రంగయ్య ఇంట్లో కాపలాదారు. పచ్చి తాగుబోతు. రంగయ్య బావమరది శివం (కె.వి.ఎస్.శర్మ) అవిటివాడు. బంగారం తయారీలో నష్టపోయి, డబ్బు సాయంకోసం శివం రంగయ్య వద్దకువచ్చి డబ్బు అర్ధిస్తాడు. న్యాయసమ్మతంకాని వ్యాపారం మంచిదికాదనీ, దొంగబంగారం వ్యాపారం వదలి తన బంగాళాలోనే ఉంటూ కాలక్షేపం చెయ్యమని సలహా ఇచ్చిన రంగయ్యను కాదని, శివం ఆ రాత్రి ఖజానాలో డబ్బు దొంగిలించాలని పన్నాగం పన్నుతాడు. అదేరోజు వ్యాపారపని నిమిత్తం ఒక వజ్రాలవ్యాపారి రంగయ్య ఇంటివద్దకు వజ్రాలు తీసుకొస్తాడు, వాటి కొనుగోలుకు అంగీకరించిన రంగయ్య, హోటల్లో బసచేస్తే ప్రమాదమని, తన ఇంట్లోనే అతనికి ఆ రాత్రి వసతి కల్పిస్తాడు. శివం డబ్బు దొంగతనానికి వచ్చిన సమయానికే వజ్రాలవ్యాపారి హత్యకావించబడతాడు. హంతకుడెవరన్నది సస్పెన్స్. ఆ హంతకుణ్ణి కళ్ళారాచూసిన సీతయ్య భార్య (ఋష్యేంద్రమణి) షాక్ కు గురై మాట కోల్పోతుంది. లక్షాధికారి రంగయ్య మీద హత్యానేరం మోపబడి, కోర్టు అతనికి జీవితఖైదు విధిస్తుంది. జైలులోవున్న రంగయ్య తన చిన్నారి కొడుకు ప్రసాదును, ఆస్తిని సంరక్షించే బాధ్యతను నమ్మకస్తుడైన సీతయ్యకు, అతని భార్యకు అప్పగిస్తాడు. ఇంతలో సీతయ్య సంరక్షణలోవున్న రంగయ్య కొడుకు ప్రసాదు అపహరణకు గురై కృష్ణానదీతీరంలో స్పృహలేనిస్థితిలో వుండగా, సంతానంకోసం పుణ్యతీర్థాలు సందర్శిస్తూ, నదీస్నానం చేస్తున్న పిచ్చయ్య (రమణారెడ్డి) అచ్చమ్మ(సూర్యకాంతం) దంపతులకు దొరుకుతాడు. దైవమిచ్చినబిడ్డగా ఇంటికి తెచ్చుకున్న వేళావిశేషం చేత వారికి ఒక అమ్మాయి లీల (గిరిజ) పుడుతుంది. ప్రసాద్ రాకతోనే ఈ అదృష్టం వచ్చిందని నమ్మిన పిచ్చయ్య దంపతులు అతనికి వరప్రసాద్ అని పేరు పెడతారు. లీల, సీతయ్య కూతురు పద్మ కాలేజిలో స్నేహితులు. ప్రసాద్ ఫార్మసీ విద్యార్ధి. గుండెజబ్బు నివారణకు మందు కనుగొని డాక్టరేటు సంపాదిస్తాడు. సీతయ్య పెట్టుబడితో పరిశ్రమస్థాపించి వ్యాపారాన్ని వృద్ధిచేస్తాడు. వ్యాపారంలో వచ్చిన లాభాలను సీతయ్య బంగారుకడ్డీల రూపంలో పిచ్చయ్యకు పంపుతాడు. ఈలోగా ప్రసాద్, పద్మలు ప్రేమించుకుంటారు. రావు అనిపిలువబడే సన్యాసిరావు (రేలంగి)పానకాలు కొడుకు. బుద్ధిమంతుడు. అతడు అప్రయత్నంగా పరిచయమైన లీల ప్రేమలో పడతాడు. పానకాలు అభ్యర్ధనతో సీతయ్య రావుకు తన ఫాక్టరీలో మేనేజర్ వుద్యోగం వేయించడంతో రావు ప్రసాదుకు దగ్గరౌతాడు. లీల, రావుల ప్రేమవ్యవహారం తెలిసి, వారిద్దరికీ పెళ్లి చెయ్యాలని ప్రసాద్ ప్రయత్నించగా, కోపించిన అచ్చమ్మ ప్రసాదుని దుర్భాషలాడే తొందరలో అతడు తమకు దొరికినబిడ్డ అనే నిజం చెబుతుంది. పెంచిన తండ్రి పిచ్చయ్య ద్వారా తనతండ్రి రాజమండ్రి కేంద్రకారాగారంలో వున్నాడని తెలిసి ప్రసాదు అక్కడకువెళ్తే, ఒకనెల ముందుగానే రంగయ్య విడుదలయ్యాడని తెలుస్తుంది. తండ్రి అన్వేషణలోవున్న ప్రసాదుకి తన తండ్రి కలిసినా అతడే తండ్రి అని తెలియదు. రంగయ్య ఈలోగా సీతయ్యను కలుస్తాడు. తనింట్లో బసచేసిన రాత్రే రంగయ్యమీద హత్యాప్రయత్నం జరుగుతుంది. ప్రసాద్ రంగయ్యను కాపాడతాడు. కల్తీబంగారం అమ్మే ముఠాను పట్టుకొనేప్రయత్నంలో, తమకున్న సమాచారంమేరకు పోలీసులు అమాయకులైన పిచ్చయ్య, అచ్చమ్మలను అరెస్ట్ చేస్తారు. ఈ రహస్య ఛేదనలో ప్రసాద్ వుండగా, హత్యారహస్యం తెలిసిన పానకాలు నిజం ఎక్కడ చెప్పేస్తాడోఅని, పాడుబడిన కోటవద్ద పానకాలుని విలన్ కాల్చిచంపిస్తాడు. ప్రసాదుకు తెలియకుండా అతని వెనకే కోట వద్దకు వచ్చిన రంగయ్యను హంతకునిగా భావించి పోలీసులు అతనిని మరలా జైలుకు పంపుతారు. ఇక మారువేషాల్లో ప్రసాద్ హంతకుని వేటాడతాడు. ఈవేటలో అసలు హంతకుడు బయటపడతాడు. శివంని విలన్ గృహనిర్బధంలో వుంచి అతని ముసుగులో ఈ హత్యలన్నీ చేస్తాడు. ఆ విలన్ ఎవరోకాదు, రంగయ్యకు నమ్మినబంటుగా ఉంటున్న సీతయ్యే! అలా సస్పెన్స్ వీడి రంగయ్య బయటకు, సీతయ్య జైలుకు వెళ్తారు. ప్రసాద్, పద్మలకు; లీల, రావులకు పెళ్లి జరుగుతుంది. కథ సుఖాంతం.

చిత్ర విశిష్టతలు

‘లక్షాధికారి’ చిత్రం ఒకరకంగా అపరాధ పరిశోదాత్మక చిత్రమని చెప్పవచ్చు. ఈ కోవలో వచ్చిన మొదటి చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఎందుకంటే ఇందులో సస్పెన్స్ వుంది, సైన్సు వుంది, పరిశోధనా వుంది. తరవాత వచ్చిన ‘దొరికితే దొంగలు’(1965), ‘గూఢచారి 116’(1966) చిత్రాలకు ఈ చిత్రం ప్రేరణ కూడా కావచ్చు. ఈ చిత్రంలో సస్పెన్స్ అడుగడుగునా కనిపిస్తుంది. హత్య, దొంగతనం వంటి సంఘటనలు జరగబోతున్నాయనేందుకు సంకేతంగా క్లాక్ టవర్ అర్థరాత్రి 12 గంటలు సూచిస్తుంది. తరవాత నక్కల ఊళలు, గుడ్లగూబ అరుపులు వినిపిస్తాయి. కెమెరా గుడ్లగూబ కళ్ళమీదకు తీవ్రంగా ఫోకసై తెరముందుకువచ్చి భయపెడుతుంది. చిత్రం విడుదలైన కొత్తల్లో చిన్నపిల్లలు ఈ సన్నివేశాన్నిచూసి జడుసుకునేవారు. కె.వి.ఎస్.శర్మ కొయ్యకాలుతో పోటువేసుకుంటూవచ్చే ఘట్టంకూడా భయానకమే! చిత్రం చివరిదాకా గుమ్మడి విలన్ అని ఎవరికీ అనుమానంరాదు. రచయిత నార్ల చిరంజీవి సినిమాలో కొన్ని క్లూస్ జొప్పించినా, వాటిని మనం గుమ్మడికి అన్వయించలేము. ఉదాహరణకు కె.వి.ఎస్.శర్మ ముసుగులో విలన్ వజ్రాలవ్యాపారిని హత్యచేసి వజ్రాలు చేజిక్కించుకొని పారిపోతున్నప్పుడు అతని భార్య అడ్డుపడితే ఆమెను కొట్టినప్పుడు; హంతకుడు పారిపోయినప్పుడు పానకాలు కాపలా ఉండికూడా పోలీసుల వద్ద నోరు మెదపకుండా వున్నందుకు ప్రతిఫలంగా, రేలంగిని విలన్ తన ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసినప్పుడు; రంగయ్య జైలుకు వెళ్ళగానే అతి నిరాడంబరంగా వుండే సీతయ్య ఒకేసారి జమీందారుగా మారినప్పుడు; లాభాల సాకుతో దొంగబంగారపు కడ్డీలు పిచ్చయ్య ఇంటికి పంపినప్పుడు; హీరో రంగయ్య కొడుకనే నిర్ధారణకు రావడానికి అతనిపై కాఫీని కావాలని వొలకబోసి హీరో చేతిమీద వుండే పుట్టుమచ్చను గుర్తించి నప్పుడు; జీవిత ఖైదు అనుభవిస్తున్నరంగయ్య విడుదలకానేకాడని భ్రమించి కొత్త ఇల్లు, తోటతోసహా కట్టించినప్పుడు కూడా మనకు గుమ్మడే విలన్ అనే సందేహం కలగదు. విలన్ స్థావరం కూడా సీతయ్య కట్టించిన ఇంట్లోనే ఉందనే ఊహ కూడా రాదు. వీటన్నిటికీ కారణం గుమ్మడి నటనలో సందేహం కలిగించే అంశాన్ని ప్రేక్షకునికి రానీకుండా జాగ్రత్త పడిన దర్శకుని ప్రతిభే! అంతేకాదు, అరవై ఏళ్ళకిందే “రోబో” యంత్రాలవంటి కరెంటుమనుషుల్ని మనిషిని చంపేందుకు వినియోగించడం కూడా దర్శకుని ప్రతిభే!!. కె.వి.ఎస్.శర్మ గంభీరపుగొంతుతో పలికే సంభాషణలు అతడే విలన్ అని మనకు అనుమానం కలిగేలా చేస్తుంది.

తాతినేని చలపతిరావు సంగీతం చిత్ర వేగాన్నిపెంచి సస్పెన్స్ ని చివరిదాకా కొనసాగించేందుకు వీలు కలిపించింది. ఇక పాటల విషయానికొస్తే, సినారె గతంలో ఒక పత్రికకోసం రాసిన “మబ్బులో ఏముంది నామనసులో ఏముంది” పాటను ఈ చిత్రంలో యధాతధంగా వాడుకున్నారు. మధ్యమావతి రాగంలో బాణీకూర్చిన ఈ పాటను ఘంటసాల, సుశీల పాడగా తిరువణ్ణామలై దగ్గరలో వున్న చేన్నకేశవ హిల్స్ వద్ద ఎన్.టి.ఆర్, కృష్ణకుమారిల మీద చిత్రీకరించారు. ప్రశ్న,సమాధానంతో సాగే సినారె మార్కు పాట ఇది. ఎన్.టి.ఆర్ హీరోయిన్ చిత్తరువును గీసి ఆమెకు చూపకుండా దాచినప్పుడు ఆమె పాడే “దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు చాలవులే” అనే సుశీల గీతానికి సీక్వెల్ గా ఘంటసాల గీతం కూడా వుంది. సముద్రపు ఒడ్డున సాగే ఈ టీజింగ్ పాట కొబ్బరి, సరుగుడు చెట్ల మధ్యసాగుతుంది. ఈ పాటలో “నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది… నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది”అనే సినారె ప్రయోగం అద్భుతం. ఘంటసాల పాడే సీక్వెల్ పాటకు ముందు సాకీ వస్తుంది. కానీ సుశీల పాటకు సాకీ వుండదు. “నా చెంప తాకగానే చెలీ నీ చేయి కందెనేమో.. నా చూపు సోకగానే అరెరే నాజూకు తగ్గేనేమో” అంటూ కవ్వించే ఈ పాటలో “నీ కులుకు నడక చూచీ రాజహంసలకు సిగ్గు కలిగే.. నీ తళుకు మోము చూచీ నింగి జాబిలికి నిగ్గు తరిగే’’; ‘’నీ నల్లని వాల్జెడలో విరిసిన మల్లెలు రమ్మనెను….నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పొమ్మనెను” అనే సినారె పదప్రయోగాలు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని యెంతో అలరించాయి. “ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్నది.. ఇలాగే ఉంటుందా తొలిప్రేమ అన్నది.. అలాఅలాఅలా మనసు తేలిపోవుచున్నది” అంటూ ఆరుద్ర రాసిన హీరోతో హీరోయిన్ పరిచయ ప్రభావ గీతాన్ని తమిళనాడులోని సాథనూర్ డ్యాం వద్ద గార్డెన్స్ లో కృష్ణకుమారి మీద చిత్రీకరించారు.. మరో అందమైన పాట కూడా సినారేదే. “అద్దాలమేడ ఉంది అందాల భామ వుంది. మత్తైనమందు వుంది రారారా..మనసైతే రమ్మంది రారారా” పాట సన్నివేశపరంగా పానకాలుద్వారా రహస్యం రాబట్టే ప్రక్రియలో మారువేషాల్లో ఉంటూ ఎన్.టి.ఆర్, రేలంగి, కృష్ణకుమారి పాడేది. జమునారాణి స్వరం ఈ పాటలో విలక్షణంగా వుంటుంది. పాట మధ్యలో రేలంగి బూరవూదే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాట ఇంటర్లూడ్ వద్ద వాడిన బిట్ ‘భార్యాభర్తలు’(1961) చిత్రంలో ‘జోరుగా హుషారుగా షికారు పోదామా’ మ్యూజిక్ బిట్ ని గుర్తుచేస్తుంది. మరో రెండు పాటలు అప్రధానమైనవే! “ఇటుచూడు ఒక్కసారి హరిలో రంగ హరి.. హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యు” అంటూ రేలంగికి మాధవపెద్ది పాడే కొసరాజు పాటలో రేలంగి చాకిరేవు మీదుగా చిన్న ఒంటెద్దు బండి మీద వచ్చే సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రసిద్ధ హాస్యనటులు రేలంగి, రమణారెడ్డి వున్నా, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కావడంచేత, హాస్యరసానికి చిన్నపీటే వేశారు. ఈ చిత్రంలోని కొన్నిసన్నివేశాల్లో మనకు సారథి స్టుడియోలో వుండే కట్టడాలు కనిపిస్తాయి.

నిర్మాత మనోభావాలు

చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మనోభావాలు ఎంతో గొప్పవి. “సినిమా అనేది ఒక మజిలీ. సమసమాజం నా అంతిమ లక్ష్యం. మారుతున్న చిత్రనిర్మాణ ధోరణులతో, నిర్మాత ప్రాధాన్యత పలచబడుతున్న పరిస్థితులతో రాజీపడలేక చిత్ర సన్యాసం చేశాను” అనేవారాయన. “నేటి చిత్రాల్లో కనిపించే పగ, ద్వేషం, ప్రతీకారం, హింస, విధ్వంసం, ఉన్మాదం వంటి అతి ధోరణులు టీనేజర్స్ మీద విషప్రభావాన్ని చూపుతున్నాయి. యాక్షన్ సినిమాలపేరుతో హింసాత్మక కథాంశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే 1982 లోనే చిత్ర నిర్మాణానికి స్వస్తి చెప్పాను” అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు తమ్మారెడ్డి. తీసినవి 11 చిత్రాలే ఐనా అన్నీ జనరంజకమైనవే. ‘లక్షాధికారి’ చిత్రం 11 వారాలు ఆడింది. ప్రముఖ దర్శకుడు పి. చంద్రశేఖరరెడ్డి ఈ చిత్రానికి అసోసియేట్ గా పనిచేశారు. వాహిని, విజయ స్టూడియోల్లో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ చిత్రం తరవాత అక్కినేని నాగేశ్వరరావుతో నిర్మించిన ‘జమీందార్’,‘బంగారు గాజులు’,‘ధర్మదాత’,‘దత్తపుత్రుడు’ వంటి చిత్రాలు రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్ ను తారాస్థాయిలో నిలబెట్టాయి. “చిత్ర నిర్మాణంలోని ప్రతి కదలిక నిర్మాత కనుసన్నల్లో వుండాలి. ప్రతి విషయంలో అతని ప్రమేయం తప్పనిసరి. తన సినిమా మీద ఎవరో స్వారి చెయ్యడం సహించరానిది” అని గట్టిగా నమ్మే తమ్మారెడ్డి బాటలోనే ప్రముఖ నిర్మాతలు వి.బి. రాజేంద్రప్రసాద్, కె. రాఘవ నడుస్తూ చలన చిత్ర నిర్మాణానికి స్వస్తి పలకడం కళామతల్లి దురదృష్టమే!

ఆచారంషణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap