చింతామణి నాటకానికి తగ్గని ఆదరణ

చాలా కాలం తరువాత చింతామణి నాటకం చూశాను. అదీ పూర్తి నాటకం కాదు. భవాని – చింతామణి ఘట్టం మాత్రమే. నిర్వాహకులు అరగంట మాత్రమే టైం ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు మైమరపించి గంటకు పైగా లాగారు. చివరకు సభా కార్యక్రమానికి సమయం లేదంటూ మైక్ కట్ చేసేంత వరకు వారి రాగాలు ఆపలేదు. చింతామణి గా రత్నశ్రీ, భవాని పాత్రలో సాంబ శివారెడ్డి. ఊర్లల్లో వేసే నాటకాన్ని హైదరాబాద్ లో చూపించారు. ఒక్కసారి ఊరిని గుర్తు చేశారు. నాటకం చూసినంత సేపు ఊర్లో వున్నట్టే అనిపించింది. ఒక్కసారి ఊరికి వెళ్లొచ్చినట్లు ఉంది.

ఊర్లల్లో ఇప్పటికీ నాటకానికి అదే క్రేజ్. అదే ఊపు, అదే మత్తు. సెట్టింగులు, తెరలు అక్కరలేదు. రెండు స్టాండింగ్ మైకులు, కాస్త లైటింగ్ ఉంటే చాలు. జనాన్ని పద్యాలతో మెరుపులతో విరుపులతో కట్టి పడేస్తారు. వన్స్ మోర్లు, విజిల్స్ షరా మామూలే. చదివింపులు అయితే సరే సరి. హైదరాబాద్ త్యాగరాయ గానసభ లోనూ ఈనెల 10వ తేదీ అదే జరిగింది. వాల్మీకి జయంతి ఉత్సవాల్లో ఈ నాటక ప్రదర్శన జరిగింది. చదివింపుల రూపం లో 30 వేల రూపాయల వరకు నటి రత్నశ్రీ కి వచ్చేసాయి. నిర్వాహకులు ఇంకో గంట సమయం ఇచ్చి ఉంటే ఇంకెన్ని వేలు వచ్చేవో.

పెద్దగా పద్యాలు పాడింది కూడా లేదు. ఆర్కేష్ట్రా జోష్ లో అన్నీ కొట్టుకుపోయాయి. సంగీత హోరులో ఏమీ అర్ధం కాకపోయినా ఆ మత్తు వేరు. రత్నశ్రీ వేదిక పై ప్రదర్శించిన అభినయ విన్యాసాలు, పాడిన పద్యాలు విశేషంగా ఆకర్షించాయి. ఆమె ఆహార్యం, గజ్జెల రిథమ్, హార్మోనియం, డోలక్ సంగీతం వెరసి నగర ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. పుచ్చా సాంబశివారెడ్డి కూడా మంచి నటుడే. అయితే ఆయన తాతల నాటి క్షేత్రముల్ పద్యం తో పాటు వరస సినిమా పాటలతో హోరెత్తించారు. “సమయం లేదయ్యా.. నాకోసం దూర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు, నన్ను పద్యాలు పాడనివ్వండి” అంటూ రత్నశ్రీ నేరుగా మైక్ లోనే సాంబశివారెడ్డి కి చెబితే గానీ, ఆయన సినిమా పాటలు ఆపలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పద్య నాటక కళాకారుల్లో కొంతమంది కళాకారులకే శృతిలో పాడే సత్తా ఉంది. అందులో రత్నశ్రీ మొదటి వరస లోనే ఉంటారు. ఆమెకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. వివిధ రంగాల్లో ప్రముఖులు ఆమె అభిమానులు. ఆమెకు సత్యబాబు హార్మోనియం పెద్ద ఎస్సెట్. అందుకే త్యాగరాయ గానసభ కు విచ్చేసి ఒక్కొక్కరు 5 వేల రూపాయలు వంతున చదివించారు. నేను ఆ అభిమానులతో మాట్లాడితే, వాళ్ళు ఇక్కడే కాదు… రత్నశ్రీ నాటకం ఎక్కడుంటే వీలును బట్టి అక్కడకు వెళుతుంటారట. ఆమె అభినయం, ఆమె నృత్యాలు, ఆమె పద్యాలు తమకు రీఛార్జ్ రేజునవేట్ చేస్తాయని ఉత్సాహంగా చెప్పారు.

ఇదే వేదిక పై డాక్టర్ వి.డి. రాజగోపాల్, నేను డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ ఎ. ఎల్. కృష్ణారెడ్డి తదితరులు రత్నశ్రీ ని నాటక నట శిరోమణి బిరుదుతో సత్కరించాం. సాంబ శివారెడ్డి ని నాటక నట సార్వభౌమ, వల్లూరి శ్రీహరిరావు ను నాటక సామ్రాట్ బిరుదుతో ఘనంగా సత్కరించడం జరిగింది. కళాకారులకు అభినందనలు.

డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : కంచె శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap