సూపర్ సీనియర్ శ్వేత కోయిల పి. సుశీల

ఆమె సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా, రెండా… ఏకంగా నలభై వేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం వుండదు… ఆమె పాటలో లేని సొగసు వుండదు… ఆ మధుర గాయని పాటల పల్లకి కాలమేఘాల చాటుకు వెళ్ళినా, ఆ మేఘమాలికలు చిరుజల్లులుగా మధుర స్మృతులను అందిస్తూ సంగీత ప్రియుల హృదయాల్లోకి, పంచేంద్రియాల్లోకి ప్రవేశించి గూడుకట్టుకొని కాపురం చేస్తూనే వున్నాయి… వుంటాయి కూడా!! ఆమె చిత్రరంగ ప్రవేశం చేసాక అంతకంటే తియ్యని కంఠం మరొకటి లేకపోయింది. “కన్నె మూగమనసు కన్న స్వర్ణ స్వప్నమై” అంటూ అమృతవర్షిణి కురిపించిన అనర్గళమైన ఆమె గళస్వరం దైవదత్తమైన వరం. పాటకు పరిమళాలు అద్దిన మధురగాయని పులపాక సుశీల నవంబరు 13న ఎనభై తొమ్మిదోపడిలో అడుగిడిన సందర్భంగా ఆమె గురించి కొన్ని మధుర స్మృతులు.

కళా వాగ్దేవి చలనచిత్ర తొలి అడుగులు

విజయనగర సంస్థానాధీశుల సంగీత కళాశాలలో శిక్షణ పొంది, ఘంటసాల వంటి ఎందరో ప్రజ్ఞావంతులు కళామతల్లి సేవలో తరించారు. ఆ పరంపరలో సినీ పరిశ్రమకు పరిచయమైన మరో పుంభావ సరస్వతి ప్రఖ్యాత గాయని పులపాక సుశీల. తండ్రి ప్రముఖ న్యాయవాది ముకుందరావుకు శాస్త్రీయ సంగీతమంటే అభిమానం. తల్లి శేషావతారం కూడా సంగీతాభిమానే. అలా సుశీలకు శాస్త్రీయ సంగీతం మీద అభినివేశం కలిగింది. అందుకే పాఠశాల విద్యతోనే చదువు ముగించి, విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరి గాత్ర సంగీతంలో డిప్లొమా పూర్తి చేసారు. ద్వారం భావనారాయణ శాస్త్రీయ సంగీతంలో సుశీలకు గురువు. అతి పిన్న వయసులోనే సంగీత ఉత్సవాలలో పాల్గొని ఎన్నో బహుమతులు అందుకున్నారు. మద్రాసు సంగీత అకాడమీలో ప్రత్యేక శిక్షణ కోసం వెళ్ళినప్పుడు ఆ సంస్థ అధినేత ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ సుశీలను ప్రోత్సహించి ఆకాశవాణి వారి ‘బాలానందం’ వంటి చిన్నపిల్లల కార్యక్రమాలలో పాడించేవారు. సుశీల గాత్రం విని న్యాపతి రాఘవరావు (రేడియో అన్నయ్య), బందా కనకలింగేశ్వరరావులు ఆమెను బాగా ప్రోత్సహించారు. 1952లో నిర్మాత దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు నిర్మించ తలపెట్టిన ‘పేట్రత్తాయ్’ తమిళ సినిమాలో కోరస్ బిట్లు పాడేందుకు ఓ ఐదుమంది పిల్లల్ని పంపమని సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు, న్యాపతి రాఘవరావును కోరినప్పుడు పదహారేళ్ళ సుశీల కూడా వెళ్ళారు. ఆడిషన్ పరీక్షలు జరిపి సుశీలను ఎంపిక చేసారు పెండ్యాల. లలిత సంగీతమన్నా, సినీ సంగీతమన్నా సుశీలకు యెంతో ఇష్టం కావడంతో మనసు లగ్నంచేసి కోరస్ బిట్లు పాడారు. పెండ్యాలకు ఆమె గాత్రం నచ్చడంతో ఎ.ఎం. రాజాతో కలిసి “ఎదుక్కు అళ్లైత్తాయ్ ఎదుక్కు” అనే యుగళగీతాన్ని పాడించారు. సుశీల పాడిన మొదటి పాట ఇదే. 1953లో ‘పేట్రత్తాయ్’ సినిమాను తెలుగులో ’కన్నతల్లి’ గా ప్రకాశరావు నిర్మించినప్పుడు “ఎందుకు పిలిచావెందుకు..ఈలవేసి సైగచేసి” అనే యుగళగీతాన్ని, “లావొక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యె” అనే పద్యాన్ని పెండ్యాల సుశీల చేత పాడించారు. అలా ఈ మధుర గాయనిని సినీ లోకానికి పరిచయం చేసిన ఘనత పెండ్యాలకు దక్కింది. సౌండ్ రికార్డిస్టు నాగరాజన్ సుశీలను ఏ.వి.ఎం మెయ్యప్ప చెట్టియార్ కు పరిచయం చేసారు. సుశీల చేత మెయ్యప్ప మూడు సంవత్సరాల కాంట్రాక్టు రాయించుకొని వారు నిర్మించే సినిమాలకే ఆమె గళాన్ని పరిమితం చేసారు. ఇతర సంస్థలకు పాడాల్సివచ్చినప్పుడు సుశీల తీసుకున్న పారితోషికంలో సగం మెయ్యప్పకు ఇచ్చేట్లు ఒప్పందం కుదరడంతో ఆమె అడపాదడపా బయటవారికి పాటలు పాడారు. ఘంటసాల బలరామయ్య 1950లో నిర్మించిన ‘శ్రీలక్ష్మమ్మ కథ’ లో సి.ఆర్. సుబ్బరామన్ “గుమ్మడిపూల కమ్మనిగాలి ఊపే వుయ్యాలోయ్”; “చిన్నారి బంగారు చిలకవే నాతల్లి”; “కళ్ళెదుట వుంటావు కన్నొక్కబిడ్డవని”; “నట్టింట మాలక్ష్మి కాలు పెట్టింది” పాటలకు సుశీల చేత కోరస్ పాడించారు. ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’ లో “ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ” అనే పాటను షావుకారు జానకి కోసం సంగీత దర్శకుడు టి.వి.రాజు పాడించారు. వాహినీ వారి ‘బంగారుపాప’లో అద్దేపల్లి రామారావు “ఈ వెన్నెల.. మల్లి విరిపందిరిలోనా” అనే వెన్నెల పాటను; “యవ్వన మధువనిలో వన్నెల పూవుల ఉయ్యాలా” అనే రెండు పాటలను ఎ.ఎం.రాజాతో; “వెన్నెల వేళలు పోయినా ఏమున్నది నాకిక బ్రతుకునా” అనే పాప పాడే పాట; “ధీర సమీరే యమునాతీరే” అనే జయదేవుని అష్టపది కృష్ణకుమారి కోసం సుశీలతో పాడించారు. అలాగే ‘కాళహస్తి మహాత్మ్యం’ సినిమాలో “శ్రీ పార్వతీదేవి చేకోవే శైలకుమారీ” పాటను గోవర్ధనం, సుదర్శనంలు సుశీల చేత పాడించారు. ఆరోజుల్లో ఎం.ఎల్. వసంతకుమారి, లీల, జిక్కి, రావుబాలసరస్వతి, ఏ.పి.కోమల, కె.రాణి, శూలమంగళం రాజ్యలక్ష్మి, ఉడుతా సరోజిని వంటి హేమాహేమీలు నేపధ్య గాయనీ మణులుగా రాణిస్తున్నారు. వారితో పోటీని తట్టుకొని నిలబడటం అంత తేలిక కాదు. కానీ సుశీల మాత్రం దాన్ని సుసాధ్యం చేసారు.

P Susheela

అన్నపూర్ణతో విరిసిన అనురాగం

1955లో అక్కినేని, దుక్కిపాటి మధుసూదనరావులు స్థాపించిన అన్నపూర్ణా సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘దొంగ రాముడు’లో పాడే అవకాశం సుశీలకు లభించడంతో ఆమె ప్లేబ్యాక్ గాయనిగా స్థిరపడే అవకాశాలు మెరుగయ్యాయి. అక్కినేని చెల్లెలుగా నటించిన జమున పాత్రకు పాడేందుకు గాయనికోసం అన్వేషణలో వున్న దుక్కిపాటికి ఏ.వి.ఎం స్టూడియోలో ‘కణ్వణే కన్కండ దైవం’ (తెలుగులో ‘పతియే ప్రత్యక్షదైవం’ గా డబ్బింగు చేసారు) కోసం పాట పాడుతున్న సుశీల గళం వినిపించింది. వెంటనే సుశీలను ‘దొంగరాముడు’ సినిమాలో పాడించేందుకు దుక్కిపాటి నిర్ణయం తీసుకున్నారు. అలా సుశీల జమునకోసం పెండ్యాల సంగీత దర్శకత్వంలో “అనురాగము విరిసేనా ఓ రేరాజా… అనుతాపము తీరేనా”; “తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబూ”, “బలే తాత మన బాపూజీ! బాలల తాత బాపూజీ”, అనే మూడు పాటలు, “బాల గోపాల మా ముద్దుల కృష్ణా” అనే తరంగం పాడారు. అన్నపూర్ణా వారి తొలి రికార్డింగులోనే పాపం సుశీలకు మందలింపు ఎదురైంది. పాడాల్సిన పాట రాసుకున్న కాగితం కనుపించక ఆందోళన పడుతున్న సుశీలను దుక్కిపాటి మందలించారు. అది జీవితంలో ఆమెకు ఒక మరపురాని మందలింపుగా మిగిలిపోయింది. రికార్డింగు పూర్తయ్యాక దుక్కిపాటి, దర్శకుడు కె.వి.రెడ్డి ఆ పాటలు వింటుండగా, ‘మిస్సమ్మ’ షూటింగులో వున్న దర్శకుడు ఎల్.వి.ప్రసాద్, చక్రపాణిలు వచ్చి పాటవిని నిశ్చేష్టులయ్యారు. అలా విజయా సంస్థలోకి సుశీల సులభంగానే ప్రవేశించగలిగింది. ‘మిస్సమ్మ’ చిత్రంలో ఎ.ఎం.రాజాతో కలిసి “బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే” యుగళగీతాన్ని, “బాలనురా మదనా విరి తూపులు వేయకురా” అనే జావళిని సుశీల పాడారు. తమిళ వర్షన్ లో కూడా ఆ పాటలు సుశీలే పాడారు. ఆ తరవాత వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది. విజయా వారికి వరసగా ‘మాయాబజార్’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మ కథ’, ‘సి.ఐ.డి’ వంటి సినిమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు. ముఖ్యంగా ‘మాయాబజార్’ లో “అహ నా పెళ్ళియంట.. ఓహో నా పెళ్ళియంట” పాట సుశీలకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది.

హీరోయిన్ల పాటలతో బిజీగా

‘దొంగరాముడు’ తరవాత అన్నపూర్ణా వారు నిర్మించిన ‘తోడికోడళ్ళు’(1957) సినిమాలో సావిత్రికి అన్ని పాటలూ సుశీలే పాడారు. ఏ.వి.ఎం నుండి బయటకు వచ్చాక సుశీల అసలైన జైత్రయాత్ర ప్రారంభమైంది. పేరెన్నికగన్న సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, ఆదినారాయణరావు, మహదేవన్, విశ్వనాథన్-రామ్మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, ఇళయరాజా, అశ్వద్ధామ, చలపతిరావు, రమేష్ నాయుడు, జి.దేవరాజన్, ఎల్.వైద్యనాదన్, టి.జి.లింగప్ప, జి.కె.వెంకటేష్, సత్యం, చక్రవర్తి, రాజ్-కోటిల వద్ద హీరోయిన్లకు కొన్నివేల పాటలు పాడారు. ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్, సౌందర్ రాజన్, శిరిక్కాళ గోవిందరాజన్, రామకృష్ణ వంటి గాయకులతో ఎన్నోపాటలకు గళం కలిపారు. హిందీలో లతా మంగేష్కర్ తరవాత అత్యధిక పాటలు పాడిన గాయనీమణి సుశీల మాత్రమే. అందరికీ ఫేవరేట్ పాటలున్నట్లే సుశీలకు కూడా తెలుగులో కొన్ని పాటలున్నాయి. ‘చక్రవాకం’ సినిమాలో “వీణలోనా తీగలోనా ఎక్కడున్నదీ రాగమూ” అనే చక్రవాక రాగంలో మహదేవన్ కూర్చిన పాటంటే సుశీలకు చాలా ఇష్టం. ఇక లతా మంగేష్కర్ విషయానికొస్తే ‘ఏక్ కలి ముస్కాయి’ సినిమాలో మదన్ మోహన్ బాణీ కూర్చిన “న తుమ్ బేవఫా హో..న హమ్ బేవఫా హై..మగర్ క్యా కరే, అప్నీ రాహే జుదా హై” పాటంటే సుశీలకు యెంతో ఇష్టం. ఆమే తనకు స్పూర్తి అని ఎన్నోసందర్భాల్లో సుశీల చెప్పుకున్నారు కూడా. సుశీల పాడిన పాటలు వేటికవే సాటి. ”పాలకడలిపై శేష తల్పమున”(చెంచులక్ష్మి), “ఇది మల్లెల వేళయనీ”(సుఖదుఃఖాలు), “చల్లని వెన్నెల సోనలు”(వెలుగు నీడలు), “అలిగిన వేళనే చూడాలి”(గుండమ్మకథ), “పాడమని నన్నడగవలెనా”(డాక్టర్ చక్రవర్తి), “జననీ శివకామినీ”(నర్తనశాల), “మనసే అందాల బృందావనం”(మంచికుటుంబం), “శ్రీరామ నామాలు శతకోటి”(మీనా), “పాడనా తెనుగు పాటా”(అమెరికా అమ్మాయి), “ఝుమ్మందినాదం”(సిరిసిరిమువ్వ), “ముందుతెలిసెనా ప్రభూ”(మేఘసందేశం), “నగుమోము చూపించవా గోపాలా”(అమరశిల్పి జక్కన్న), “వ్రేపల్లె వేచెను”(శారద), “ఆరనీకుమా ఈ దీపం”(కార్తీకదీపం), ”ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు”(జీవనజ్యోతి), “ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయా”(ముత్యాలముగ్గు), “గోరింట పూచింది కొమ్మ లేకుండా”(గోరింటాకు), “ఈ సంధ్యలో..కెంజాయలో”(మూగప్రేమ), “ఏమని పాడెదనో ఈ వేళా”(భార్యా భర్తలు), “అమ్మ కడుపు చల్లగా”, (సాక్షి), ”లాలీ లాలీ లాలీ లాలీ”(స్వాతిముత్యం)…. ఇలా చెప్పుకుంటూ పొతే వందలు కాదు వేల పాటలే గుర్తుకొస్తుంటాయి. ఆమె ఆలపించిన పాటలకు కొలమానాలు లేవు. అభిమానులు ఆమెను “దక్షిణ భారత లతామంగేష్కర్”, “దక్షిణ భారత నైటింగేల్”, “గాన సరస్వతి”, “మెలోడీ క్వీన్”, “గాన కోకిల” గా కీర్తిస్తుంటారు. తెలుగుతో బాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, ఒరియా, సంస్కృతం, బడగ, తుళు, సింహళ వంటి 16 భాషల్లో సుశీల నలభైవేలకు పైగా పాటలు పాడారు. ఏ భాషలో పాడినా ఆ పాట సాహిత్యాన్ని స్పష్టంగా ఉచ్ఛరించడం సుశీలకే సాధ్యమైంది. ఇతరదేశాల్లో ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇస్తూవచ్చారు. ఆమె 90వ దశకంలో సినిమా పాటల్ని చాలావరకు తగ్గించుకొని భక్తి పాటల ఆల్బంలకు ఎక్కువగా తన సమయాన్ని కేటాయించారు.

సరిగమల సంసారంలో..అపశ్రుతి

సుశీలది ప్రేమవివాహం. గోదావరి రాజవంశానికి చెందిన రాజా రామమోహనరావు మద్రాసులో వైద్యవిద్య చదువుతుండగా సుశీలతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రణయంగా మారి పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. భర్తకు సంగీతమంటే ఇష్టం. సుశీలను బాగా ప్రోత్సహించారు. హృద్రోగంతో బాధపడుతున్న భర్తకు 1990లో సుశీల అమెరికాలో శస్త్రచికిత్స చేయించారు. కానీ, చికిత్స జరిగిన ఆరు రోజుల్లోనే రామమోహనరావు అమెరికాలోనే కన్ను మూశారు. భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేక పోయారు. స్వదేశం తిరిగి వచ్చిన తరవాత చాలాకాలం ప్లేబ్యాక్ సింగింగ్ కు దూరమయ్యారు. సుశీలకు జయకృష్ణ ఒక్కడే కొడుకు. కోడలు సంధ్య కూడా సినిమాల్లో పాటలు పాడుతుంది. సుశీలకు జయశ్రీ, శుభశ్రీ అనే ఇద్దరు మనుమరాండ్రు. ఆమె పాటల ప్రస్థానానికి స్వస్తి చెప్పాక “పి.సుశీల ట్రస్ట్” పేరిట స్వచ్చంద సంస్థను ఏర్పాటుచేసి తన పుట్టినరోజు (13, నవంబరు) సీనియర్ ఆర్టిస్టులకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ ట్రస్టు తరఫున జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్న వారిలో టి.ఎం.సౌందర్ రాజన్, పి.బి. శ్రీనివాస్ వున్నారు. సుశీల జాతీయ అవార్డును స్వీకరించిన వారిలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.జే. ఏసుదాస్, పి. జయచంద్రన్, ఎస్. జానకి, వాణీజయరాం, ఎల్.ఆర్.ఈశ్వరిలు మొదలైనవారు వున్నారు.

సంగీత సరస్వతికి కలికి తురాయిలు

సుశీలకు భారత ప్రభుత్వం 2008లో ‘పద్మభూషణ్’ పురస్కారం ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలై మామణి’, ‘భారతీదాసన్’, ‘అరింన్ఘర్ అణ్ణా’ అవార్డులను సుశీలకు ప్రదానం చేసింది. 2005లో స్వరాలయ ఏసుదాస్ అవార్డు కూడా సుశీల పుచ్చుకున్నారు. 2006లో ఫిలింఫేర్ వారి జీవిత సాఫల్య పురస్కారం, 2011లో దేవరాజన్ సంగీత పురస్కారం సుశీలకు దక్కాయి. 2011లో టి. సుబ్బురామిరెడ్డి ఆమెకు ‘విశ్వ విఖ్యాత సంగీత కళా సరస్వతి’ బిరుదు ప్రదానం చేసారు. జాతీయ స్థాయిలో సిరిసిరిమువ్వ, మేఘసందేశం, ఎం.ఎల్.ఎ ఏడుకొండలు సినిమాలలో పాటలకు, రెండు తమిళ చిత్రాల పాటలకు ఐదుసార్లు ఉత్తమ గాయని అవార్డును సుశీల అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గాయనిగా ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు, మూడు సార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, రెండు సార్లు కేరళ ప్రభుత్వ అవార్డులు ఆమెకు దక్కాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు సుశీలకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసారు. సంగీతమే జీవన సర్వస్వంగా ఎంచుకొని జీవిస్తున్న సుశీలకు పరమాత్మభవుడు మరుజన్మలో కూడా సుశీలగానే జన్మనిచ్చి సంగీతాభిమానులను అలరింపజేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుందాం!

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap