‘ప్రపంచం’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడింది. తమిళంలో ఈ సినిమా పేరు ‘ఉలగం’. ఈ సినిమా 10 జూలై 1953 న విడుదలైంది. తెలుగు వర్షన్ లో నాగయ్య, ఈలపాట రఘురామయ్య, రామశర్మ, జి. వరలక్ష్మి, లక్ష్మీకాంత, లలిత, పద్మిని, కమలకుమారి, ఎస్.జానకి, కాంచన, ఛాయాదేవి, కనకం మొదలగువారు ముఖ్య తారాగణం. ఈ సినిమా నిర్మాత ఎం.ఎచ్.ఎం. మూనాస్ శ్రీలంక నివాసి. సంగీతం ఎం.ఎస్.జ్ఞానమణి & పూర్ణానంద, మాటలు, పాటలు శ్రీశ్రీ సమకూర్చారు. ఎల్.ఎస్. రామచంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. తొలిసారి శ్రీశ్రీ తెరమీద కనిపించిన సినిమా ప్రపంచం. అంతేకాదు ఈ సినిమా కరపత్రాలను హాలీవుడ్ కంపెనీ పర్యవేక్షణలో తొలిసారి విమానం నుండి భూమి మీదకు విసరి పబ్లిసిటీలో కొత్తదనాన్ని ప్రవేశపెట్టారు. ఈ సాంఘిక చిత్ర నిర్మాణానికి పాతిక లక్షలు ఖర్చు పెట్టడం కూడా ఒక వింతగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో నాలుగు లక్షల పెట్టుబడితో చిత్ర నిర్మాణం పూర్తయ్యేది. అంతేకాదు నిర్మాతలకు ఆ సినిమాలు లాభాలు కూడా ఆర్జించి పెట్టేవి. కానీ ఈ ప్రపంచం సినిమా రెండు భాషల్లోనూ భారీ నష్టాలు చవిచూచిన భారీ చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది. మరో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తే అక్కడ కూడా పరాజయమే ఎదురైంది. మొత్తం 101 కేంద్రాలలో ఈ సినిమా విడుదలైంది. రెండు వారాలు తిరక్కుండానే సినిమా రీళ్ల డబ్బాలు వెనక్కువచ్చేశాయి. ఈ సినిమా మదురై లోని చిత్రకళా మూవీటోన్, కోడంబాకం వద్ద వున్న స్టార్ కంబైన్స్ స్టూడియో లలో నిర్మించారు (ఈ స్టూడియోలు ఎప్పుడో మూతపడ్డాయి). ఆరోజుల్లో మద్రాస్ నగరంలో ప్రాచుర్యంలో వున్న వివిధ రకాల నృత్యాలను కమలకుమారి, లలిత, పద్మిని, ఇతర నృత్యకారులచేత అభినయింపజేశారు. అలాగే, దారాసింగ్ వంటి యోధులతో మల్లయుద్ధాలు, కుస్తీలు కూడా ఈ చిత్రంలో కోకొల్లలు. ఒక బీదకుటుంబంలో వున్న వ్యక్తి స్వశక్తి మీద ధనవంతుడౌతాడు. అతనికి ఇద్దరు కుమారులు. వారిద్దరూ విభిన్న మనస్తత్వాలు కలిగి, వారి భార్యల వలన ఇక్కట్లు పడతారు. కథ ఎన్నో మలుపులు తిరిగి చివరకు సినిమా సుఖాంతమౌతుంది.
1940-50 దశకంలో కొందరు శ్రీలంక నిర్మాతలు మద్రాస్, సేలం, మదురై నగరాలలో సినిమాలు నిర్మించారు. అలా వచ్చినవారిలో నిర్మాత మూనాస్ కూడా ఒకరు. మూనాస్ చాలా ధనవంతుడైన వర్తకుడు. ఎగుమతి, దిగుమతి వ్యాపారంలోనే కాకుండా యుద్ధకాలంలో కాంట్రాక్టులు చేపట్టి రెండుచేతులా సంపాదించాడు. ఇండో నేషనల్ బ్యాంక్ కూడా స్థాపించాడు. అతడు కుటుంబ సమేతంగా మద్రాస్ వచ్చాడు. అతనికి సినిమా నిర్మించాలనే కోరిక అధికంగా వుండేది. అతని భార్య ఒక కథ రాసింది. ఆ కథనే సినిమాగా నిర్మించాలనేది మూనాస్ అభిలాష. ఆ కథలో పస లేకపోవడంతో, ఎంతమంది దర్శకులకు చూపించినా అది వారికి నచ్చలేదు. అందుకు ఇష్టపడని మూనాస్ తనే చిత్రనిర్మాణానికి పూనుకున్నాడు. ఈ సినిమా కథలో 150 కి పైగా పాత్రలున్నాయి. తొలుత గోల్డన్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభించారు. చిత్రీకరించిన సన్నివేశాలు మూనాస్ కు ఒకపట్టాన నచ్చేవి కావు. దాంతో వాటినే మళ్ళీ మళ్ళీ తీయించేవాడు. అంతేకాదు ముడి ఫిలిమ్ విపరీతంగా ఖర్చయేది. సినిమా నిర్మాణానికి ఏకంగా మూడేళ్లు పట్టింది.
ప్రపంచం సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులకు నిర్మాత ఒక పోటీ పెట్టాడు. 1953 లోనే ఆ పోటీ విజేతలకు వరసగా రూ.25,000, 15,000 మరియు 10,000 తొలి మూడు బహుమతులుగా ప్రకటించాడు. ఇవికాక ఎక్కువ సంఖ్యలో ఎంట్రీలు పంపేవారికి మరో రూ. 50,000 బోనస్ బహుమతులు కూడా ప్రకటించాడు. తెలుగు ‘ప్రపంచం’ సినిమా కానీ, తమిళ ‘ఉలగం’ సినిమా టికెట్లు కానీ కొని చూసినవారికే ఈ పోటీ లో పాల్గొనే అర్హత కలిపించాడు. సినిమాలో ఉన్న మొత్తం 15 పాటల్లో అన్నిటికన్నా గొప్ప పాట ఏదో చెప్పాలి అనేది ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న. అలాగే ఎక్కువ రసవంతమైనపాట, ఎక్కువ విషాదకరమైన పాట ను కూడా గుర్తించడం మరో రెండు ప్రశ్నలు. అలాగే ఈ చిత్రం లో వున్న మొత్తం 5 స్త్రీ పాత్రల్లో అత్యంత విషాదకరమైన పాత్రను గుర్తించడం; 4 ముఖ్య పురుష పాత్రల్లో కూడా అన్నిటికన్నా విషాదకరమైన పాత్రను గుర్తించడం కూడా మరో ప్రశ్న. చివరగా నాలుగు డ్యాన్స్ పాటల్లో అత్యంత రమ్యమైన దానిని కూడా గుర్తించమని ప్రశ్న పత్రంలో ప్రకటన చేశారు. ఈ పోటీ 31 డిసెంబర్ 1953తో ముగిసింది.
ఇంతకూ మూనాస్ ఈ భారీ ఫ్లాప్ సినిమాను ఎందుకు నిర్మించాడు?
ఇందుకు ఓ కారణం వుంది. మూనాస్ మంచి వ్యాపార దక్షుడు. ప్రపంచ యుద్ధకాలంలో ఇండియా కు వచ్చి కాంట్రాక్టులు చేపట్టాడు. వాటిద్వారా ఆరోజుల్లోనే లక్షలు గడించాడు. అయితే అలా ఆర్జించిన సొమ్మును తనదేశం శ్రీలంకకు చేర్చలేకపోయాడు. నాటి బ్రిటీష్ ప్రభుత్వం భారతీయ కరెన్సీని శ్రీలంకకు తరలించేందుకు అంగీకరించలేదు. అందుచేత మూనాస్ ఆ సొమ్ముని భారత్ లోనే ఖర్చు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకు సినిమా నిర్మాణమే సరైనదని భావించాడు. పెద్దపెద్ద తారాలనందరినీ బుక్ చేశాడు. నాగయ్య వంటి నటులకు పాతికవేల పారితోషికం సమర్పించాడు. టెక్నీషన్లకు మూడేళ్లపాటు భారీగా జీతాలు, బోనస్ లు చెల్లించాడు. భారీ సెట్టింగులు సాంఘిక సినిమాకు అవసరం లేకపోయినా వేయించాడు. స్టూడియోలకు పెద్ద మొత్తాలలో అద్దెలు చెల్లించాడు. సినిమా నిర్మాణంలో కాకుండా ఏదైనా పరిశ్రమలో పెట్టుబడి పెట్టివుంటే ఎందరో భావితరాలకు ఉపయుక్తంగా వుండేది. కానీ అలా చేయలేదు. మూనాస్ మొత్తం పద్నాలుగేళ్లు మద్రాస్ లో వున్నాడు. ఇక్కడ సంపాదించిన సొమ్మంతా ఖర్చుపెట్టేశాక శ్రీలంకకు వెళ్లిపోయాడు. ఈ చిత్రంతో సరిసమానంగా భారీగా నష్టపోయిన మరో చిత్రం విజయా వారి ‘చంద్రహారం’. అయితే చంద్రహారం జానపదం… ప్రపంచం చిత్రం సాంఘికం. అంతే తేడా!
-ఆచారం షణ్ముఖాచారి