సాహితీ మకుటంలో కొత్త వెలుగులు

25 మంది కవులు – 25 మణిపూసల పుస్తకాలు ఒకే వేదికపై ఆవిష్కరణ
ప్రాచీనం నుంచి ఇప్పటివరకు తెలుగు భాషలో అనేక ప్రక్రియలు వస్తూనే ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నిలదొక్కుకుని సాహితీ జగతులో నకతాలె మెరుసుంటాయి.
సాహిత్య రంగంలో నూతనంగా వచ్చి అతి తక్కువ కాలంలోనే బహుళ ప్రాచుర్యం పొందిన లఘు గేయ కవితా ప్రక్రియ ‘మణిపూసలు’. దీని రూపకర్త వడిచర్ల సత్యం. ‘శ్రీపద’ కలం పేరుగల వడిచర్ల సత్యం వృత్తి రీత్యా తెలుగు భాషోపాధ్యాయులు. ఇంతవరకు పద్యము, పదము, పాట, గేయము, పొడుపు కథ వంటి వివిధ రకాల ప్రక్రియల్లో సంపుటాలను తెచ్చారు. మణిపూసలు ప్రక్రియలో ‘వడిచర్ల మణిపూసలు’ పేరుతో తొలి పుస్తకం ముద్రించారు. ఇందులో 360 మణిపూసలు ఉన్నాయి.
లయబద్దంగా సాగే ఈ ప్రక్రియ వినడానికి ఓ పాటలాగా ఉంటూ పాఠకులను హత్తుకుంటుంది. పత్రికలు, వాట్సాక్స్ సహకారంతో మణిపూసలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. సరికొత్త మార్గంలో సాగుతున్నాయి. కొత్త వారితోపాటు కవిపండితులూ ఎందరో రాస్తున్నారు. ఈ మణిపూసలకున్న మాత్రల పరిమితి, కవితా మెరుపు, లఘురూపం, గేయశైలి వంటి ప్రత్యేకతలు కవులను, పాఠకులను ఆకర్షిస్తున్నాయి. అలరిస్తున్నాయి.
ఒకే వేదికపై ఒకేసారి:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 25 మంది కవులు రాసిన 25 మణిపూసల పుస్తకాలను ఇటీవల ఒకేసారి, ఒకే వేదికపై ఆవిష్కరించారు. ఈ వినూత్న కార్యక్రమం ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ నమోదైంది.
మణిపూసలు రాస్తున్న కవులను అభినందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘గోల్కొండ సాహితీ కళాసమితి’ హైదరాబాద్ సంస్థవారు 2019కి సంబంధించి 150 మంది కవులకు పురస్కారాలను అందించింది. పురస్కార గ్రహీతల్లో పిల్లలు కూడా ఉండడం గమనార్హం.
వెయ్యికి పైగా రాసిన 15 మంది కవులకు ‘మణిపూసల కవి శిరోమణి’ పురస్కారంతో గౌరవించారు. వేముల చరణ్ సాయిదాస్ 4000కు పైగా మణిపూసలు రాసినందు వల్ల ‘మణి పూసల వేమన’గా పేరు పొందారు.

వడిచర్ల మణిపూసలు’ నుంచి ఒక మణిపూస…
అకాలపు వర్షాలు
పంటలకు నష్టాలు
చెమటోడ్చిన రైతులకు
మిగిలేవి కష్టాలు! ….

ఇలా అనేక సామాజిక అంశాలతో లయబద్దంగా సాగిన ఈ మణిపూసలు పాఠశాల విద్యార్థులు పాడుకునేలా ఉన్నాయి.
తాండ్ర చిరంజీవి రచించిన ‘మార్గం చూపు మణిపూసలు’ అనేది సామాజిక అంశాల సమాహారం.
శివాజీ రవీందర్ అంబేడ్కర్ జీవితంలోని అనేక ముఖ్యమైన సంఘటనలను ఓ మాలలాగా కూర్చిన మణిపూసలున్నాయి. బూరెం రాజు రచించిన ‘అక్షర ముత్యాలు’లో చదువు గురించి రాసిన మణిపూసలు బాగున్నాయి.
మల్లెకేడి రామోజీ ‘నల్లమల మణిపూసలు’లో కూడా అనేక సామాజిక అంశాలపై మణిపూసలను రచించారు.

గద్వాల సోమన్న రచించిన ‘గద్వాల మణిపూసలు’లో
తెలుగు భాష పూలదోట
తెలుగు భాష కంచుకోట
ధ్వనించాలి ప్రతి నోట
పంచదార తెలుగు మాట

తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరిస్తూ ఈ సంపుటిలో అనేక మణిపూసలు ఉన్నాయి. కట్టిపడేసేలా ఉన్న మిగతా కవుల మణిపూసలు మనల్ని ఈ ప్రక్రియపై ప్రేమలో పడేస్తాయి. వీలైతే సహృదయ పాఠకులు ఆ సంపుటాలను చదివి మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
-శాంతి కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap