సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది…”కళల కాణాచి తెనాలి”

జయహో..”ఝనక్ ఝనక్ పాయల్ భాజే”

“కళల కాణాచి తెనాలి”… రంగస్థల వైభవాన్ని ఇనుమడింపజేస్తున్న వేదిక.
______________________________________________________________________
సుప్రసిద్ధ తెలుగు సినీ రచయిత, మాటలమాంత్రికులు, డాక్టర్ బుర్రా సాయిమాధవ్ గారు ఈ వేదిక స్థాపకులన్నది అందరికీ తెలిసిందే.
వారసత్వ కళారాధనలో నిత్యవిద్యార్ధిగా.. సినీజగత్తులో పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ… ఎంతో ఒద్దికగా స్వస్థలం తెనాలిలో రంగస్థల పండుగకు ముచ్చటైన తోరణంగా నిలుస్తున్నారు ఆయన.

ఈ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ… మరొకసారి ప్రత్యేకంగా చెప్పుకోదగిన సందర్భమిది..
బుర్రా సాయిమాధవ్ గారి ప్రోత్సాహంతో తెనాలి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం సాక్షిగా ‘రంగస్థలం’ పులకించిన వేడుక ఆదివారం (17/07/22)న జరిగింది. తెలుగు నాటకరంగం గర్వపడే ప్రయోగాత్మక ప్రదర్శన కు ” కళల కాణాచి” శ్రీకారం చుట్టింది. ప్రోత్సహించింది. డాక్టర్ సాయిమాధవ్ బుర్రా వారి నేతృత్వంలో డాక్టర్ఎమ్. ఎస్. చౌదరి గారి దర్శకత్వంలో న్యూ స్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్,(New Star Modern Theatre Arts) విజయవాడ వారి “ఝనక్ ఝనక్ పాయల్ భాజే” నాటకం అద్భుతం. కాదుకాదు.. అంతకుమించి అన్నట్లుగా ప్రదర్శించారు. దశాబ్దాల కళావైభవ చరిత్ర తర్వాత తెలుగు నాటకరంగంలో మెరిసిన మరొక ఆణిముత్యంగా ఈ నాటకాన్ని చెప్పుకోవచ్చు. అనేకమార్లు ప్రభుత్వ స్వర్ణనందులు కైవసం చేసుకుని.. నాటకరంగంలో సృజనాత్మక దర్శకేంద్రునిగా.. నటుడిగా పేరొందిన డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు వందమంది కళాకారులతో ఈ నాటకాన్ని నడిపారు. సాంస్కృతిక పునరుజ్జీవానికి, సామాజిక చైతన్యానికి ఆలంబనగా ఈ నాటకం నిలుస్తుంది. వివిధకోణాల్లో జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించగల సత్తా ఒక కళాకారుడిలోనూ ఉంటుందని…అవసరాలను బట్టి తమ కండబలం పెంచుకోవాలని డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు ఈ నాటకం ద్వారా నిరూపించారు. కోవిడ్ నేపధ్యంలో కొంత గ్యాప్ తీసుకున్న చౌదరి గారు తెలుగు నాటకరంగంలో ప్రయోగాత్మక ప్రదర్శనతో సత్తా చూపి “రంగస్థల బాహుబలి” గా నిలిచారు. నాటక రచనలో ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేదు. పదునైన మాటలతో చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా పాత్రల సంభాషణ చెప్పించారు. ప్రేక్షకుల మధ్యలో నుంచి పాత్రలు రంగప్రవేశం.. నెలవంక, శివలింగం సెట్.. లైటింగ్ ఎఫెక్ట్స్, కమర్షియల్ సినిమాటిక్ స్టంట్స్.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. నాటకం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు రెండుగంటల పాటు థియేటర్ మొత్తాన్ని డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు కట్టిపడేసి తన అధీనంలోకి తీసుకున్నారు. థియేటర్ లో మన పక్కన కూర్చున్న వ్యక్తి ఏమైనా పలకరిస్తే.. మనం తలతిప్పితే ఏదొక సీన్, డైలాగ్ మిస్సవుతామా.. అనే వాతావరణం సృష్టించారు.

Writer and directer MS Chowdary

నాటకంలోకి తొంగిచూస్తే..
సారంగపాణి పాటతో నాటకం ప్రారంభమవుతుంది.
చెట్టుకు వేరు ఆయువు ఇచ్చినట్టే… మాకు ఎవరు కలరు.. మీరు తప్ప.. ప్రేక్షకుల చప్పట్లే మాకు ఊపిరి అంటూ ఒక కళాకారుడుగా ఆహ్వానిస్తాడు. తనది ‘నటరాజపురం’… సకల కళాకారుల నిలయం..60ఏళ్ల కిందట… వారి తాత గారి కళాబృందం.. ప్రదర్శనల నిమిత్తం ఊరూరా తిరిగేక్రమంలో ఒక నిర్మాన్యుష్య దట్టమైన అడవి, లోయల మార్గాన పయనిస్తున్నప్పుడు భారీ తుఫాను సంభవిస్తుంది. ఆ ఆపద నుంచి తప్పించిన నటరాజస్వామికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు… అక్కడే ఏర్పడిన ఊరు ‘నటరాజపురం’. వరదల నుంచి ఊరు కాపాడుకునేందుకు, రాకపోకల నిమిత్తం వాగుపై వంతెన నిర్మాణానికి కళాకారులంతా పూనుకుంటారు. ఊరూరా ప్రదర్శనలతో సేకరించిన సొమ్మును షేర్ దాదా బందిపోటు దళం దౌర్జన్యంగా లాక్కోవడమే గాకుండా.. కళాకారుల కుటుంబ మహిళల మానప్రాణాలకు హానికలిగిస్తుంటారు. పరమశివుడు ఎప్పటికైనా తమను షేర్ దాదా ముఠా నుంచి కాపాడతాడని ఊరి పెద్ద బాబా నమ్మకం. ఆ ఆశతోనే భిక్కుభిక్కుమంటూ బతుకుతున్న ఊరికి.. వివిధ పరిణామాలతో శివన్న దళం (అప్పటికే బ్రిటీషు సామ్రాజ్యాన్ని ముప్పతిప్పలు పెడుతున్న భారతీయ తీవ్రవాద దళం) అక్కడికి వస్తారు. నిత్యం భయంతో బతికే కళాకారుల పిరికి గుండెల్లో ధైర్యాన్ని నూరిపోస్తారు. బందిపోట్లతో పోరాటానికి తలపడే విధంగా తర్ఫీదిస్తారు. పిల్లాపెద్దా ముసలీముతక తేడాలేకుండా ఆయుధాలతో పోరాడి ఎట్టకేలకు షేర్ దాదాను అతడి అనుచరులను మట్టుబెట్టడంతో …పీడ విరగడైందని పండుగజేసుకోవడం.. సారంగపాణి పాట విడిచి మాటతో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పటంతో నాటకం ముగుస్తుంది.

Presented by New Star Modern Theatre Arts, Vijayawada

హైలెట్స్..
నాటకం ఆరంభంలోనే
ఓం నమఃశివాయ: అంటూ భిక్షాటనతో..
ప్రేక్షకుల మధ్యలో నుంచి నలువైపులా నుంచి వేదికపైకి ఆర్టిస్టులు ప్రవేశం…

  • కష్టానికి నిర్వచనం షేర్ దాదా నోటివెంట ఆకట్టుకునే విధంగా.. కష్టపడి సంపాదించిన సొమ్ము అని కళాకారులు అనగానే… గుర్రాలను సాకడం, కొండలపై స్వారీలు చేయడం, దోపిడీలు ఎంత కష్టమో….మీకు తెలుసా.. అని ప్రశ్నించడం బాగుంది.
  • ఇరువర్గాలకు పోటీలో కళాకారులను బందిపోట్లు మట్టుబెడతారు. ఎర్రమట్టి, గొర్రెబొచ్చు, మిడత (బందిపోటు ముఠా సభ్యుల పేర్లు) గెలిచారు. వాళ్ల వాటా వాళ్లు తీసుకుని వెళ్లారు. మరి, షేర్ దాదా వాటా ఏదని…షేర్ దాదా ఒక కళాకారిణిని భుజానకెత్తుకుని తీసుకుని వెళతాడు. అందరూ కలిసి స్వామిబాబా వద్దకు చేరుకుని రోదిస్తుంటే..చూపరులు కంటతడిపెట్టిన సన్నివేశం.
  • అప్పటికే కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను పోగొట్టుకున్న కోదండపాణి..”ఎంతకాలం ఇలా ఏడుస్తాం.. అందరూ చేయి చేయి పట్టుకొని వాగులో దూకి చనిపోదాం… ” అనడం ఊరిపెద్ద వారించడం. శివుడు ఆదుకుంటాడని చెప్పడం…జై భారత్ అంటూ తెల్ల వాడి ఉరి..
    కళాకారులు నలుగురు ఆత్మబలిదానం.. బాబాతోపాటు నలుగురు తీవ్రవాదులు అడవిలోకి ప్రవేశం. సంస్కృతి, సంప్రదాయం, నీతి నియమాలను కాపాడే కళాకారులు… తమను కాపాడమని వేడుకోవడం…
    కళను గుర్తించని రాజ్యం స్మశానంతో సమానం అని నటరాజపురానికి అండగా ఉండటం. అక్కడ్నే మల్లడుగు మల్లన్న.(మహావీర మల్లన్న) అనే రైతు కూడా జతకలిసే సన్నివేశాలు ఆసక్తని రేపాయి.
    శివన్న, కేశవ, గోపన్న, మస్తాన్ కేరెక్టర్లు
    ధైర్యప్రదర్శనలో ఒకరిని మించి ఒకరు నిలిచారు.
  • సమస్యను ఎదిరించాలి.. పోరాడాలి..గెలవాలని… అడవిలో వేటాడటం తెలిసిన వాడే బతుకుతాడు. ఇకనుండి సైనికులు గా మారండని…రంస్థలం రణస్థలమే.. అంటూ శివన్నదళం విధించిన మోకాళ్ల శిక్ష.. వాళ్లకు తర్ఫీదు ఇచ్చే క్రమంలో పాటకు తగ్గ నృత్యం… హైలెట్..హుయ్..హుయ్ అంటూ…
    మాటలన్నీ పాటగా చెప్పమని.. తండ్రికి ఇచ్చిన మాటకు సారంగపాణి కట్టుబడటం..
    మల్లన్న, కోదండపాణి కూతురు ప్రేమ సన్నివేశం అద్భుతం..
  • మల్లడుగు మల్లన్నగా వాసు గారు తన నట విశ్వరూపం ప్రదర్శించారు. ఆనందం, దుఃఖం, ఆవేదన, ఆవేశం.. ఇలా తన ఎమోషన్స్ కు తగ్గట్టుగా చిటికెలతో నోరు ఆడిస్తూ మేనరిజం.. తన చెల్లెల్ని బందిపోట్లు అత్యాచారం చేసిన దృశ్యాన్ని తలచుకుంటూ చేసిన వాసు గారి అభినయం ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
  • బందిపోట్ల చేతిలో కాలు, చేయి విరగొట్టించుకున్న కుంటి కళాకారుడుగా నరేన్ బొర్రా గారి నటకౌశలం అదరహో అనిపించారు. ఒకచేత్తో ఫైటింగ్ చేయించి బందిపోటు మెడవిరిచి చంపడం హైలెట్.
  • కోదండపాణిగా ఫోటోగ్రాఫర్ నాగరాజు గారు తన వేషాన్ని డిఫరెంట్ గా చూపించి అలరించారు. ఇక, గురువుగా ప్రకాష్ గారు తన పెద్దరికాన్ని..సాత్వికతను నిరూపించారు. ముద్దుముద్దుగా ముచ్చటైన డైలాగులు, స్టంట్స్ తో చిన్నారుల వేషాలు అదిరిపోయాయి. వారితో సీనియర్‌ రంగస్థల నటీమణులు విజయవాడ భవాని గారు, బండారు నాగరాణి గారు తమకిచ్చిన పాత్రల్ని నిలబెట్టారు.

ఫణి గారి సెట్, లైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. చౌదరి గారి శిష్యరికంలో ఫణి అద్భుతమైన పనితనం కలిగిన వ్యక్తి. ఇక, మేకప్, సంగీతం, డ్రమ్స్ ఇలా సాంకేతిక నిపుణులంతా తమ ప్రతిభను ఎవరికి వారు అన్నరీతిగా నిరూపించారు.

  • అన్నింటికీ మించి విలన్ గా షేర్ దాదా డాక్టర్ ఎంఎస్ చౌదరి గాను డిఫరెంట్ గెటప్, సిగార్ తాగుతూ డైలాగుల బెదిరింపులు… తన ముఠా సభ్యడ్ని హతమార్చిందెవరంటూ ప్రేక్షకుల మధ్యలోనుంచి అందర్నీ భయపెట్టి, బెదిరిస్తూ వేదిక ఎక్కడం….తన రంగస్థల స్టామినా…ఔరా అనిపించింది.
  • ‘పవిత్రమైన శీలాన్ని మర్మాంగంలో పెట్టిన తుచ్చ భగవంతుడు ఎవడ్రా…?
    ఆడది చెడిందని మాట్లాడిన నోట్లో శీలం ఎందుకు పెట్టలేదురా.. అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని నిలబెట్టి… ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాసిన డైలాగులు డాక్టర్ ఎంఎస్ చౌదరి గారి విలువలకు అద్దం పడుతున్నాయి.
    ప్రపంచానికి పోరాటాన్ని వీరత్వాన్ని పరిచయం చేసిన కళాకారులారా….
    యుద్ధం అంటూ వస్తే ప్రతీ పౌరుడు సైనికుడే…

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో హైలెంట్ పాయింట్లు ఈ నాటకంలో కనిపించాయి. ఇంతటి భారీ ప్రయోగాత్మక నాటకాలు బెంగాల్ లో అడపాదడపా చేసినప్పటికీ… తెలుగు నాటకరంగంలో ఇది అతిపెద్ద అద్భుత ప్రయోగంగా చెప్పుకోవచ్చు. నాటకం చూసేందుకు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన నాటక దిగ్గజాలు సైతం హాట్సాఫ్ చెప్పిన నాటకంగా…
జైహో..
“ఝనక్ ఝనక్ పాయల్ భాజే”
జైహో..
“డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు”
“కళల కాణాచి, తెనాలి, సాయిమాధవ్ బుర్రా” గారు…

-కళాపోషకులు, కళాభిమానులు ఖర్చుకు వెనుకాడకుండా ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శనలు చేయిస్తే తెలుగు నాటక కళావైభవం నిలబడుతుంది.

  • పొగర్తి నాగేశ్వరరావు,
    ఆర్టిస్ట్, సీనియర్ జర్నలిస్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap