‘పెదరాయుడు’ చరిత్ర సృష్టించిన సినిమా…అరవై నాలుగేళ్ళ(1931-1995) తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్ముదులిపిన సినిమా. కమర్షియల్ ఫార్ములాకి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఓ మాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ని అందించిన సినిమా..పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ మాత్రమే గుర్తుండిపోయే ట్రెండ్ లో భార్యాభర్తల బంధం గురించి ఫిష్ అండ్ వాటర్ అని చెప్పిన డైలాగ్ ని నిలిచిపోయేలా చేసిన చిత్రం. 1995జూన్ 15న విడుదలయి ఇప్పటికి పాతికేళ్ళు. అయినా నిన్నా..మొన్నా రిలీజ్ అయినట్లే ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకి కూడా తెలిసిన సినిమా. ‘పెదరాయుడు’ సినిమా పాతికేళ్ళ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ‘పెదరాయుడు’ సినిమా గురించి విశేషాలు తెలుసుకుందాం.
స్వర్గం.. నరకం సినిమాతో హీరోగా పరిచయమైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 1982లో నిర్మాతగా మారారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై తీసిన ప్రతిజ్ఞ సినిమా జులై 2న విడుదలయింది. పోటీగా ఎన్ని సినిమాలున్నా ప్రతిజ్ఞ మాత్రమే హిట్ అయింది. ప్రతిజ్ఞ సినిమా రికార్డింగ్ నటరత్న ఎన్ టి రామారావుగారు కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభమైంది. అదే సెంటిమెంట్ పెదరాయుడు సినిమాకి రిపీట్ అయింది. పెదరాయుడు ముందు డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. పెదరాయుడు సినిమాకి కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు క్లాప్ కొట్టారు. 1992 నవంబర్ 2న దీపావళి పండగకి తమిళనాడులో నాగ్ధమై అనే సినిమా విడుదల అయింది. శరత్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమాకి కథ..ఈ రోడ్ సుందర్.. దర్శకుడు కె.ఎస్.రవికుమార్. ఆ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్..మోహన్ బాబుని పిలిచి.. ఆ సినిమా వెంటనే చూడమన్నారు. మోహన్ బాబుకి విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇద్దరు మిత్రులు కలిసి మాట్లాడుకున్నారు. నార్థమై రీమేక్ చేయమని మోహన్ బాబుకి సలహా ఇచ్చారు రజనీకాంత్. వెంటనే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకుడుగా.. జి.సత్యమూర్తిని సంభాషణల రచయితగా ఎంపిక చేశారు. కోటి సంగీతం సమకూర్చారు. పి.ఎస్. ప్రకాష్ ఛాయాగ్రహక దర్శకుడు.
భానుప్రియ-సౌందర్యలను హీరోయిన్ గా ఎంపిక చేశారు. తమిళంలో శరత్ కుమార్ తండ్రి పాత్రలో విజయ్ కుమార్ నటించారు. తెలుగులో ఆ పాత్రని ఎవరిచేత చేయించాలా అని దర్శక..నిర్మాతలు తర్జన.. భర్జనల్లో ఉండగా..మళ్ళీ రజనీకాంత్ నుంచి మోహన్ బాబుకి పిలుపు వచ్చింది. ఆ తండ్రి, పాపారాయుడు పాత్ర తనే చేస్తానని రజనీకాంత్ అనడంతో మోహన్ బాబు షాకయ్యారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఓ గెస్ట్ పాత్ర.. తండ్రి పాత్ర చేయడమేంటి అని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందని మోహన్ బాబు రీమేక్ ప్లాన్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ తను చేయాలని డిసైడ్ అయ్యానని రజనీకాంత్ అన్నారు. తనే ఆ క్యారెక్టర్ గెటప్ డిజైన్ చేయించి తన పర్సనల్ కాస్ట్యూమర్.. మేకప్ ఆర్టిస్ట్ లతో రెడీ అయి.. దిగిన మేకప్ స్టిల్స్ హీరో.. నిర్మాత మోహన్ బాబుకి.. డైరెక్టర్ రవిరాజాకి పంపించారు. రజనీకాంత్, రజనీకాంత్ కి ఆ పాత్ర అంటే అంత ఇష్టం ఏంటంటే.. పెదరాయుడు ఆధారంగా తీసిన హిందీ బులుందీలో కూడా ఆ క్యారెక్టర్ తనే చేశారు. అనిల్ కపూర్ కి తండ్రిగా నటించారు. పెదరాయుడు సినిమా ప్రారంభోత్సవానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు… అక్కినేని నాగేశ్వరరావు.. దాసరి నారాయణ రావు.. కె. రాఘవేంద్రరావు… టి.సుబ్బరామిరెడ్డి లాంటి హేమా హేమీలంతా హాజరయ్యారు. ముహుర్తపు షాట్ లో మోహన్ బాబు తన తండ్రి పాత్రధారి రజనీకాంత్ మెడలో పూలదండ వేయాలి. దండ మెడలో పడుతుండగానే రజనీకాంత్ ఆ దండ తీసి మోహన్ బాబు మెడలో ఎదురువేసి పాదాభివందనం చేశారు. అక్కడికొచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. వారిద్దరి స్నేహబంధాన్ని ఎన్.టి.ఆర్ ప్రత్యేకించి అభినందించారు. తర్వాత రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెదరాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ తమిళ సినిమా షూటింగ్ కి రజనీకాంత్ వచ్చారు. అది తెలిసి మోహన్ బాబు..రజనీకాంత్ ని కలవడానికి రాజమండ్రి వచ్చారు.
ఇద్దరూ కలిసి కారులో హోటల్ కి వెళుతున్డగా రజనీకాంత్ ఓ కవర్ మోహన్ బాబుకి ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తే అందులో 4 లక్షల రూపాయిలున్నాయి. మోహన్ బాబు ఆర్థికంగా టైట్ పొజిషన్ లో ఉన్నారని …రజనీకాంత్ ఆ సహాయం చేశారు. అంతే కాదు పెదరాయుడు సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని పదే పదే చెప్పారు. అందరి నమ్మకాలని.. ప్రేక్షకులు నిజం చేశారు. జూన్ 15న విడుదల అయిన పెదరాయుడు చిత్రం బాక్సాఫీస్ లో కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమాలోని క్యారెక్టర్స్.. డైలాగ్స్.. పాటలు.. ఇప్పటి ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటున్నాయి…