ఇటీవల ఒక సంస్థ వారు తెలుగు రచయితలతో ఒక పుస్తకం వేశారు. అందులో అందరూ చనిపోయిన వాళ్లే. అంటే బతికి వున్న రచయితలను గుర్తించరా? చస్తేనే గొప్ప రచయితల జాబితాలోకి వస్తారా?? పలానా పడమటి గాలి ఆనందరావు పేరు రాయలేదేం అని అడిగితే… ఆయన ఇంకా బతికే ఉన్నారు కదండి అన్నారు. అంటే… ఇక్కడ మంచి రచయిత అనే పేరు రావాలి, గుర్తింప బడాలి అంటే చచ్చిపోవాలి అన్నమాట.
తెలుగు నాట ఇదొక గొప్ప దురలవాటు వుంది. బతికున్న రచయితలను పట్టించుకోరు. వాళ్లెంత అద్భుతంగా రాసినా గుర్తించరు. విశ్లేషకులు, సమీక్షకులు కూడా ఏదయినా విషయం వచ్చినప్పుడు గురజాడ నుంచి నన్నయ్య నుంచి మొదలు పెడతారు. ఇప్పుడున్న వాళ్ళను మాత్రం అసలు ఉదహరించరు. సదస్సుల్లో పత్ర సమీక్షకులు కూడా అంతే. అదే పధ్ధతి.
నాటక రంగంలోనూ ఇదే పోకడ. వందేళ్ల క్రితం వచ్చిన కన్యాశుల్కం గురించే చెబుతుంటారు. నో డౌట్ అదొక గొప్ప కావ్యమే. అయితే ఇక నాటకాలు రాలేదా? ఆధునిక నాటక రంగం లో ఎన్నో అద్భుత ప్రయోగాలతో నాటకాలు వచ్చాయి. అయినా సరే ఔత్సాహిక నాటకం ఇంకెక్కడిది ఎప్పుడో చచ్చింది అంటుంటారు. నిజానికి నాటకాలు చూసే ప్రేక్షకులు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. నాటకాలు వేసే వాళ్ళు ఉన్నారు కానీ, వారి చూపు అంతా టీవీ, సినిమా వైపు ఉంటుంది. పరిషత్ లకు చాలామంది ఆడుతున్నారు అనేక ఇబ్బందులు పడి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… పడమటి గాలి నాటకం గురించి. 150 ప్రదర్శనలు ఆడిన అద్భుత నాటకం అది. వందేళ్ల సమాజానికి దర్పణం కన్యాశుల్కమ్ అయితే, ఆధునిక వింత పోకడలకు నిలువుటద్దం “పడమటి గాలి” నాటకం. ఇదే విషయం రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు అన్నారు. ఆయన ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో కీలక హోదాల్లో సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ నాటక రచనలు వదల్లేదు. ఆధునిక తెలుగు నాటక రంగానికి అద్భుత నాటకాలు అందించారు. ఆయన రచించిన “పులి స్వారి” 150 పైగా ప్రదర్శనలు జరిగాయి. కుర్చీ అద్భుతం. గాలి బతుకులు, రాజిగాడు రాజయ్యాడు, పూలే… ఇలా పాతిక నాటకాలు ఒకదాన్ని మించి ఒకటి. ప్రతి నాటకం రసాత్మక కావ్యమే. పడమటి గాలి నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు గారికి తగిన గుర్తింపు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందరావు గారు కూడా అంతే. పని రాక్షసుడు. బుద్ధుడు, అంబేద్కర్ లాంటి అద్భుత నాటకాలు రాశారు. ఆయన రచించి దర్శకత్వం వహించిన “పడమటి గాలి” ఒక గొప్ప సంచలనం సృష్టించింది.
లతా రాజా ఫౌండేషన్ కె.కె. రాజా ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో “సర్వ మానవ సమానత్వం – తెలుగు నాటక చైతన్యం” సదస్సు జరిగింది. సాంఘిక సమానత్వం కోసం నాటక రంగంలో అహర్నిశలు కృషి చేస్తున్న రచయితలు పాటిబండ్ల ఆనందరావు, డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ అభ్యుదయ సాహిత్య సమాలోచన అద్భుతంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆచార్య కొలకలూరి ఇనాక్, రిటైర్డ్ IAS అధికారులు డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్, జి. బాలరామయ్య, విమర్శకులు డాక్టర్ జి. లక్ష్మీ నరసయ్య పాల్గొని వీరిద్దరి రచనల గురించి ఘనంగా ఆవిష్కరించి అభినందించారు.
ఇద్దరూ ఇద్దరే. నాటక రంగంలో అద్భుతాలు సృష్టించారు. గొప్ప నాటకాలు రాశారు. ఆయా నాటకాలన్నీ ఆధునిక నాటక రంగానికి జీవం పోసాయి. ఇద్దరూ నిద్ర పోయే వాళ్ళను మేల్కొలిపే రచయితలు. కళ్ళ ముందున్న కుళ్ళును దునుమాడిన మహా రచయితలు. అల్ప సంఖ్యాకుల సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కారం చూపించే నాటకాలు రాశారు. కానీ, ఇద్దరూ మొహమాటొస్తులే. అందుకే గుర్తింపు రాలేదని డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ వ్యాఖ్యానించారు. నిరసన సాహిత్యం కాదు నిర్మాణాత్మక సాహిత్యం పై రచయితలు అందరూ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. సాహిత్యానికి మార్పు అవసరం అని, సమాజంలోని ప్రతి కదలికను అవగాహన చేసుకుని రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దీర్ఘాసి విజయ్ భాస్కర్, పాటిబండ్ల ఆనందరావు… ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ ఎంతో ఒదిగి ఉంటారు. ఇద్దరికీ ఆర్భాటాలు నచ్చవు. రచయితలకు ఉండాల్సిన పరిశీలన, పరిశోధన, స్పందించే సహృదయం, స్పష్టత, ధైర్యం, అభివ్యక్తికరణ, సృజన, శిల్ప సౌందర్యం, భావజాలం.. అన్నీ ఇరువురికి నిండుగా ఉన్నాయి. బాధితులు పీడితుల పక్షాన ఉండి ఇద్దరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇద్దరి రచనల్లో పోరాటం, కసి, స్ఫూర్తి, అగ్ని ఉంటాయి. ఇద్దరికీ ప్రయోగాలు చేయడం ఇష్టం. అలాంటి ఇద్దరినీ ఒకే వేదిక పై సన్మానించడం అంటే తెలుగు నాటక రంగాన్ని సన్మానించుకున్నట్లే. ఈ అపురూప కార్యక్రమం రూపకర్త కె.కె. రాజా గారికి, సృజన కర్త డాక్టర్ ఎ. విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు. రచయితలు విజయ భాస్కర్ గారికి ఆనందరావు గారికి అభినందనలు. ఈ సందర్బంగా రాజిగాడు రాజయ్యాడు, పడమటి గాలి లోని సన్నివేశాలను ప్రదర్శించి కళాకారులు కరతాళధ్వనులు అందుకున్నారు.
–డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : సతీష్ కుమార్
ప్రతిభ కలవారిని ఎల్లప్పుడూ గుర్తించాలి
నేను చాలామంది రచయితలు ఇలాగే ఇదే అంటుంటా. బ్రతుకున రచయితను గుర్తించరు చనిపోయిన వారి రచనలు తెగ పొగుడుతారు. అదే బతికి ఉన్నప్పుడు రచయితను అభినందిస్తే ఆనందిస్తాడు కదా. అలాగే కొందరు చనిపోయిన రచయితలకి అవార్డులు ఇస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. చచ్చిపోయిన తర్వాత ఇన్ని అవార్డులు ఇస్తే ఎంత పొగిడితే ఎవడు చూస్తాడు?