‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

(సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవంతో సందడే సందడి)

జూన్ 20వ తేదీ సోమవారం జ్యేష్ట బహుళ సప్తమి తిధుల ప్రకారం నా పుట్టిన రోజు. అంటే సహస్ర చంద్ర మాసోత్సవం అవటం , తేదీల ప్రకారం 27-6-22 సోమవారం నాకు 82 వెళ్లి 83 రావటం, సరసభారతి స్థాపించి 12 ఏళ్ళు కావటంతో, అనుకోకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమం సంకల్పించటం జరిగింది. దీనికి ప్రేరణ అమెరికాలో ఉన్న మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మికి ఈ ఆలోచన రావటం, ఉయ్యూరులో ఉన్న మా అబ్బాయి రమణ “తాన అంటే తందానా” అనటం హైదరాబాద్ లో ఉన్న మా అబ్బయిలు శాస్త్రి శర్మ “తలలు ఊపటం”తో నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు. ఆలోచన అమ్మాయిది, కర్తవ్య నిర్వహణ అబ్బాయిది. సాధారణంగా నేను ఒప్పుకోను. కానీ వయసు మీద పడుతోంది, ఇదివరకైతే “రయ్యి మంటూ” స్కూటర్ పై ఎక్కడికైనా వెళ్లి వచ్చేవాడిని. ఇప్పుడు నన్ను అలా వెళ్ళ నీయటం లేదు మా అబ్బాయి, మనవడు చరణ్, మనవరాలు రమ్య. వాళ్ళే నన్ను ఎక్కడికైనా తీసుకు వెళ్లి తీసుకు వస్తున్నారు. కనుక ఈ రకంగా నా స్వేచ్చ కూడా కొంత తగ్గినట్లే. దీనికి తోడు రెండేళ్ళ కరోనా ఫలితంగా సరసభారతి ఉగాది వేడుకలు నిర్వహించ లేక పోవటం మనసులో ఏదో వెలితిగా ఉంది. కనుక నా పుట్టిన రోజు జూన్ 27 న నా పుట్టిన రోజుతోపాటు “సరసభారతి సాహితీ పుష్కరోత్సవం” జరిపి సాహితీ బంధువులను అందరినీ ఆహ్వానించి, సాహిత్యంలో విశిష్ట విశేష సేవలందించిన మహనీయులను ఆత్మీయంగా సత్కరించి, కవులతో కవి సమ్మేళనం చేయించి, నేను రాసిన “అణు శాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య” పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదింపజేసి నాకు,సరసభారతికి అరుదైన గౌరవం కల్గించిన స్పాన్సర్ శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు(అమెరికా) కృతజ్ఞతగా ఆ ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించటం చేస్తే బాగుంటుంది అనిపించింది. సాహితీ బంధువుల సమక్షంలో ఇక నేను కార్యక్రమాలు తగ్గించుకొని లైవ్ లో మాత్రమేసరసభారతిని నిర్వహిస్తానని అందరికి తెలియ చేయటం నా ధర్మగా భావించాను. అదే చేశాను.

విశిష్ట, విశేష పురస్కార గ్రహీతలలో ఉన్న నర్మదా రెడ్డి, భవానీ, ప్రకాష్ గార్ల కూ రెండేళ్ల నుంచి “డ్యూ”. వీరూ రావటం సంతోషం. శ్రీ సుబ్రహ్మణ్యంగారు చిరపరిచితులు, బదరీగారు నిడదవోలులో రెండేళ్ళక్రితం పరిచయం. టేకు మళ్ల వారు దాదాపు పదేళ్లుగా పరిచయం. మా కార్యక్రమాలకు తప్పక వచ్చేవారు .మా త్యాగరాజ ఆరాధనోత్సవాలకు వారి శ్రీమతి చిదంబరి గారు వచ్చి కోమలగాత్రంతో అలరిస్తారు. గంధం వారి కథా గంధాన్ని ఆస్వాదించి వారి, రెండు సంపుటాలలోని కథలను, వారి అన్నగారు శ్రీ వేంకాస్వామి గారి రెండు సంపుటాలలోని కథలను సరసభారతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరోసారి సాహితీ లోకానికి పరిచయం చేసే అదృష్టం కలిగింది. వీరితోదాదాపుగా పాతిక ఏళ్ళ పరిచయం. వారి రాక మాకెంతో ముదావహం. శ్రీ చలపాక, 64కళలు.కాం ఎడిటర్ శ్రీ కళాసాగర్ సరసభారతి పుస్తక ప్రచురణలకు వెన్ను దన్నుగా నిలిచినవారు. మా దూరపు బంధువు, పురాతత్వ శాస్త్ర వేత్త శ్రీ వేలూరి కృష్ణ శాస్త్రి గారి తర్వాత మళ్ళీ ఆశాఖలో మంచి పేరు తెచ్చుకొన్న గాడేపల్లి రామకృష్ణారావు మా రెండవ బావగారు శ్రీ వేలూరి వివేకానంద్ గారి మేనల్లుడు. శ్రీమతి మైలవరపు లలితకుమారి గొప్ప విద్వాంసురాలు. ఆమె రావటం కూడా శోభచేకూర్చింది.ఆమె భర్త రామ శేషు గారు నాకు”ఫాన్”. శ్రీమతి కేనేరుకల్పన, శ్రీ పంతుల వెంకటేశ్వరరావు గార్లు మాకు పాతకాపులే. ఉయ్యూరులో సాహితీ ప్రియులు కవి విమర్శకులు శ్రీ సారదిగారు. అలాగే ఉయ్యూరు శాఖా గ్రంధాలయ నిర్వాహకులు శ్రీ కృష్ణారావుగారు శ్రీమతి స్రవంతి గార్లు. వీరిద్దరి సాహితీ సేవ మరువలేనిది.

Visishta Puraskara Graheetalu

అంతేకాక ఎందరెందరో వదాన్యులు నేను అడగకుండానే సరసభారతి కార్యక్రమాలకు ఆన౦దిస్తూ స్వచ్చందంగా విరాళాలిచ్చిన దాతలకు సభా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకోవటమూ ఇందులో పరమార్ధంగా భావించాము. అందుకే ఆహ్వానంలో వారి పేర్లు రాసి “సౌజన్యంతో “అని కృతజ్ఞత చెప్పుకొన్నాం. ఇంత వరకు బాగానే ఉంది. కవి సమ్మేళనం జరగాలి కదా. విషయ౦ “సరసభారతి సాహితీ పుష్కరోత్సవం “అని నేనేచెప్పి ఇదంతా మా సంస్థ, దాని నిర్వాహకునిగా నేనే ఎక్కువగా కనిపిస్తానుకనుక “కవులను వచ్చి నాకు డప్పు కొట్టండి “అని అడిగితె బాగుండదు అని దత్తాత్రేయ శర్మగారికి చెప్పి కవులను ఆహ్వానించే బాధ్యతా, శీర్షికను వారికి తెలియ జేసే బాధ్యతే కాక మొత్తం కార్యక్రమాన్ని అలాంటి పండితుని చేత నిర్వహిస్తే బాగుంటుందని వారిని ఒప్పించి కవుల ఫోన్ నంబర్లు ఇచ్చి ఆయనతోనే వారికి ఫోన్ చేయించా .36పేర్లు సేకరించి ఆయన తెలియ జేసినా, సుమారు ఇరవై మంది మాత్రమె వచ్చారు. పురస్కార గ్రహీతలకూ అవకాశమివ్వటం తో రక్తి కట్టింది. దీనికి శర్మగారికి అభినందనలు. పురస్కార గ్రహీతలకు” ఉడతా భక్తిగా “సత్కారం శాస్త్రోక్తంగా నిర్వహించి మా శక్తిని బట్టి నగదు కానుక అందించాం. వారి విద్వత్ కు శక్తి సామర్ధ్యాలకు మేమిచ్చింది తులతూగేది కాదు . , కవులనూఅలానే సత్కరించి నగదుకానుక లందించి సంతృప్తి చెందాం.

Visishta Puraskara Graheetalu

హైదరాబాద్ లో ఉన్న మా అబ్బాయిలు శాస్త్రి, శర్మలు, కోడళ్లు కుటుంబాలతో రావాల్సిఉంది. సరిగ్గా నెల క్రితమే మా మనవడు చి. చరణ్ ఉపనయనానికి అందరూ వచ్చారు కనుక పిల్లల పరీక్షలు చదువులు ఉద్యోగాలవలన రాలేక పోయారు. కానీ మా మనవడు ఛి హర్షకు ఇలాంటి కార్యక్రమాలు అంటే మహా ఇష్టం. ఈ తాతగారిపై వాడికిఅమితమైన గౌరవం. నా లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాడు. బిటేక్ సెమిస్టర్ పరీక్షలు వారం రోజులుగా రాస్తూ అలిసిపోయి ఆటవిడుపుగా ఇక్కడికి రావాలని తండ్రిపై ఒత్తిడి తెస్తే, బలవంతం మీద మా అబ్బాయి శర్మ వాడితో వచ్చి నేను అప్పగించిన కార్యక్రమం చక్కగా నెరవేర్చి సంతోషం కలిగించాడు. ఉయ్యూరు మనవడు చరణ్, మనవరాలు రమ్య చదువులు పరీక్షలు, కాన్ఫరెన్స్ లవలన ఎక్కువ సేపు ఉండలేక పోయారు. మా కోడలు శ్రీమతి రాణి ఇంట్లో ఇచ్చిన సహకారం ఎన్నతగినది. అలాగె నాలుగవ కోడలు శ్రీమతి మహేశ్వరి ఆఫీస్ పని, ఈ సభా కార్యక్రమ౦లలో గొప్ప సహకారం అందించింది.

కార్యక్రమం అరగంట ఆలస్యంగా మొదలవటం, నేనుఎంత పకడ్బందీగా ప్లాన్ ఇచ్చినా, వేదికపై తొట్రు పాట్లు జరిగాయి. పురస్కార గ్రహీతల స్పందనకు అవకాశం కలగనందుకు వారిని క్షమించమని వేడుకొంటున్నాను .వారందరూ మాట్లాడితే బాగా ఉండేది. కానీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని, రైల్ కి వెళ్లాలనో, బస్ టైం అయి౦దనో కంగారులో మాట్లాడలేక పోయిఉంటారు.

ఈ బృహత్తర కార్యక్రమానికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు విచ్చేయటం మన, మా అదృష్టం. మూర్తీభవించిన బ్రాహ్మీ మూర్తులు వారు. ఒక వేదవ్యాస మహర్షియో, వాల్మీకి మహర్షియో, పరాశర మహర్షియో విచ్చేసిన అనుభూతి కలిగింది. వారు సరసభారతిని, నన్ను ఆశీర్వదించటం వేదాశీస్సుగా భావిస్తున్నాను. వారికి మరొక్క సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను.
ఎసి లైబ్రరీలో జరగాల్సిన కార్యక్రమంప్రత్యక్ష ప్రసారానికి, సంగీత కచేరీకి ఇబ్బంది అవుతుందని, సరిగ్గా రెండురోజుల ముందు మాత్రమె గ్రహించి, శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వదాన్యులు శ్రీ కుటుంబరాజుగారి బిల్డింగ్ లో వారి తోడ్పాటుతో నిర్వహించాం. రాజుగారికి కృతజ్ఞతలు. వారి సౌజన్యం మరువలేనిది.

ఇవన్నీ ఒక ఎత్తు. దాదాపు వందమంది పైగా సాహిత్య సంగీతాభిమానులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు. వారందరికీ ధన్యవాదాలు. లైవ్ ప్రసారం, ఫోటోగ్రఫీ నిర్వహించిన శ్రీ ప్రకాష్ అతని బృందం అభినందనీయులు. వేదిక ఏర్పాటుతో సహా సభకు కావాల్సిన హంగు లన్నీ సమకూర్చిన మా అబ్బాయి రమణ అభి నందనీయుడు. వాడికి సహకరించిన వారికీ ధన్యవాదాలు. సరసభారతి గౌర వాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవిగారికి నిర్వహణ సహకారం అందించిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికి ,భర్త శ్రీ శ్రీనివాస శర్మగారికి సాంకేతిక నిపునులుశ్రీ వి.బి.జి. రావు గారికి, మా అన్నగారబ్బాయి చి. రామనాద్ బాబుకు శ్రీమతి మల్లికగారికి ప్రత్యెక ధన్యవాదాలు. జాగృతి సంస్థ వారు ఉత్సాహంగా పాల్గొని ఘనవిజయం చేకూర్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చి నందుకు అభినందనలు.
అందర్నీ ఆహ్వానించి, వారికి సరైన ఆతిధ్యం ఇవ్వటం మా ధర్మం. కనుక మంచి ఉపాహారం, టీ అందించి చివరికి కమ్మని విందు కూడా ఇచ్చి సంతృప్తి పరచాం. శ్రీ ప్రసాద్ గారి కేటరింగ్ అద్భుతంగా ఉందనీ అన్నీ రుచికరంగా ఉన్నాయని అందరూ భావించి సంతృప్తిగా భోజనం చేశారని అందరూ చెప్పగా మా దంపతులం చాలా ఆనందించాం.

మీ – గబ్బిట దుర్గా ప్రసాద్
29-6-22-ఉయ్యూరు

2 thoughts on “‘సరసభారతి’ సాహితీ పుష్కరోత్సవం

  1. చక్కటి విశేషాలు అందించారు…
    *ధన్యవాదములు*

  2. నా గురించి కూడా ఇచ్చారు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap