కాటూరి వెంకటేశ్వర రావు (58) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి.
వీరి గురించి తెలుసుకునే ముందు….
అనాది కాలము నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందం కోసం అనేక కృత్యములు ఆచరించేవారు. వీటిలో ఉపయోగదృష్ఠతో కొన్నయితే, సౌందర్య దృష్ఠితో మరికొన్ని. ప్రతిభా నైపుణ్యం కలిగినవి కళలుగా పేర్కొంటూ, వర్గీకరించి 64 కళలుగాను, అందులో లలితకళలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. చిత్రలేఖనం, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము మొదలగు వానిని ఇంగ్లీషులో “FINE ARTS” అంటారు.
ఈ రోజు “శిల్పము”నకు సంబంధించిన ఆర్టికల్ లో ప్రముఖ శిల్ప కళాకారుడు శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారి గురించి తెలుసుకుందాం …
శిల్పకళకు, శిల్పులకు నిలయంగా ఎంతోకాలంగా తెనాలి పేరుగాంచింది. తెనాలి ప్రాంతంవారికి కళాభిరుచి, శిల్పకళ పట్ల ఆదరం, గౌరవభావం ఎక్కువ. దాదాపు అర్ధశతాబ్దికి పూర్వం నుంచే ఇక్కడి శిల్పులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డ శిల్పులకు నేటికీ చేతినిండా పని ఉంటూనే ఉంది. శిల్పాల రూపకల్పనలో నైపుణ్యం, ప్రతిభగల కళాకారులకు ఎన్నడూ కొదవలేకుండా గడవడం, ప్రజల ఆదరణకు, ప్రత్యేకించి దేవస్థానాలు, ఇతర సంస్థల నుంచి శిల్పులకు లభిస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనంగా, వేదికగా తెనాలి పట్టణం నిలిచిందని చెప్పుకోవచ్చు.
కాటూరి వెంకటేశ్వరరావు గారు గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల పేరుతో తెనాలిలో నిర్వహిస్తున్నారు. ఈ శిల్పకళలో వీరు ఆరో తరానికి చెందినవారు. వీరు 15 ఏళ్ళ వయసులోనే చదువుకు స్వస్తిచెప్పి, కళకు అంకితమయ్యారు. అంతర్జాతీయ శిల్పచిత్రకళాకారుడు ఎ.ఆర్.కృష్ణ గారి వద్ద శిష్యరికంగా చేరి, కాంస్య విగ్రహాల తయారీలో మెళకువలను, పట్టుదలతోను, ఏకాగ్రతతోను సాధన చేసారు. సిమెంటు విగ్రహాల తయారీలో తండ్రి వద్ద తర్ఫీదు పొందారు. దశాబ్దాల వారసత్వానికి, కళాత్మకతోను, సృజనాత్మకతోను, నైపుణ్యాన్ని జోడించి, ఫైబర్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పంచలోహం, మైనం, కాంస్యం తదితర వాటితో శిల్పాలను తయారుచేయ్యడంలో సిద్ధహస్తులు కాటూరి వెంకటేశ్వరరావు గారు. అంతేకాదు తనతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు కూడా.
న్యాయదేవత విగ్రహాలు, దేశనాయుకుల విగ్రహాలు, దేవాలయాలు, క్రైస్తవ ప్రార్ధన మందిరాలు నిర్మించడం, వాటికి మెరుగులు దిద్దడం వంటి పనులు చేస్తుంటారు. సంఘ సేవకురాలు విశ్వమాత మదర్ థెరిస్సా విగ్రహాన్ని అపురూపంగా మలిచి వాటికన్ రాయబారి ప్రశంసలను అందుకున్నారు. స్వామి వివేకానంద, శ్రీశ్రీ,, ఎన్టీఆర్, వైఎస్ఆర్, బుర్రకథా పితామహుడు నాజర్, రాజీవగాంధీ, ఇందిరాగాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, సర్వేపల్లి రాధాకృష్ణ, పొట్టిశ్రీరాములు, బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సత్యసాయిబాబా, షిర్డీ సాయిబాబా, కవికోకిల గుర్రం జాషువ, వకుళాదేవి, ఘంటా సుదర్శనరెడ్డి, తొగరు గోవర్ధనరెడ్డి, సీతారెడ్డి, అవుతు రామిరెడ్డి, డాక్టర్ నాదెళ్ళ వెంకటరామయ్య సోదరలు, ప్రముఖ వ్యాపారవేత్త-దాత స్వర్గీయ నూకల రామకోటేశ్వరరావు లాంటి రాజకీయనాయకుల, రచయితల, ప్రముఖుల కాంస్య విగ్రహాలు లెక్కకు మించి, ఆర్డర్ పై వేలసంఖ్యల్లో చేసారు. అలాగే ప్రస్తుతం ఆర్డర్ పై కూడా చేతిలో చాలానే వున్నాయని తెలిపారు.
వివిధ రూపాల్లో స్త్రీ మూర్తుల శిల్పాలు, గ్రామీణ ప్రజల జీవనశైలిని, ఆచార వ్యవహారాలు తెలిపే శిల్పాలు, నెత్తిన కడవతో, కూరగాయల గంపతో, కూలిపని చేస్తున్న, పండ్లు-ఫలాల గంపతో వంటి స్త్రీ మూర్తులు, వివిధ గిరిజన యువతుల శిల్పాలను పైబర్ తో రూపొందించి హైదరాబాద్, విజయవాడ, అమలాపురం లాంటి పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు.
ఇప్పటకీ యాభై మందికి పైగా శిష్యులు తనదగ్గర నేర్చుకొని సొంతంగా చేసుకొంటున్నారని, ప్రస్తుతం యాభై దాకా తన దగ్గర పనివాళ్ళున్నారని తెలిపారు.
చివరగా, “ఏ రంగంలోనైనా రేయింబవళ్ళు కృషితోనే ఉన్నతస్థాయిని సాధించగలరని” నా అభిప్రాయమని ఓ చక్కని సందేశాన్ని ఇచ్చారు కాటూరి వెంకటేశ్వరరావు గారు. వీరి కుమారుడు రవి చంద్ర కూడా పేరొందిన శిల్పకారుడు.
డా. దార్ల నాగేశ్వర రావు
కాటూరి వారి శిల్పా లు బొమ్మలు చూసాను సార్
Thanq Madhav garu
amazing works.