జనవరి 14 శోభన్ బాబు జయంతి సందర్భంగా …
ఆరడుగుల అందం…
మొహం మీద పడే తల వెంట్రుకల రింగు…
ఆడపిల్లలు ఇష్టపడే లక్షణాలు…
వెరసి కుటుంబ కథా చిత్రాల హీరో శోభన్ బాబు.
అప్పట్లో అందం గురించి పోల్చాల్సి వస్తే శోభన్ బాబులా ఉన్నాడు అనేవారు. ఆడపిల్లలు కూడా నా కాబోయే భర్త శోభన్ బాబు అంత అందంగా ఉండాలి అనేవారు. అందరికీ తెలిసిన శోభన్ బాబుకూ అందరూ అనుకునే శోభన్ బాబుకూ చాలా వ్యత్యాసముంటుంది. అదేంటో తెలుసుకునే ముందు శోభన్ బాబు గురించి కొంత తెలుసుకుందాం.
అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937లో ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. నాటకాలపై ఆసక్తి పెంచుకొని మోజు నటుడిని చేసింది. సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం కాలేజీ… మధ్యాహ్నం స్టూడియోల చుట్టు తిరగడం. శోభనా చలపతిరావు అనే పేరు సినిమాలకు బాగుండదనుకుని తనే శోభన్ బాబుగా మార్చుకున్నారు. పొన్నులూరి బ్రదర్స్ వారు ‘దైవబలం’ చిత్రంలో రామారావు పక్కన ఓ పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 1959 సెప్టెంబబరు 17న విడుదలైంది. అదే సమయంలో చిత్రపు నారాయణరావు నిర్మించిన ‘భక్త శబరి’లో మునికుమారుడి అవకాశం వచ్చింది. ఆ సినిమా కాస్త విజయవంతమవడంతో శోభన్ బాబు పేరు సినిమా రంగంలో తెలిసింది. సినిమా కష్టాలు షరామామూలే… సినిమా కష్టాలు అనే మాట శోభన్ బాబుకు వర్తిస్తుంది. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలు. ఆర్ధిక ఇబ్బందులు పడుతూనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలు వచ్చినా వదిలిపెట్టలేదు. ‘గూఢచారి 116లో చిన్న వేషమైనా చేశారు. ‘పరమానందయ్య , శిష్యుల కథ’లో శివుడి వేషం వేస్తే రూ. 1500 వస్తాయని వేశారు. అలాగే ప్రతిజ్ఞా పాలన’లో నారదుడి వేషానికి రూ.750 ఇచ్చారు. ఆయనకు పాత్రలు రావడానికి ఎన్టీఆర్, ఏయన్నార్ కూడా సహకరించారని శోభన్ బాబు అంటుంటారు. ‘వీరాభిమన్యు’ మొదటిసారిగా టైటిల్ పాత్ర దక్కింది. అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చూపారు. అలా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు శోభన్ బాబు. 1969లో విడుదలైన ‘మనుషులు మారాలి’ చిత్రం శోభన్ బాబు నట జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘మానవుడు దానవుడు’ మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలోని ‘సంపూర్ణ రామాయణం’ పౌరాణిక పాత్రలకూ పనికొస్తారని నిరూపించింది. ‘దేవత’, ‘కార్తీక దీపం’, ‘ఇల్లాలు’, ‘ఇల్లాలు ప్రియురాలు’ వంటి కుటుంబ కథా చిత్రాల తర్వాత ఆయన పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే కాసుల పంటేనని నిర్మాతలు గ్రహించారు. ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడంతో మహిళా ప్రేక్షకులకు ఆయన ఆరాధ్య కథానాయకుడయ్యారు.
ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఎంత తినాలి? ఎంత సేపు పడుకోవాలి? ఎంత మాట్లాడాలి? ఎంత ఖర్చు పెట్టాలి?… ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అంటే అది శోభన్ బాబు జీవితం నుంచే. ఈ రోజున సినిమా రంగంలో వారసులు లేని పెద్ద హీరో ఎవరైనా ఉన్నారా అంటే శోభన్ బాబు పేరే చెప్పాల్సి వస్తుంది. ఆయనకు కుమారుడు ఉన్నా అతన్ని సినిమాల వైపు ప్రోత్సహించలేదు. ఆయన మనవళ్లు కూడా సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. సినిమా అవకాశాల కోసం ఆయనగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా సినిమా చేయాలని తన దగ్గరకు వస్తే ఆయన పెట్టే నిబంధనలకు ఒప్పుకోవాలి. రెమ్యూనరేషన్ విషయంలో ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారనేది ముందే మాట్లాడుకునేవారు. ఇంత కచ్చితంగా ఉండబట్టే ఆయన మీద పిసినారి’ అనే ముద్ర కూడా వేశారు. కానీ వాస్తవం అది కాదు. ఒక ప్లానింగ్తో ఆయన జీవితం గడిపేవారు. విదేశాలకు వెళ్లడమూ ఆయనకు ఇష్టముండేది కాదు. ఆయన సినిమాలు విదేశాల్లో తీసినవీ లేవు. ‘
రాముడు పరశురాముడు’ సినిమా పాటకోసం మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అలాగే ఆమెరికాలో ఉన్న తన కుమార్తె దగ్గరకు ఒక్కసారి మాత్రమే వెళ్లేవారు. తనకు నచ్చని పని ఏదీ చేసేవారు కాదు. 30 ఏళ్ల నట జీవితంలో 228 సినిమాల్లో నటించారు. 96లో విడుదలైన ‘హలోగురు’తో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. తనకు గౌరవం ఉన్నంతవరకే నటించాలన్న నిబంధన పెట్టకున్నారు.
Very good actor.