మాతృభాషకు పట్టం కట్టిన ధనుంజయుడు

మాతృభాషకు పట్టం కట్టిన వ్యక్తి ముతురాజు ధనుంజయుడు – శాసన పరిశోధకుడు కొండా శ్రీనివాసులు
ప్రజల భాషను అధికారభాషగా తొలిసారిగా ప్రకటించిన రేనాటి చోళ ప్రభువు ఎరికల్ ముతురాజు ధనుంజయున్ని తెలుగువారంతా గుర్తుంచుకోవాలని రేనాటి చోళశాసనాల పరిశోధకుడు, చరిత్రకారుడు డాక్టర్ కొండా శ్రీనివాసులు అన్నారు. మొగల్ రాజపురంలోని కల్చరల్ సెంటర్ నందు శుక్రవారం తొలి తెలుగు దివ్వె ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1500 సంవత్సరాల క్రితమే మాతృభాష అయిన తెలుగును రాష్ట్ర భాషగా ప్రకటించి, తొలి తెలుగు శాసనాలను అందించిన ఘణత రేనాటి చోళ ముత్తురాజు దక్కించుకున్నారన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న రేనాటి చోళ ముత్తు రాజు ప్రభువులను ఈనాటి ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రముఖ విద్యావేత్త, రచయిత డాక్టర్ బత్తుల అప్పారావు మాట్లాడుతూ తెలుగు భాష, విశిష్టతను వివరించారు. మాతృభాషను మరచిపోకుండా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలే కాక ప్రతి వ్యక్తి పాటుపడాలన్నారు.
సభకు అధ్యక్షత వహించిన చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ప్రాచీనత, శాసన భాషగా తెలుగు, తెలుగుభాష పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రసంగించారు. తొలి తెలుగు శాసనాన్ని అందించిన ఎరికల్ ముతురాజు ధనుంజయుని విగ్రహాన్ని అన్ని జిల్లాల్లో ప్రతిష్టించాలన్నారు. గానకోకిల కుమార సూర్యనారాయణ ప్రార్థనాగీతంతో ప్రారంభమైన సభలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సిల్వెస్టర్ మాతృభాష మాధుర్యాన్ని మాట్లాడే బొమ్మతో చెప్పించి ఆకట్టుకున్నారు.
తొలి తెలుగు దివ్వె అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీతులసి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత సహాయ వాణిజ్య పన్నుల అధికారి పి.వి.ఎల్.ఎన్. రాజు, తొలి తెలుగు శాసన కర్త ఎరికల్ మత్తురాజు ధనుంజయుని చిత్రపటాన్ని శాసన సభలో అలంకరించాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ చదువుతున్న నిరుపేద విద్యార్థి నిక్కు మిథిలేష్ కుమార్, కిళ్లీ కొట్టు నడుపుతున్న పేద మహిళ మంజులా రాణిలకు చేరొక రు. 5వేలు రూపాయలు ఆర్థిక సహకారం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, సాహితీవేత్త గుడి సేవ విష్ణు ప్రసాద్, సేవ్ ది సొసైటీ కార్యదర్శి గణేష్ బాబు, లక్ష్మీతులసి, బోడి ఆంజనేయ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap