త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా వున్ననాడే శిష్యులకు సరైన విద్యాభోధన చేయగలడు. అలా చేయాలి అంటే ఆ గురువుకి మంచి క్రమశిక్షణ, శిష్యులపట్ల అపారమైన ప్రేమ వాళ్ళని మంచి విధ్యార్దులుగా తీర్చి దిద్దాలనే తపన ఇలాంటి ఉన్నత లక్షణాలు వున్ననాడే అది సాధ్యమౌతుంది. అయితే ఇలాంటి లక్షణాలన్నింటిని పుణికి ప్పుచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే వుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు ఆదర్శంగా వుంటారు. అలాంటి ఆదర్శ వంతమైన టీచర్లలో ఒకరు మద్దిరాల శ్రీనివాసులు. ప్రకాశం జిల్లా సంతనూతల పాడు మండలం నందలి గురువారెడ్డి పాలెం ప్రాధమిక పాటశాలకు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వీరు మంచి పద్యకవి, రచయిత కావడం విశేషం .నిత్యం పిల్లల కోసం పరితపించే వీరు గతంలో పనిచేసిన త్రిపురాంతకం ప్రాధమిక పాటశాలలోని పిల్లల కోసం స్వయంగా పుస్తకాలు రచించడమే గాక తన పాటశాల పిల్లలలో కథ, కవిత, పద్య రచన, చిత్రలేఖనము వంటి నైపుణ్యాలను వెలికి తీస్తూ వారిలో ఆ నైపున్యాలను పెంపొందించేందుకు కొన్ని సంవత్సరాలపాటు “బాలవికాసం” అనే ఒక త్రైమాసైక పత్రికను వారి పిల్లల రచనలతోనే నడపడం నిజంగా గోప్పవిశేషం.

ప్రస్తుత గ్రంధం కూడా ఆకోవలోకి చెందినదే. అయితే ఇది ఒక చిరు యాత్రా సాహిత్య గ్రంధం అని చెప్పవచ్చు.పిల్లలకు క్షేత్ర పర్యటన గురించి తెలియజేయాలనే భావనతో దీనిలో స్థానికంగా గల చారిత్రక పుణ్యక్షేత్రమైన త్రిపురాంతక క్షేత్ర పర్యటనను ఎంచుకుని దానిని గ్రంధరూపంలో వివరించడం జరిగింది. ఈ గ్రంధంలో మోహన్ అనే పేరుతో వున్న ఈ ఉపాధ్యాయుడు తన ప్రధాన ఉపాధ్యాయుడి అనుమతితో ఒక ప్రణాళిక ప్రకారం పిల్లలకు త్రిపురాంతక క్షేత్ర పర్యటనను చూపించడం ఇందులోని ప్రధాన అంశం. పుస్తకాన్ని చదువుతుంటే పర్యటనకు ఎంచుకున్న విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయుడి అనుమతితో పిల్లలకు చెప్పడం మొదలు ఆ తర్వాత పిల్లల యొక్క భిన్న విభిన్న సందేహాలు సహజంగా పిల్లలో గల ఆసక్తి కేరింతలు ఆటలు అన్నీ మనం చదువుతున్నట్లు కాకుండా ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు వుండడం విశేషం. ఉదాహరణకు పర్యటన విషయం తెలియజేసి అందుకు సంసిద్ధంగా వున్న వాళ్ళ పేర్లను తెలుసుకునే సంఘటనను పుస్తకంలో ఇలా రాస్తారు చూడండి.

తరగతి గదిలోకి వెళ్లారు సారు అంతే ! సార్…. సార్ … సార్ నేనోత్తున్నా, నేను… నేను సార్… మా అమ్మ బొమ్మన్నది సార్… మానాన్న కూడా ఒప్పుకున్నఅంటూ అందరి గలగల .

ఆ..ఆ అలాగే అలాగే మీరు కూర్చుంటే నేను పేర్లు రాసుకుంటాను అన్నారు…

మాటలు ఆపినట్టే ఆపారు మల్లి మొదలెట్టారు నా పేరు పస్టు నా పేరు పస్ట్ అని..(మోహన్ సార్ ఏదైనా అర్ధమయ్యే దాకా ఓపికగా చెబుతారు కాని కొట్టడని వాళ్లకు తెలుసు)

గోల ఆగేలా లేదు.. లాలాలి లాలాలి లా… లల్ల… లాలాలిలా అంటూ టేబుల్ పై దరువు వేస్తూ పాటను అందుకున్నారు అంతే పిల్లలంతా. ఆయ్.. పాట… పాటా పదండ్రా కూచుందాం అంటూ వెళ్ళి పాటను ఆలకించ సాగారు..

సగం పాడి ఆపేశారు…. పిల్లలంతా అయ్యో అనుకుంటూ ముఖాలు చూసుకున్నారు

ఇప్పుడు మీ పేర్లు రాసుకుంటాను కొన్ని సూచనలూ చెబుతాను. అప్పటిదాకా మాట్లాడకుండా వుండండి. మిగతాపాట పాట పాడతా..? సరేనా అన్నారు

అలా… గేస్సార్…అంటూ కోరస్ ఇచ్చారు.. ఆనందంతో తలలు వూపుకుంటూ

  1. ఇప్పటికి 18 మంది అయ్యారు ఒకే గుడ్.. అ… ఎల్లుండి వచ్చేటప్పుడు మీరేం చెయ్యాలి అంటే ?

నెంబర్ 1 ఉదయం ఇంట్లో తప్పకుండా ఏదైనా తిని రండి.

  1. ఏడున్నరకల్లా బడి దగ్గరకు మీ అమ్మ లేదా నాన్నతో రావాలి.

3. మధ్యలో తినాలి అనుకుంటే ఏవైనా తెచ్చుకోవచ్చు, కంపల్సరీ కాదు.

4. మధ్యాహ్నం భోజనం నేనే పెట్టిస్తాను..ఓకేనా..? అన్నారు.

ఇంతలో గౌతం “సార్ మరీ కొండమీది గుడికా..? సేర్లో అమ్మోరి గుడికా? అడిగాడు.

రెండు గుడులకు వెళతాము నాన్నా! అనగానే ముఖంలో చిరునవ్వు చిందింది. అందరూ గుడి చర్చలో పడ్డారు. తిరుపతమ్మ మాత్రం ఒక చెయ్యి పైకెత్తి సారు వైపు చూస్తూనే వుంది. పిల్లలూ ఒక్క నిముషం మా తిరుపతక్క ఏంటో చయ్యి పైకేత్తుకొని ఉంది అనగానే పిల్లలంతా ఘోల్లుమని నవ్వారు

చెప్పక్కా…ఏంటి సంగతి …? అడిగారు.

“కాద్సార్ ఏదన్నా అడగాలంటే సెయ్యి ఎత్తమన్నారుగా! అనగానే మల్లి నవ్వులు

నవ్వుతారెంట్రా? అభినందించండి అమ్మాయి చెప్పింది నిజమేగా, తిరుపతమ్మ మనసు ఉల్లాసంతో ఉప్పొంగింది

ఆ.. చెప్పక్కా, ఏందీ నీ డౌటు…?

సార్… మరేమో గుడికాడికి ఇంతమందిమి ఎట్టా బోతాం… నవ్వులే నవ్వులు (తిరుపతమ్మ కాస్త అమాయకత్వం ఉండి ఆమె మాటలు తమాషాగా వుంటాయి. ఇంతకు ముందు యే టీచర్ల దగ్గరా అసలు మాట్లాడేదేకాదు మోహన్ సార్ వచ్చాక అందరినీ ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు ధైర్యంగా మాట్లాడడం నేర్పారు).

ఎందుకయ్యా కిక్కిక్కీ అంటారు. గుడికి పోడానికి మనకి బస్సులున్నాయా ? ఏమన్నా! ఇంతమంది బైకులో పడతారా ?నువ్వు చెప్పు. అంటూ పక్కనే పల్లికిలిస్తున్న అరవింద్ తలను అలా నెట్టింది. దాంతో వారితో పాటు సారుకు కూడా నవ్వొచ్చింది.

ఓకే ఓకే తిరుపతక్కా వెరీ గుడ్ మంచి ప్రశ్న వేశావ్ తల్లీ అనగానే టక్కున నవ్వులు ఆపేశారు. సారుచెప్పేది ఆసక్తిగా వినసాగారు. నేను ఆటోలు రప్పిస్తానమ్మా. సరేనా అన్నారు.

ఇలా ప్రతీ విద్యార్ధి విధ్యార్దినిలలో రేకెత్తే ప్రశ్నలకు జవాబులు చేబుతూ సందేహాలు నివృత్తి చేస్తూ క్షేత్ర సంధర్శనయోక్క ప్రాముఖ్యాన్ని ఎంతో చక్కగా వివరిస్తాడు రచయిత. ప్రతీ సంఘటననూ మనముందు జరుగుత్న్నట్టుగా పుస్తకంలో వివరిస్తాడు రచయిత.

ఇందులో శివుని కుమారుడైన కుమారస్వామి తపస్సు చేసిన పర్వతం గావున ఈ పర్వతానికి కుమారగిరి పర్వతం అని పేరు వచ్చిందని ఆ పర్వతంపైన గుడిలో వెలసిన దేవుడు శివయ్య లేదా త్రిపురాంతకమనే వూరినందు వెలసిన ఈశ్వరుడు కనుక త్రిపురాంతకేస్వరుడని, అసలు త్రిపురాంతకం అన్న పదంలో త్రీ, పురం, అంతకం అనే మూడు పదాలు వున్నాయని వాటి వెనుక కథ కూడా పిల్లలకు ఆసక్తిదాయకంగా చెప్తారు

పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను చాలా భాదలు పెట్టేవాడని అందుకే కుమారస్వామి ఆ రాక్షశున్ని చంపెసేడని ఆ తారకాసురుడికి గల ముగ్గురు కొడుకులకు కోపం వచ్చి కుమారస్వామిని ఎదిరించే శక్తిలేక వాళ్లకు అసలు చావు రాకుండా వుండే వరంకోసం భ్రహ్మ దేవుడి కోసం పెద్ద తపస్సుచేయాగా బ్రహ్మ దేవుడు మెచ్చి వారికి ఏమి వరం కాలో అడగమనగా వాళ్ళు చావులేని వరం కోరుకుంటారు కాని పుట్టిన ప్రతీ వాడూ చావాల్సిందే ఇంకేదైనా కోరుకోండి అనగా మా ముగ్గురికి మూడు పురాలు కావాలి బంగారానిది, వెండిది,లోహానిది అవి మూడూ గాలిలో ఎగరాలి ఆ తర్వాత గాలిలో మా పురాలు ఒకే వరుసలో వుండాలి ధనుస్సుగాని ధనుస్సు భాణం గాని భాణంతో ఎప్పుడూ ధనుస్సును వాడని వారే మమ్ములను చపాలి, అదీ ముగ్గురిని ఒకేసారి చంపాలి అని వరం కోరుతారు. బ్రహ్మ దేవుడు అందుకు తదాస్తూ అని వరమిస్తాడు అంతే తమకు చావే లేదనుకున్న ఆ ముగ్గురూ మనుషులను దేవతలనూ పదేపదే హింసించడం మొదలుపెడితే ఆ భాదలను తట్టుకోలేక ఈశ్వరుడి దగ్గరకి వెళ్ళి వేడుకున్నారని అయితే వాళ్లకు వేయి సంవత్సరాల వరకు చావు లేదు ఇంకొంతకాలం ఆగండి అని చెప్పి వెయ్యేళ్ళు పూర్తవ్వగానే ఈశ్వరుడు భాణంతో చంపబోయాడు గాని ధనుస్సు వంగలేదు.

అనగానే శివాంజి అనే ఒక విద్యార్ధి అదేంది సార్ అనే డౌట్ వ్యక్తంచేస్తాడు. అదంతా ఒక పెద్ద కథ, దాన్ని తెలుసుకోవాలంటే మన స్కూల్ లైబ్రేరీలోని త్రిపురంత కేశ్వర క్షేత్ర మహిమ అనే పుస్తకం చదవండి అని చెప్పగా పిల్లలు చెప్పండి సార్ చెప్పండి సార్ అని గోల చెయ్యగా మరలా చెప్పాలి అంటే అది పెద్ద కథ కానీ మనకు ఇప్పుడంత టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్తానని మొదలు పెట్టి ఇలా చెప్తారు.

అన్నట్టు పిల్లలూ ఎక్కడ ఆగాను..ఆ… ధనుస్సు వంగలేదు అన్నాను గదా! అప్పుడు మన బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మ వారు సహాయం చేసింది అప్పుడు ఈశ్వరుడు త్రిపురాలనూ ఒకే భాణంతో అంతం చేసాడట అలా ఈ ఊరికి త్రిపురాంతకం అని పేరు వచ్చిందని చెప్తారు. ఆపై త్రిపురాంతకం క్షేత్రం నందలి ఇతర దేవుళ్ళ మందిరాలను వాటి విశిష్టతలను ఎంతో చక్కగా వివరిస్తూ పిల్లలలో ఆ ప్రాంత విశేషాలు విశిష్టత గురించి మంచి అవగాహన కల్పిస్తారు.

పుస్తకం చదువుతుననంత సేపూ క్షేత్ర పర్యటనలోని ప్రదేశాలను చూస్తున్న పిల్లలలో ఉబికి వచ్చే ఉల్లాసపు కేరింతలు ఒకరుపై ఒకరు ఆనందంతో వేసుకునే చలోక్తులు పసి మనస్సులో రేకెత్తిన సందేహాల నివ్రిత్తికి వాళ్ళు వేసే వింత వింత ప్రశ్నలు వాటికి ఉపాధ్యాయుడు ఓపికగా వివరించిన తీరు ప్రతీ ఘటనా మనకు చదువుతున్నట్టు కాకుండా ప్రత్యక్షంగా పిల్లలతో ప్రయాణిస్తూ మనం కూడా క్షేత్ర పర్యటన చూస్తున్న అనుభూతి కలిగేల చేస్తుంది.

పాటశాల విద్యార్ధులకు క్షేత్రపర్యటన గురించి చక్కటి అవగాహన కలిగించే మంచి పుస్తకం. బాలబాలికలలో విజ్ఞానాన్ని కలిగించే ఒక మంచి పుస్తకం ఈ “ఉల్లాసం “అనే గ్రంధం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంటపల్లి సత్యనారాయణ
9491378313

రచన : మద్దిరాల శ్రీనివాసులు
64 పేజీలు, పుస్తకం వెల : 75/-రూపాయలు
ప్రతులకు ఫోన్ నెంబర్ : 90106 19066

2 thoughts on “త్రిపురాంతక క్షేత్ర యాత్రా గ్రంథం “ఉల్లాసం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap