భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

రెండువేల మందికి పైగా విద్యార్థులతో భీమవరం ‘చిత్ర’కళోత్సవం గ్రాండ్ సక్సెస్

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలల చిత్రకళోత్సవం దోహదం పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు. బాలోత్సవాల్లో భాగంగా ఆదివారం(5-11-23) భీమవరం, చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో నిర్వహించిన విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్స్ వారి ఆలోచనతో అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖనం పోటీలను కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుడు, చిత్రకారుడు, న్యాయవాది, అధ్యాపకుడు, రచయిత అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిని వెలిగించి బాలోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ బాలల మానసిక వికాసానికి అలాగే, విద్యాభ్యాసంలో సృజనాత్మకత ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కళలు అవకాశం కల్పిస్తాయన్నారు. చిత్రలేఖనం పోటీలు వంటివి పిల్లలలో కళలు పట్ల అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి ఎంతో అవసరం అన్నారు. వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రతిభావంతులుగా తయారవుతారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రాయింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ షీట్స్ కొన్నింటిని కలెక్టర్ తన చేతుల మీదుగా అందచేశారు. అడవి బాపిరాజు మనుమరాలు కాళ్ళకూరి పద్మావతి ని కలెక్టర్ సత్కరించారు. ముందుగా రాయలం పాఠశాలకు చెందిన రాజేంద్ర ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ సందర్శించి ఆనందం వ్యక్తం చేసి డ్రాయింగ్ టీచరును అభినందించారు.

సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మూడు కేటగిరీలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు రెండు వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవానికి ముందు విద్యార్థినులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులలో ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం విజేతలకు అథిదుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఆర్టీవో కె. శ్రీనివాసులు రాజు, తహసీల్దార్ వై. రవికుమార్ వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, చింతలపాటి బాపిరాజు స్కూల్ కరస్పాండెంట్ కె. రామకృష్ణంరాజు, కొత్తపల్లి శివరామరాజు చెరుకువాడ రంగసాయి, మానవతా సంస్థ ప్రతినిధులు సాగి జానకి రామరాజు, బుద్ధరాజు వెంకటపతి రాజు, బాలోత్సవం కమిటీ ప్రతినిధులు పి. సీతారామరాజు, బి. చైతన్య ప్రసాద్ జి . ధనుష్, వాసు, ప్రసాద్, వి. రాధాకృష్ణ, విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్స్ కు తరపున చిత్రకారులు సునీల్ కుమార్, స్పూర్తి శ్రీనివాస్, కళాసాగర్, అరసవల్లి గిరిధర్, ఎస్.పి. మల్లిక్, జాషువా సంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, ఉదయ్ ఆర్ట్స్ గ్యాలరీ ఎం. ఉదయకుమార్, భీమవరం డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషన్ తరపున కొత్తపల్లి సీతారామరాజు, కట్టెబోయిన శ్రీనివాస్, రాజమండ్రి నుండి బాపిరాజు, డివైఈఓ శ్రీరామ్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి. శ్రీనివాస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివాజీరాజు, డిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సి.హెచ్. నిర్మల కుమారి, కంతేటి వెంకట రాజు, కలిగొట్ల గోపాలరావు, షేక్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం చిత్రకళా పోటీలు ప్రారంభం అయ్యేసమయానికి చిరు జల్లులు పడుతున్నప్పటికి చిన్నారులు మరింత ఆనందోత్సాహంతో నగరంలోని పలు ప్రాంతాల నుండి వేదికవద్దకు చేరుకోని, వారికి బొమ్మల పట్ల వున్న ఇష్టాన్ని తెలియజేశారు.

-కళాసాగర్

1 thought on “భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap