సృజనశీలి సుభద్రాదేవి

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా గత 5, 6 దశాబ్దాలుగా కథ, కవిత్వం, విమర్శ వ్యాసం, మోనోగ్రాఫ్, ఆత్మకథ ఇలా ఎన్నో భిన్న ప్రక్రియల్లో రచనలు చేశారు. వీరు రాసిన “నీడల చెట్టు ” నవల 2018 లో చతురలో వచ్చింది. డా. శ్రీదేవి, నిడదవోలు మాలతి ల మీద మోనోగ్రాఫ్ లు తెచ్చారు. స్వాతంత్య్ర అనంతర రచయిత్రుల గురించి అనేక వ్యాసాలు రాశారు. ఇంతే కాక చిత్రకళ పై వున్న ఆసక్తితో ఎన్నో బొమ్మలు గీశారు. ఆవిడ ఎంత గొప్ప రచయిత్రో అంతటి మృదుస్వభావి, స్నేహశీలి. సుభద్రాదేవి గారి ఇంటికి వెళదాం పదండి…ఆవిడ అంతరంగ తరంగాలను ఆవిష్కరిద్దాం!

ప్రశ్న: మీరు కవయిత్రిగా, రచయిత్రిగా సుప్రసిద్దులు. కొంత మంది ఒకప్పుడు బాగా రాసిన వారు, తర్వాత రోజుల్లో అస్త్రసన్యాసం చేసిన వారున్నారు. కాని మీరు అవిరామంగా రాస్తూనే వున్నారు. దీనికి ప్రేరణ ఏమిటి ?
జవాబు: రచయితలైనా, రచయిత్రులైనా ఇంటాబయటా బాధ్యతలు, ఒత్తిడి వలన కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు ఇంకేదైనా కారణాలు కావచ్చు కలంసన్యాసం చేసి ఉండొచ్చు.
నా వరకూ నేను సాహిత్య అధ్యయనం బాల్యంలోనే మొదలు పెట్టి నాతోబాటుగా నా అధ్యయనం కూడా నడుస్తోంది. పాఠశాలచదువులో మాతెలుగు మాష్టారు నడిపిన లిఖిత పత్రికల్లో రాసాను. దానిని పెద్దగా నేను చెప్పుకోవటంలేదు. 1970లో పొలికేక వారపత్రికలో నా తొలి కథ “పరాజిత” ప్రచురితమైంది. వెంటవెంటనే మరో మూడు కథలు ప్రచురితం అయ్యాయి. తర్వాత కుటుంబ బాధ్యతలతో నాలుగైదు ఏళ్ళు విరామం, 1975 లో తొలికవిత “ఆకలినృత్యం” ఎక్స్ రే లో ప్రచురితం అయ్యింది. అప్పుడప్పుడు రాస్తున్న కవితలతో 1980 లో “ఆకలినృత్యం” పేరిట తొలి కవితా సంపుటి వెలువరించాము. అప్పటినుండి నేను అవిశ్రాంతంగా రాస్తూనే వున్నాను. సాహిత్య అధ్యయనం ఏవిధంగా తీరనిదాహమో అదేవిధంగా సమాజంలో నేను చూస్తున్న, గమనిస్తున్న, పరిశీలిస్తున్న ఆలోచనల్ని నా ఆందోళనల్ని, ఆవేదనల్ని అక్షరరూపంలో పెట్టకుండా ఉండలేనితనం, నాకోసం సమయాన్ని సమకూర్చుకుని మరీ నిర్విరామంగా రాసేవరకూ నండూరి వారన్నట్లు గుండె గొంతుకలో కొట్లాడి నన్ను నిర్విరామంగా రాసేలా చేస్తోంది.

ప్రశ్న: మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జవాబు: నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య పి. సరళాదేవి కి వివాహం జరిగింది. అక్క సోవియట్ లాండ్ ప్రచురించే పిల్లలబొమ్మల పుస్తకాలు నాకోసం తేవటం వలన వాటిని చదువుతూ బొమ్మలు వేయటం అలవాటైంది. 1956 నుండి ఆమె తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది. మాలతీచందూర్, పి. శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా. శ్రీదేవి మాఅక్కకు మంచి మిత్రురాలు. నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు అక్క ఇంట్లో ఉన్నాను. అక్క ఇంట్లోని గ్రంథాలయంలో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను. నేను రచయిత్రిగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను. మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు భారతిలో వ్యాసాలు రాసేవాడు. నా కవితలు కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు కూడా కథకుడు 1965 నుండీ 85 లవరకు అన్ని పత్రికలలో విస్తృతంగా కథలు రాసేవాడు. కానీ చదువుకోకుండా కథలు రాస్తున్నానని మందలిస్తారని నేను కథలూ కవితలు రాసినా పుస్తకాల అడుగున పడేసేదాన్ని. వీర్రాజుగారు మొదటిసారి మాఇంటికి వచ్చినప్పుడు నేను రాసిన కథలు చూపిస్తే అందులో మూడు కథలు ఎంపిక చేసి పత్రికల అడ్రస్ లు ఇచ్చి పంపమన్నారు. ఆ విధంగా వివాహానికి ముందే 1970 లో నా మొదటి కథ కొడవంటి సుభద్రాదేవి పేరుతో ప్రచురితమైంది. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేసాక 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాను. తర్వాత పదేళ్ళకు MA (తెలుగు), BEd మరో పదేళ్ళకు M.Sc(Maths) చేసాను.

ప్రశ్న: స్రీ జీవితంలో పెళ్ళి పెను మార్పు తీసుకువస్తుంది. పెళ్ళికి ముందు అనేకరంగాలలో రాణించిన మహిళలు పెళ్ళయ్యాక వాటికి స్వస్తి చెబుతుంటారు. కాని మీరు పెళ్ళాయ్యాక కూడా విస్తృతంగా రచనలు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అయింది?
జవాబు: మహిళలకు పెళ్ళయ్యాక సహజంగానే కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలూ, వాళ్ళ చదువులు సంసారాలు వీటితో తలమునకలై పోతారు, ఉద్యోగినులు ఐతే ఆబాధ్యత కూడా ఉంటుంది. బాధ్యతలలో కొట్టుకు పోతున్నా తన కోసమంటూ కొంతసమయం సమకూర్చుకో గలిగిన వాళ్ళు, ఇంట్లో సహకారం కాస్తంతైనా అందించినప్పుడు రచనలు చేయగలుగుతారు. వీర్రాజుగారు కూడా సాహితీ వేత్త కావటం నా సాహిత్య కృషికి దోహదపడింది.

ప్రశ్న: మీరు చిన్నప్పుడు బొమ్మలు బాగా వేసేవారని చదివాను. తర్వాత అంతగా ఆ కళలో కొనసాగలేదు ఎందుకని?
జవాబు: నేను చాలా చిన్నప్పటినుండి అక్క ఇచ్చిన బొమ్మలకథల పుస్తకాలు చూసి చిత్రాలు వేసేదాన్ని. తర్వాత్తర్వాత పత్రికల్లో ధారావాహికలకు బాపు వేసిన చిత్రాలు చూసి వేసే దాన్ని. స్నేహితులకు పుట్టినరోజులకు నేను వేసిన చిత్రాలు గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేదాన్ని. బాల్యంలో అక్కయ్య దగ్గర ఉన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వాళ్ళు నిర్వహించే కాంపిటీషన్ కి నాచేత రెండు చిత్రాలు వేయించి పంపించింది.
ఒకసారి 1970 ల్లో అన్నయ్య జయదేవుని గీతగోవిందం టీకాతాత్పర్యాల సహితంగా పుస్తకం తీసుకు వస్తే అందులో ఒక అష్టపదికి ఎనిమిది బొమ్మలు స్వంతంగా ఊహించి వేసాను. అవి ఇండియన్ ఇంక్ తో చేసాను గానీ ఈలోగా వివాహం కావటంతో అసంపూర్తిగా కొన్ని ఉండిపోయాయి.
వివాహానంతరం బాధ్యతలవలన ఉన్నసమయాన్ని కాస్తా సాహిత్యానికి కేటాయించి చిత్రాలు వదిలి పెట్టేసాను. ఉద్యోగ విరమణ తర్వాత మళ్ళా చిత్రాలు వేయటం మొదలు పెట్టాలని స్కెచ్ బుక్ కొనుక్కున్నాను. కానీ కుదర్లేదు.

ప్రశ్న: శీలా సుభద్రాదేవి గారు అనగానే యుద్ధం ఒక గుండెకోత గుర్తుకు వస్తుంది. మీకు బాగా పేరు తెచ్చిన కవిత అది. బతుకు పాటలో అస్థిత్వరాగం కూడా దీర్ఘ కవితే. దీర్ఘ కవితలు రాసిన వారిలో మీరే మొదటివారనుకుంటాను. వీటి గురించి వివరించండి.
జవాబు: 2001లో అమెరికాలో ఉగ్రవాద దాడిలో జంటటవర్లు కూలిపోవటం తదనంతరం అమెరికా ఆఫ్ఘన్ యుధ్ద నేపధ్యంలో ఒక్క నెలలోనే రాసిన దీర్ఘకావ్యం “యుద్దం ఒక గుండె కోత”. ఆ సమయంలో మా అమ్మాయి అక్కడ ఉండటంతో కొంత ఆందోళనకు గురయ్యాను. ముఖ్యంగా భారతదేశం నుండి చదువుకున్న యువత చదువులకో, ఉపాధికో విదేశాలదారి పడ్తున్నారు.
ఇద్దరు యుధ్ధోన్మాదుల అహంకారం వలన, అధికారదాహం వలనా జరిగే యుద్ధం అనాదిగా ఎప్పుడు ఎక్కడ జరిగినా దాని పర్యవసానాలు మహిళలు మీదే పడ్తాయి. అటువంటి యుద్ధాలు ఎందరో తల్లులకు గుండెకోతే కదా? ఆ రకంగా యుధ్ధమూలాల్లోకి వెళ్ళి వాటినన్నింటినీ కవిత్వీకరించాను.
రెండవ దీర్ఘకవిత “బతుకుపాటలో అస్తిత్వరాగం” తల్లి గర్భం నుంచి శిశూదయం నుండి వృద్ధాప్యం వరకూ ఏడు చాప్టర్ లుగా స్త్రీ జీవితం చిత్రNa చేసాను. ప్రతీ చాప్టర్ ను విత్తనంనుండి మొలక తలెత్తిన దగ్గర నుంచి వృక్షం మోడుగా మారటం వరకూ, సూర్యోదయం నుండి సంధ్యవేళ వరకూ పోల్చుతూ చెప్పాను. చివర్లో చెట్టు మోడైనా విత్తనాలు తిరిగి మొలకెత్తుతాయనీ, సూర్యుడు అస్తమించినా తిరిగి ఉదయిస్తాడనీ, వృద్ధాప్యంలోని స్త్రీ అనుభవాలు తర్వాత తరానికి స్ఫూర్తి దాయకాలని ఆశావహ దృక్పథంతో ముగించాను.
నేను దీర్ఘకవిత రాసిన సమయానికి కొందరు కవులు మాత్రమే రాసారు. అందుకనే కాత్యాయనీ విద్మహే గారు నేనే తొలి దీర్ఘకావ్య కవయిత్రిగా నిర్థారించారు. యుద్ధం ఒక గుండె కోత దీర్ఘకావ్యం పై మధురకామరాజు విశ్వవిద్యాలయంలో ఎమ్.ఫిల్. పరిశోధన జరిగింది.

ప్రశ్న: కథా రచయిత్రిగా మీకు బాగా పేరుంది. మీరు రాసిన కథలు వాటి నేపథ్యం గురించి చెప్పండి.
జవాబు: 1970 లో కథారచనతోనే సాహిత్య రంగంలోకి అడుగు పెట్టినా కవిత్వం వైపే మొగ్గు చూపాను. నేలవిడిచి సాము చేసేవి రాయను. కథకి తగిన వస్తువు దొరికితేనే కానీ రాయలేను. అందుచేతే మూడు కథాసంపుటాలు మాత్రమే వెలువడ్డాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో చిల్లర దుకాణాలు మూతపడటం, రాళ్ళు కొట్టి రోళ్ళు తయారు చేసేవారి దుర్భర జీవితం, పేపర్లు ఏరుకునే పిల్లలు బేనర్లుగా కట్టిన గుడ్డ కోసం ఆశపడటం, పేద మహిళలు అద్దెగర్భాలకు పావులుగా కావటం, దాంపత్యాలలోని లొసుగులు, స్త్రీ అస్తిత్వ పోరాటాలు ఇలా స్త్రీ కేంద్రంగా కథలు రాసాను. ఉపాధ్యాయవృత్తిలో గమనించిన అనేక విషయాలగురించి “ఇస్కూలు కతలు ” రాసాను. అవి తెలుగు విద్యార్థి మాసపత్రికలో రెండున్నర సంవత్సరాలు ధారావాహికగా వచ్చాయి. అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి ద్వితీయ భాష తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు. మరొక కథ “మార్పులేని మనిషి” కథని SVU పరిధిలోని కాలేజీ డిగ్రీ మొదటి సెమిస్టర్ లో పాఠ్యాంశంగా చేర్చారు.

ప్రశ్న: చాలా మంది కవులు వారి రచనల సర్వస్వాన్ని ప్రచురించారు. స్రీలలో సమగ్ర కవిత్వాన్ని సంపుటిగా తెచ్చిన వారిలో మీరే ప్రథములు కదా. దీని గురించి ఏమంటారు?
జవాబు: 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి “శీలా సుభద్రాదేవి కవిత్వం” పేరిట వీర్రాజు గారు నా అరవయ్యేళ్ళ జన్మదిన సందర్భంగా ప్రచురించారు.

ప్రశ్న: కుందుర్తి గారు వచన కవితలోనే ఆత్మకథ మొదలగునవి అన్ని ప్రక్రియలు రాయాలన్నారు కదా! దీని గురించి మీ అభిప్రాయం.
జవాబు: కుందుర్తి గారు 1950ల నుండీ వచన కవిత్వ వ్యాప్తికి చాలా కృషి చేశారు. అన్ని ప్రక్రియల్లో వచనకవిత్వం రావాలని అభిలషించి తాను స్వయంగా వచనకవిత్వంలో కావ్యం, నాటిక, నాటకం మొదలైన ప్రక్రియల్లో అనేక గ్రంథాలు ప్రచురించారు. ఆనాటి యువకవులను ప్రోత్సహించటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి 1969 నుండి అవార్డులు ఇవ్వటం మొదలెట్టారు. ఆయన ప్రోత్సాహంతో 1967 లోనే వీర్రాజు గారు ఆరు కథలను వచనకవిత్వంలో రాసారు. తదనంతరం కావ్యం, నవల, ఆత్మకథ కూడా రాసారు. మిగతా ప్రక్రియలను ఇతరకవుల చేపట్టక పోయినా దీర్ఘ కవిత్వం మాత్రం చాలా ఎక్కువ గానే వస్తూనే ఉన్నాయి.

ప్రశ్న: మిమ్మల్ని కవయిత్రిగా గుర్తిస్తే ఆనందిస్తారా? రచయిత్రిగా గుర్తిస్తే ఆనందిస్తారా ? మీరు వంద మంది కవయిత్రుల కవితలతో మీ సంపాదకత్వంలో “ముద్ర” సంకలనం తెచ్చారు. నెచ్చెలిలో “నడకదారిలో ” పేరుతో మీ ఆత్మకథను రాస్తున్నారు. ఈ నిరంతర చైతన్యానికి కారణమేమిటి ?
జవాబు: నాకున్న సమయాభావం వల్ల కావచ్చు మొదటినుంచీ కవిత్వమే ఎక్కువ రాసాను. తొమ్మి సంపుటాలు ఇప్పటికే వెలువడ్డాయి.మరో కవితాసంపుటి, ఒక దీర్ఘకవితా ప్రచురణ కు సిద్ధంగా ఉన్నాయి.బహుశా అందుకే సాహిత్య రంగం నన్ను కవయిత్రి గానే గుర్తిస్తుంది. ఒక చిన్న సంఘటన, ఒక దృశ్యం, మనసును కలవరపరచినా,సంతోషపరచి నా అక్షరంగా ప్రవహించే నా స్వభావం కవయిత్రిగా గుర్తింపు వైపే మొగ్గు చూపుతుంది.
అలా అని ఇతరప్రక్రియలను అలక్ష్యం చేయలేదు. రెండున్నర సంవత్సరాలుగా నెచ్చెలి నా ఆత్మకథ “నడక దారిలో” రాస్తున్నాను. మూడు కథాసంపుటాలు, ఒక వ్యాససంపుటీ, డా.పి.శ్రీదేవిమీదా, నిడదవోలు మాలతి మీదా రెండు మోనోగ్రాఫ్ లు పుస్తక రూపంలో వచ్చాయి. అయిదు పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి..ఒక నవల, కథల సంపుటి, కవితాసంపుటి, వ్యాససంపుటీ ప్రచురించాల్సి ఉంది.
మీరు అన్నట్లుగా 2001 లో అనుకుంటాను వందమంది కవయిత్రుల కవితలను ‘ముద్ర’ పేరిట నేనూ, డా. పి. భార్గవీరావు కలిసి సంపాదకత్వంలో సంకలనం తీసుకు వచ్చాము. నిరంతర అధ్యయనం, రచనలు చేయటం నాకు ఇష్టమైన వ్యాపకాలు.

ప్రశ్న: ప్రపంచీకరణ ప్రభావం వలన కుల వృత్తులు నశించాయి. ఇదే ఇతివృత్తంతో మీరు రాసిన “దేవుడు బండ ” కథ గురించి వివరించడి.
జవాబు: ప్రపంచీకరణ ప్రభావం వలన రోళ్ళుమూలపడ్డాయి. ఎక్కువమంది ఉద్యోగినులు కావటం తో సౌలభ్యం కోసం మిషన్లు ఇంట్లోకి వచ్చాయి. దేవుడిబండ కథలో ఈ సందర్భం తో పాటు ఆర్థిక వెనకబాటుతో వలసపక్షులైన వృత్తిపనివారల పిల్లలకు చదువుదూరం కావటాన్ని చూపాను. పాడైపోయిన పొత్రం రోడ్లవిస్తరణలో గ్రామదేవతగా మారిన వైనంతో ప్రజల మూఢనమ్మకాలను అక్షరీకరించాను.

ప్రశ్న: ఆధునిక మానవ జీవితంలో వచ్చిన మార్పులను ప్రతిబింబించిన “మార్పు వెనుక మనిషి” వివరాలు చెప్తారా?
జవాబు: ఆధునిక జీవితంలో అలవాటు పడిన సౌకర్యాల వలన మనిషి అవి లేకపోతే ఉక్కపోతకు గురౌతున్నాడు. విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఇక్కడకు వచ్చి ఇక్కడ ఉన్నన్ని రోజులూ వాతావరణకాలుష్యాలకూ ఇరుకుదనానికి ఇబ్బంది పడటం చూస్తూ విమర్శిస్తాం. కానీ నగరజీవితానికి అలవాటుపడిన మనం కూడా మనం పుట్టిపెరిగిన గ్రామాలకు వెళ్తే అక్కడ అసౌకర్యాలకు చికాకు పడతాం. దీనినే కథాంశంగా తీసుకుని రాసిన కథ “మార్పు వెనుక మనిషి”.

ప్రశ్న: సరోగసీ మీద రాసిన కథ “గోవుమాలచ్చిమి” గురించి చెప్పండి.

జవాబు: గర్భధారణపు తొమ్మిది నెలలకాలమంతా ఆరోగ్యరీత్యా గడ్డుకాలమే. ప్రసవం మరో పునర్జన్మే. అయినా ఆ తర్వాత చేతిలోని బిడ్డతో తాదాత్మ్యం చెందుతుంది.
గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులవలన ఈనాడు ఎందరో పేద మహిళలు అద్దెకు గర్భాన్ని ఇస్తున్న వైనం తెలిసి రాసిన కథ “గోవుమాలచ్చిమి”.
తనది కాని బిడ్డని తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత బిడ్డని ఎవరికో అందజేయాల్సి వచ్చినపుడు తల్లి పడే బాధని అక్షరీకరించాను. గోవు చూడి కట్టి పాలు ఇస్తున్నంతకాలం దాన్ని ప్రేమిస్తాం. అదేవిధంగా స్త్రీ కూడా భర్త దురాశతో మళ్ళీ మళ్ళీ గర్భాన్ని అద్దెకు ఇవ్వాల్సి వస్తే అలా ఆదాయవనరుగా మారిపోతున్న దుస్థితిని వివరించాను.

ప్రశ్న: ఇప్పటి కవులు, రచయితలు ఫేస్బుక్ లో ప్రతీ రోజు తమ రచనలను పెడుతూ… ఎప్పుడూ సోషల్ మీడియాలోనే మునిగితేలుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు: ఇప్పటి కవులు చాలా వరకూ విద్యావంతులు కావటాన ఇతర విదేశీభాషా సాహిత్యాన్ని చదువుకునే అవకాశాలు ఎక్కువ. అందువలన కొత్త, కొత్త అంశాల్ని, కొత్త శైలి, కొత్త అభివ్యక్తుల్నీ సాహిత్యంలోనికి తెస్తున్నారు. అది మంచి పరిణామం.
అయితే కొందరిలో అధ్యయనం కొరవడిందని నా అభిప్రాయం. అంతేకాక రాసింది రాసినట్లుగా మాధ్యమాల్లో పంచేసి లైకులు కోసం ప్రశంసలు కోసం వెంపర్లాడటం కూడా పెరిగింది. విమర్శను ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఒక పుస్తకం వేసుకోగానే అవార్డులకోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్రక్రియలో రచనలు చేయాలనుకున్నా అధ్యయనం ఎక్కువగా ఉండాలి అని నా అభిప్రాయం.

హైమావతి గారూ మీరు ఈ విధంగా నన్ను 64కళలు పత్రిక ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

-మందరపు హైమావతి

4 thoughts on “సృజనశీలి సుభద్రాదేవి

  1. సాహిత్యకారుల ఇంటర్వ్యు చేయడం బావుంది. వాళ్ల గురించి మరింత తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

  2. శిలాసుభద్రా దేవి గారితో ఇంటర్వ్యూ వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నాను.

  3. నన్ను ఈ విధంగా మీ 64 కళలులో మందరపు హైమవతి గారి ద్వారా పరిచయం చేసి ప్రచురించినందుకు ధన్యవాదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap