పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

“నేను సామాన్యుణ్ణి. నావంటి సామాన్యుల కోసం సాహిత్యం అందిస్తా ” అనే సదుద్దేశంతో సాహిత్య రంగంలోకి అడుగు పెట్టిన చక్రపాణిగారు రచయితగా, అనువాదకుడిగా, పత్రికా సంపాదకుడిగా, సినీ రచయితగా, నిర్మాతగా ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తరువాతి తరం వారికి మార్గదర్శకులుగా నిలిచారు. చిరకీర్తిని సంపాదించారు.
చక్రపాణి మస్తిష్కం ఒక లాబరేటరిలాంటిది. ఒకవైపు సినీ రచన సాగిస్తూనే మరోవంక అనువాద రచనలు చేసేవారు. అంతేకాదు, ఒక పక్క పత్రికా నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తూనే ఇంకో పక్క పుస్తక ప్రచురణలను గురించి ఆలోచించేవారు. ఇవన్నీ ఎంతో వైవిధ్యమైనవైనా, ఒకదాని తాలూకు స్విచ్ ఆఫ్ చేసి మరో ప్రక్రియకు స్విచ్ వేసి అది పూర్తిచేసేవారు. కాలాన్ని ఎంతమాత్రం వృధాగా కరిగిపోకుండా అన్నిటికీ – న్యాయం చేసే చక్రపాణి బహుముఖ ప్రజ్ఞాశాలి. మేధాసంపన్నులు.

చక్రపాణిగారి ఆరోగ్యం కుదుటపడ్డాక 1935 యువనామ సంవత్సరంలో యువ మాసపత్రికను కొడవటిగంటి కుటుంబరావు సంపాదకులుగా ప్రచురించినట్లు తెలుస్తుంది. తదుపరి చెన్నై నుంచి 1946 నుంచి కొంతకాలం యువ మాసపత్రిక నిర్వహించారు.
మూడు దశాబ్దాల పాటు చెన్నైలో గడిపాక, వ్యక్తిగత కారణాల చేత చక్రపాణిగారు రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి తన మకాం మార్చి, అక్కడే స్థిరపడాలని ఆలోచించారు. వెంటనే తన ఆలోచనను కార్యరూపంలో పెట్టారు.

హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ కు ఎదురుగా ఉన్న ఒక పాత ఇంటిని కొన్నారు చక్రపాణిగారు. దానిని బాగు చేయించారు. అనుకున్న ప్రకారం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో యువ బుక్స్’ పేరుతో చాలా పుస్తకాలు ముద్రించిన చక్రపాణిగారు ‘యువ’ పేరు మీద గల ఆపేక్షతో 1959లో హైదరాబాద్ నుండి ‘యువ’ మాసపత్రికను ప్రారంభించారు. మొదట్లో ‘యువ’ను ఇతర ప్రింటింగ్ ప్రెస్ తో ముద్రిస్తూ వచ్చారు. అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని, సొంత ప్రెస్ ఉండాలనే ఉద్దేశంతోనూ ‘యువ’ పత్రిక ముద్రణ కోసం 1965లో హైదరాబాదు, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా డాల్టన్ ప్రెస్’ను నిర్వహించారు.
చక్రపాణిగారు. అంతకుముందు తాము నడిపిన “ఆంధ్రజ్యోతి’ మాసపత్రిక కంటే భిన్నంగా కొన్ని మార్పులు చేసి ‘యువ’ మాసపత్రికను నడిపారు.
‘యువ’ మాసపత్రికలో సాహిత్యానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ అవగాహనను పెంచే అనేక ఆలోచనలు రేకెత్తించే అంశాలు ఉండేవి. ‘యువ’లో మరో ఆసక్తికరమైన శీర్షిక, ‘పని లేని మంగలి’. సమాజంలోని అనేక లొసుగులు,

మోసాలు, అనవసర ఆర్భాటాలు మొదలైన వాటిని వ్యంగ్యంగా, హాస్యపూరితంగా ఆ శీర్షిక ద్వారా చెప్పి సామాన్య ప్రజానీకాన్ని జాగృతం చేశాయి. ‘యువ’ లోని ‘పనిలేని మంగలి’ వ్యాసాలు. ‘యువ’ను ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఒక సంపుటిగా గుర్తించటం చక్రపాణిగారి పద్ధతి. అదే పద్ధతిని అంతకుముందు ‘చందమామ’, ఆంధ్రజ్యోతి పత్రికలలో కూడా అనుసరించేవారు.
ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా ప్రచురించే ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచిక పత్రికారంగంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఇది సాహితీలోకానికి ఒక గొప్ప మలుపుగా మారింది. ‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలను ప్రతివారూ ఎంతో జాగ్రత్తగా పదిలపరచుకొనే విధంగా చక్రపాణిగారు తీర్చిదిద్దేవారు.
యద్దనపూడి సులోచనారాణి ఆ సంచికలలో ఆనాటి సుప్రసిద్ధ రచయిత్రి, రచయితలు గోపీచంద్ మధురాంతకం రాజారామ్, భానుమతీ రామకృష్ణ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, బీనాదేవి, కాళీపట్నం రామారావు, మాదిరెడ్డి సులోచన, యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు, తాళ్యూరి నాగేశ్వరరావు, ముళ్ళపూడి వెంకటరమణ తదితరుల రచనలు ఉండేవి.

గోపీచంద్ గారి ‘చీకటి గదులు’ నవల ‘యువ’ మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది.
‘యువ’ దీపావళి ప్రత్యేక సంచికలలో వడ్డాది పాపయ్య చిత్రించిన పోతన, త్యాగయ్య, శ్రీనాధుడు, మరో త్రయం (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) మాణిక్యవీణ, ఊర్వశీ విజయం, మేఘసందేశం మొదలైన వర్ణచిత్రాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి, ‘యువ’ మాసపత్రిక నాటి యువతరానికి ఆరోగ్యకరమైన సాహిత్యాన్ని అందించింది. వారిలో చదివే అలవాటును పెంచింది. ఒకప్పుడు ‘భారతి’ సాహిత్య పత్రిక సాధించినంత ఖ్యాతిని ‘యువ’ పత్రిక సంపాదించింది. ‘యువ’లో కథ అచ్చయితే పరమపథ సోపానాన్ని ఎక్కినట్లు రచయితలు భావించేవారు. ఆ పత్రికంటే యువతరంలో అంత మోజు ఉండేలా చక్రపాణిగారు రూపుదిద్దారు.
పత్రికల నిర్వహణలో చక్రపాణిగారిది ఒక విశిష్టమైన పద్ధతి. పత్రికను సచిత్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో ఎంతో శ్రద్ధ తీసుకొనే వారు. అంతకుమించి శ్రమించేవారు. పాఠకులకు అవసరమైన సమాచారం ఎంతో అధికంగా ఇవ్వడానికి ప్రయత్నించే వారు. అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్త పడేవారు.

అన్నిటికీ మించి రచయితలకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చే ఉత్తమ సంప్రదాయాన్ని చక్రపాణిగారె ప్రవేశపెట్టారు. “పేపరు కొట్టు వాడికి ఇస్తున్నాం. ప్రెస్ వాడికి ఇస్తున్నాం. బైండరుకు ఇస్తున్నాం. రచయిత ఏం పాపం చేశాడు ? పత్రిక నష్టాల్లో నడిచిన, లాభాల్లో నడచిన రచయితకూ పారితోషికం యిద్దాం” అనేది చక్రపాణి గారి బలమైన అభిప్రాయం. రచన అచ్చయిన సంచిక, పారితోషికం తాలూకు. మనియార్డరు ఒకే రోజు చేరేలా పంపేవారు చక్రపాణిగారు. రెండూ ఒకేసారి అందుకోవడం ఒక థ్రిల్ గా రచయితలు భావించేవారు. రచయితలపై చక్రపాణిగారు చూపిన అభిమానం, ఆదరణ అంత గొప్పగా ఉండేవి. పత్రికా నిర్వహణ పాఠకుడే ఆయన లక్ష్యం..

‘యువ’ మానపత్రిక హైదరాబాదులో ప్రారంభించటానికి ముందు చక్రపాణిగారు ఆలోచించిన విధంగా ఆ తరువాత కుదరలేదు. ఆయన చెన్నైని వదలిపోవటం సాధ్యపడలేదు. అందుకే తాను చెన్నైలోనే ఉంటూ వీలైనపుడు హైదరాబాద్ వస్తుండేవారు. అలా ‘యువ’ మాసపత్రిక హైదరాబాద్ కేంద్రంగా ఇరవై సంవత్సరాలు నడిచింది.

చక్రపాణిగారు చెన్నైలోని విజయ నర్సింగ్ హెూమ్ లో కాలధర్మం చెందారు. వారి ప్రచురణలు అన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్లో ‘యువ’ ప్రచురించే డాల్టన్ ప్రెస్ మూతపడింది. చక్రపాణి గారు సంపాదించిన ఖ్యాతికీ, ఆస్తులకు గుర్తుగా పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా గల చక్రపాణి ఎస్టేట్స్ ఇప్పటికీ ఉంది.
ఈ విధంగా చక్రపాణిగారు హైదరాబాద్ లో ‘యువ’ మాసపత్రికను, డాల్టన్ ప్రెస్ ను పెట్టి సాహితీసేవను చేశారు. పత్రికా ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. ఉత్తమ విలువలు నిలిపారు. క్రమశిక్షణ పాటించారు. పత్రికా ప్రపంచంలో ఒక ఆణిముత్యంలా వెలుగొంది చిరంజీవి అయ్యారు.

-చొక్కాపు వెంకటరమణ

(చక్రపాణి గారి శతజయంతి సంచిక నుండి)

2 thoughts on “పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

  1. యువ మాసపత్రిక ఎంతో ఉన్నతమైన సాంప్రదాయ విలువలు పాటించేది.కథలు నవరసాలతో నిండి ఉండేవి. సమకాలీనంగా జ్యోతి మాసపత్రిక ఉండేది.వారపత్రికలలో ఎంతో ఉన్నతస్థానం సంపాదించిన ఆంధ్రప్రభ కొన్నాళ్ళు ‘ప్రభ’ పేరుతో వారపత్రిక సైజులో నుకూడా వెలువరించింది.

  2. యువ మాసపత్రికలో వచ్చిన అనేక శీర్షికలు ఎంతో బాగుండేవి. 1961 నుండి 1964 మధ్య మొఘల్ దర్బారు కుట్రలు అను రచన ఒకటి మాసపత్రికలో సీరియలుగా వచ్చినది. అది మరొకమారు చదువవలెనని అనుకున్నను, వీలుకాకున్నది.
    దొరుకుతుందేమో తెలుపగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap