(కె.ఎన్.వై. పతంజలి సాహిత్య పురస్కారం వరించిన సందర్భంగా …)
నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని కాలక్షేపంగా కాక సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయిత అట్టాడ అప్పలనాయుడు. కథకుడిగా నవలాకారుడిగా నాటక రచయితగా వ్యాసకర్తగా ఉత్తరాంధ్ర సమాజం నడిచిన అడుగుల సవ్వడినీ అక్కడి ప్రజా శ్రేణులు అనుభవిస్తోన్న గుండె అలజడినీ వినిపిస్తున్న అప్పల్నాయుడు తెలుగులో ఉద్యమ సాహిత్య నిర్మాతగా విశిష్ట పాత్ర పోషించాడు. వంశధార, నాగావళి, ప్రళయావతి నదీ తీరాల్లో రక్తసిక్తమైన వంద సంవత్సరాల చరిత్రని అతను తన రచనల్లో నమోదు చేసాడు. ఎమర్జెన్సీ తర్వాత వొక చేతిలో కలం, మరో చేతిలో ‘పువ్వుల కొరడా’ (1978) ధరించి కథన రంగంలో దిగిన అప్పల్నాయుడి రచనలపై శ్రీకాకుళం గిరిజన ఉద్యమ ప్రభావం అమితంగా వుంది. ఉద్దానంలో తిరగబడ్డ ఆదివాసీ అతని కథల్లో తొలి కథానాయకుడు. అప్పటి నుంచీ యిటీవల ‘బీల’భూముల్లో జీవ విధ్వంసానికి కారణమైన థర్మల్ ప్రాజెక్ట్ వ్యతిరేక వుద్యమం వరకూ పీడిత ప్రజా సమూహాలతో భౌతికంగా కల్సినడిచిన నిమగ్న సాహిత్య రాజకీయ జీవితం అతనిది. అందుకే అమాయకత్వంతో దోపిడీకి గురైన గిరిజన రైతాంగం బుగతల రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టడానికి దారితీసిన పరిస్థితుల్ని ‘పోడు పోరు’ (1983) గా కథీకరించాడు. ఆ విధంగా శ్రీకాకుళం ఉద్యమానికి సాహిత్య రూపమిచ్చి కొండగాలి, కొత్తగాలి తేడాలని యెరుక చేసిన భూషణం మాష్టారు ఆగినచోట అప్పల్నాయుడు మొదలయ్యాడు. ఆధునిక అరణ్య పర్వాన్ని కథామాధ్యమంగా వ్యాఖ్యానించాడు (1987). అడవిబిడ్డని షావుకార్లు సొండీలు బుగతలు దోచుకొన్న వైనం గురించి, దానికి వ్యతిరేకంగా జరిగినసాయుధ పోరు గురించి విశ్లేషించాడు. ‘నేలని తలకిందులు జేసి పండించినోడు-పాలనని తలకిందులజేసి, బతుకు పండించు కుంటాడ’ని ధీమాగా చెప్పాడు (మమకారం-1994).
తొలినాళ్లలో కేవలం ఉద్యమానికి సంబంధించి తానూ పరోక్షంగా తెలుసుకున్న వార్తలతో కథల్ని అల్లుకొని రాసినా (ఖండ గుత్త, ప్రజాకోర్టు, పంట మొ. కథలు), రానురానూ అప్పలనాయుడు తనకు యెదురైన… తన అనుభవంలోకి వచ్చిన సంఘటనల్ని పరిశీలించి, సామాజిక చలనాన్ని పసికట్టి, గతితార్కికంగా విశ్లేషించుకుని వాటిని కథా వస్తువులుగా మలచుకున్నాడు (ప్రత్యామ్నాయం-1995). శ్రీకాకుళం ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేసింది. అందులో డొల్లతనాన్నీ, అమాన వీయతను అప్పలనాయుడు యెంతో ఆవేదనతో క్రోధంతో అక్షరాల్లోకి తర్జుమాచేశాడు (పునరావాసం నవల-1996). మైదాన ప్రాంతాల్లో ప్రపంచీకరణ పడగనీడలో వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకున్న సంక్షోభాలకు గురైన శ్రామిక జన జీవితాల్లో చోటుచేసుకొన్న దృశ్యాదృశ్య హింసనీ, దాన్నుంచి బయటపడటానికి సన్నకారు రైతులు కార్మికులు చేసే రాజకీయ సమరాల్ని తన రచనల్లో బలంగా ఆవిష్కరించాడు. (బంధాలూ- అనుబం ధాలు, 1995). భూమి ఉత్పత్తి సాధనంగా గాక మార్కెట్ వనరుగా మారిన వైనాన్ని (ఓ తోట కథ-1997) చెబుతూనే, యెన్ని విపత్కర పరిస్థితులు యెదురైనా రైతు భూమితో అనుబంధాన్ని వదులుకోడనీ అందుకు యెంతకైనా తెగించి పోరాడతాడనీ గొప్ప ఆర్తితో గానం చేశాడు(క్షత గాత్ర గానం1999). ఉత్తరాంధ్ర నేలపై నిప్పురవ్వల్ని రగిల్చిన యానగాలి (1997)ని రచయితగా అప్పల్నానాయుడు తన గుప్పిట బంధించాడు. తెలుగు కథకి అందునా విప్లవకథకి కొత్త వస్తు శిల్పా లతో కొత్త ఊపిర్లు ఊదాడు. ప్రజా ఉద్యమాలతో ముడివడివున్న జీవితాలకు సంబంధించిన బహుముఖ పార్శ్వాలు, సిద్దాంతాలు, వాటిని నడిపిస్తోన్న నిర్మాణాలు, ఉద్యమంలో యెత్తుగడలూ వ్యూహాలు వాటి మంచి చెడూ గురించి అప్పల్నాయుడు వొకానొక సందర్భంలో చర్చకు పెట్టాడు(వాళ్ళు -1998). అందుకు చరిత్ర పొడవునా ఉత్తరాంధ్ర ఉద్యమ గమనాన్ని చిటికెన వేలు పట్టుకుని సాహిత్యం లోకి తీసుకువచ్చాడు. దేశంలో అధికారం బదిలీ అయ్యాక స్వాతంత్ర్య ఫలాలు యెవరికి దక్కాయని కారా మాష్టారి ‘యజ్ఞం’ కథ చర్చకు పెడితే ‘యజ్ఞం తర్వాత జరిగిన అనేక రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాల్ని పెట్టుబడుల చలనాన్నీ పోరాటాలకు కేంద్రంగా పనిచేసిన భూమి సమస్యనీ ఉత్పత్తి సంబంధాల్లో వస్తున్న మార్పుల్నీ మిత్ర శత్రు సమీకరణాల్లో చోటు చేసుకున్న వైరుధ్యాల్నీ హింస ప్రతిహింసలకు సంబంధించి యెన్నో ప్రశ్నలు రచయితగా అప్పల్నాయుడిని రాపాడాయి. (యజ్యం తర్వాత – 2001) . ఆ క్రమంలోనే ఇచ్చాపురం రైతుల పాదయాత్ర నుంచి మందసా జమీ వ్యతిరేకోద్యమం స్వాతంత్ర్యోద్యమాల ముందూ వెనకా నక్సల్బరీ పోరాటం వరకూ ఉద్దానం కేంద్రంగా పురుడు పోసుకున్న అనేక ప్రజా రాజకీయోద్యమాల ఉత్థాన పతనాలని జరిగిన అద్భుతమైన శిల్పంతో దృశ్యమానం చేశాడు (ఉత్కళం నవల-2001).
తన సాహిత్యంలోకి అతి సహజంగా జొరబడ్డ కళింగాంధ్ర నేల బిడ్డల జీవన విధ్వంసం అప్పల్నాయుడిని అలవిగాని కల్లోలాలానికి గురిచేసింది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైనప్పటికీ పాలకుల నిర్ల క్ష్యంవల్లో ప్రాంతేతరుల ఆధిపత్యంవల్లో ఆనకట్టల్లేక నీటి పారుదల సౌకర్యాలు లేక పంటల్లేక ఉపాధిలేక అప్పులు పుట్టక చేసిన అప్పులు తీర్చలేక ఆకలికి తాళలేక చస్తూ బతకలేకపొట్ట చేతబట్టుకుని పుట్టిన వలసలు వొదిలి వలస బోయే రైతుల దైన్యాన్ని చూసి తల్లడిల్లాడు (బతికిచెడిన దేశం-2005). ఆర్థి కమే కీలకమై మానవ బాంధవ్యం మాసిపోయేల చేసున్న వ్యవస్థల పట్ల ఆగ్రహం ప్రకటించాడు. (నేను-నేనె-2005) వలసల్లో ప్రజలు సామూహిక జీవితానికి దూరమై ముక్కలుగా విడిపోవడం చూసి ఆర్తి చెందాడు. పార్లమెంటరీ రాజకీయాల్లో సైతం వెనకబడ్డ ప్రాంతాలపై అభివృద్ధి చెందిన ప్రాంతాల ఆధిపత్యం కొనసాగే తీరుని వ్యాఖ్యానిస్తూ రాసిన అతని రచనలు (షా-2005) అతని సాహిత్యజీవి తంలో మలుపుగా భావించవచ్చు. అతణ్ణి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అస్తిత్వానికి ప్రాతినిధ్య రచయితగా గుర్తించడమో కుదించడమో జరిగింది. నిజానికి ఉత్తరాంధ్రని నిర్దిష్టంగా లక్ష్యీకరిస్తూ దేశవ్యాప్తంగా అమలౌతున్న కార్పోరేట్ మార్కెట్ శక్తుల దోపిడీనీ అందుకు వత్తాసుగా నిలబడ్డ రాజ్యం వికృతంగా అమలుచేసే హింసనీ తెలియజెప్పడమే అతని సాహిత్య ప్రణాళిక. ఉధృత ప్రవాహ సదృశమైన శైలి అప్పల్నాయుడి రచల్లో చూస్తాం. ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన విలక్షణమైన వెటకారం అతని బలం. క్రోధాన్ని వ్యంగ్యంగానూ దుఃఖాన్ని అధిక్షేపంగానూ ఆక్రోశాన్ని యెత్తి పొడుపుగానూ బలహీనతని పరిహాసంగానూ మలచే నేర్పు అతని సొంతం. కొద్దిపాటి మాటల్లోనే ఆలంకారికంగా కవితాత్మకమైన-ప్రతీకాత్మకమైన నేపథ్యాన్ని నిర్మించగలడు, మనుషుల వ్యక్తిత్వాన్ని నిరూపించగలడు. సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితుల్ని పతంజలి లాగా బ్లాక్ కామెడీలోకి తర్జుమా చేయడంలో సైతం అప్పల్నాయుడు సిద్ధహస్తుడు (ఒక పొట్టివాడూ కొందరు పొడుగువాళ్ళ కథ, 2004). సంభాషణల్లో సహజంగా చోటుచేసుకునే కళింగాంధ్ర యాస అతని రచనలకు అపూర్వమైన సొగసుని అద్దాయి.అప్పల్నానాయుడు కళింగ యుద్ధ క్షతగాత్రుడు అయినప్పటికీ యెక్కడా నిరాశాపూరితమైన రచన చేయలేదు. పీడితుల వంచితుల బాధాసర్పదష్టుల పరాజితుల చరిత్రని నమోదు చేసినా పోరాట కేతనం దించలేదు. అందుకే రాజ్యమే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారి దోచుకుంటే సహించలేక గొడ్డలెత్తిన మంగయ్య దగ్గర్నుంచీ ‘ట్టిపా’ వరకూ తిరగబడ్డ పాత్రలనే అతను సృష్టించాడు. అన్యాయానికి యెదురొడ్డి సాయుధమై నిలబడ్డ ప్రజాస మూహాలు “నిరాయుధం’గా (2017) మారినా ఉద్యమ చైతన్యం మాసిపోలదనీ పోరుబాట వదిలేది లేదనే తన రచనల ద్వారా నిరూపించాడు.
-ఎ. కె. ప్రభాకర్
Thanq Sir
Welcome sir