కరోనాకు ఓ రిటర్న్ గిఫ్ట్ …

(కేసీఆర్ మెచ్చిన ఐనంపూడి శ్రీలక్ష్మి కవిత )

ఏమైందిప్పుడు..
క్షణాలు మాత్రమే కల్లోలితం
ఆత్మస్థయిర్యాలు కాదు కదా
సమూహాలు మాత్రమే సంక్షోభితం
సాయం చేసే గుండెలు కాదు కాదా..!
ఎన్ని చూడలేదు మనం
కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు
కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు
ప్లేగును జయించిన దురహాసంతోనే కాదా
చార్మినార్‌ను నిర్మించుకున్నాం..!
గతమెప్పుడూ విజయాల్నే గుర్తుచేస్తుంది
వర్తమానమెప్పుడూ సవాళ్లేనే చూపిస్తుంది
భవిష్యతెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది
కుంగుబాటు తాత్కాలికమే
యుద్ధభూమిలోకి దిగాక
వెనక్కు తిరగడం, వెన్నుచూపటం
మనకు తెలియదు
యుద్ధం ఏ రూపలో వస్తేనేం
మిస్త్సెల్ అయినా-వైరస్ అయినా
పెద్ద తేడా ఏం ఉంటుంది కనుక…!
నీకు బాగా తెలుసు-జీవన వాంఛాజనితం
మన దేహం
ఎన్నిమార్లు యుద్ధ ప్రసనాలు చూడలేదు
ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు!
కరోనా పాజిటివ్ అయితే ఏంటట
పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక
సామాజిక దూరం మన అస్త్రమయ్యాక
జనతా కర్ఫ్యూ మన కవచమయ్యక
ఇప్పుడిక క్వారంటైనే మన వాలంటైన్..!
ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా?
క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు
దొంగతనంగా ప్రవేశించిన కరోనాకు కరుణ తెలియదు
క్యా కరోగే.. అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు

లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు
నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో
పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం
మన కలాల్ని కరవాలాలుగా మార్చి
కవి సిపాయిలుగా మారుదాం
నిరస్త్రంగా-క్షతగాత్రులుగా మిగలకుండా
రథ, గజ, తురగ పరివారాలతో పని లేకుండా
ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా
ప్రతియుద్ధం ప్రకటిద్దాం
దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది..
ఆత్మస్థెర్యంతో ఎదిరిద్దాం
కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం
ఎన్నో యుద్ధాలను చూశాం.. కానీ ఇది ఎంతో
ప్రత్యేకం

గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు
విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక
పోరాటం చేయాలి
ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి
సైనికుడు కాదా
ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల
రక్షణ వలయం అల్లుదాం రండి
కబళించాలని చూసే కరోనాను
మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం
విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి
ఐసోలేషన్ వ్యూహంతో.. సమస్తే మంత్రంతో..
రిటర్న్ గిప్ట్ ఇద్దాం రండి..!
————————————————–
ఐనంపూడి శ్రీలక్ష్మి ఆకాశవాణి, హైదరాబాదులో రెండు దశాబ్దాలు అనౌన్సరుగా పనిచేసారు.
ఆమె రచయిత్రి. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలు ప్రచురించారు.
కొన్ని డాక్యుమెంటరీలు కూడా రూపొందించారు.

1 thought on “కరోనాకు ఓ రిటర్న్ గిఫ్ట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap