కళల గురించి కన్న‘కల’ సాకారమైన వేళ…!
64 కళలు.కాం పత్రిక ప్రారంభించి నేటికి 13 ఏళ్ళు పూర్తయ్యింది. కళల గురించి ప్రత్యేకంగా ప్రారంభించిన మొట్టమొదటి వెబ్ పత్రిక ఇదే కావడం విశేషం. నాటి నుండి నేటి వరకు అనే సవాళ్ళను ఎదుర్కొని పత్రిక పాఠకాదరణతో ముందుకు సాగుతుందంటే అందుకు సహకరిస్తున్న రచయితలు, ఆదరిస్తున్న పాఠకులే కారణం. ఈ సందర్భంగా పత్రిక నేపద్యం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
——————————————————–
2021 సంవత్సరంలో ఆంధ్రకళాదర్శిని పుస్తక ప్రచురణకు ముందు కొందరు మిత్రులతో కలసి “ఆంధ్రా ఆర్టిస్ట్స్, స్కల్పటర్స్ అండ్ కార్టూనిస్ట్ అసోసియేషన్” (AASCA)ను ప్రారంభించాను. ‘ఆస్కా ద్వారా 2002 సం.లో కార్టూన్ మేళా నిర్వహణ, 2004 సం.లో ఆంధ్రకళాదర్శిని-2 ప్రచురణ వంటి అనేక కార్యక్రమాలతో కళాకారులకు దగ్గరయ్యాను.
2004 సం.లో కంప్యూటర్ విజ్ఞానం మాసపత్రికలో సబ్ ఎడిటర్ కం డిజైనర్ గా పనిచేసే సమయంలో డాట్కామ్ ల హవా ప్రారంభమైంది. అదొక కొత్త ప్రపంచంలా నన్ను ఆకర్షించింది. అప్పటి నుండి వెబ్సైట్లు, వెబ్ మేగజైన్లు రెగ్యులర్గా చదివేవాడిని.
తొలి ప్రయత్నం: 2005 సంవత్సరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్ గా కొత్త ఉద్యోగంలో చేరాను. అక్కడ సంపాదించిన అనుభవంతో, అవగాహనతో 64కళలకు సంబంధించిన విశేషాలతో పత్రిక తెస్తే ఎలా వుంటుంది? అని మిత్రులతో చర్చించాను. వారందరూ ఆలోచన బావుంది… కాని ఆచరణ కష్టమేమో అన్నారు. అలా సంవత్సరం పాటు మధనపడ్డాను. అప్పటి వరకు అనేక పత్రికలలో వ్యాసాలు రాసిన, పనిచేసిన అనుభవంవుంది కనుక 2010 సం. ఆగస్ట్ నెలలో www.64kalalu.com డొమైన్ రిజిష్టర్ చేశాను. అప్పటికీ పరిచయం వున్న TheUXGroup వారితో మాట్లాడి పత్రిక ఎలా వుండాలో, ఎలాంటి ఫీచర్లు కావాలో రఫ్ డిజైన్ ఇచ్చాను. అలా ప్రారంభమైన డిజైన్ వర్కు మూడు నెలలకు పూర్తయ్యింది. తర్వాత వెబ్ హెూస్టింగ్ కూడా చేయడం జరిగింది.
పత్రిక ఆవిష్కరణ: నవంబర్ 1, 2010 న ఆవిష్కరణకు సిద్ధం అయ్యాను. నాకు అన్ని విధాల సహకరించే మిత్రులు, సుప్రసిద్ధ కార్టూనిస్ట్ ఏవిఎమ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింప జేయాలని
నిర్ణయించుకున్నాను. అప్పటికే చాలా ఖర్చు చేయడంతో ఆవిష్కరణ మా ఇంట్లోనే నిరాడంబరంగా చేయాలనుకున్నాను.
2010, నవంబర్ 1 తేదీ ఉదయం 9 గంటలకు ఆవిష్కరణ సమయం. కొద్దిమంది మిత్రులనే పిలిచాను. ఆ రోజు ఉదయం నుండి భారీ వర్షం పడడంతో.. కాస్త ఆలస్యంగా ఏ.వి.ఎమ్. గారు, కార్టూనిస్ట్ మిత్రుడు వి. రామకృష్ణగారు వచ్చారు, మాతో పాటు నా శ్రీమతి లీలావతి వుంది. ఆ విధంగా 2010 సం. నవంబర్ 1న విజయవాడ, మధురానగర్ లోని మా ఇంటిలో పత్రిక ప్రారంభోత్సవం ఏ.వి.ఎమ్. గారి చేతుల మీదుగా జరిగింది. అలా అంతర్జాలం ద్వారా క్షణాల్లో www.64kalalu.com పత్రిక ప్రపంచ వ్యాప్తంగా వున్న కళాకారులకి అందుబాటులోకి వచ్చింది.
యూనికోడ్ ఫాంట్స్: 2016 లో అమెరికా నుండి వచ్చిన కూచిభొట్ల ఆనంద్ గారు మచిలీపట్నంలో విడియాల చక్రవర్తి అనే మిత్రుడి ద్వారా పత్రిక గురించి తెలుసుకొని నాకు ఫోన్ చేశారు. “మీ ప్రయత్నం బావుంది… కాని ఇలా పి.డి.ఎఫ్. ఫార్మేట్లో పెట్టడం వలన గుగూల్ సెర్చ్ ఇంజన్ పత్రికలోని కంటెస్ట్ను గుర్తించలేదు. కాబట్టి యూనికోడ్ ఫాంట్స్లోకి మార్చండి. ఇంకా ఎక్కువ మంది పాఠకులకు చేరువవుతుంది” అని సలహా ఇచ్చారు. ఆ దిశలో ఆలోచించాను. నిజమే అప్పటికే కొన్ని తెలుగు వెబ్ పత్రికలు యూనికోడ్ ఫాంట్స్లో ఉండడం గమనించిన నేను వెబ్ డిజైనర్ తో మాట్లాడి, ‘వర్డ్ ప్రెస్’ టెక్నాలజీలో పత్రికను రీ-డిజైన్ చేయించాను. అంతేకాకుండా సమాచార వ్యవస్థలో వచ్చిన వేగాన్ని అందుకోవడానికి మాసపత్రికను వారపత్రికగా మార్చాను.
పుష్కరోత్సవం: 2020 సం.లో పది వసంతాలు పూర్తిచేసుకొని, కళారంగంలో సుస్థిర స్థానానికి చేరుకున్న శుభసందర్భాన్ని మనంగా దశమ వార్షికోత్సవం జరుపుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కాని… అశనిపాతంలా ‘కోవిడ్-19’ రూపంలో వచ్చి పడింది. ఇక 2022 సం. నవంబర్ నాటికి పన్నెండేళ్ళు పూర్తిచేసుకొని ఆ పుష్కరోత్సవాన్ని మార్చి 5, 2023 న విజయవాడలో పత్రిక రచయితలు, కళాభిమాలునుల మధ్యన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 64kalalu.com 72 పేజీల పుష్కరోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరిగింది.
మాసపత్రికగా: మొదట మాసపత్రికగా 50 పేజీలతో రంగుల్లో డిజైన్ చేసి, పి.డి.ఎఫ్. ఫార్మేట్లో ప్రతీనెలా 1 వ తేదీన అప్డేట్ చేసేవాడిని. ఎప్పుడైనా ఇంట్లో ఇంటర్ నెట్ సమస్య తలెత్తితే బయట నెట్ సెంటర్ కు వెళ్లి పత్రిక అప్డేట్ చేసేవాడిని. పత్రికను ప్రారంభిస్తే సరిపోదు కదా. నలుగురికి తెలియజేయడానికి ఇ-మెయిల్స్ ద్వారా లింక్లు పంపడం, కరపత్రాలు పంచడం ద్వారా ప్రచారం చేశాను. మొదట్లో పత్రికను నెలకు సగటున 5 వేలమంది చదివేవారు.
ఎన్నో అనుభవాలు: ఈ పన్నెండేళ్లలో టెక్నాలజీ పరంగా, రచనా పరంగా, పత్రికా ఎడిటర్ గా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో మందితో పరిచయాలు కలిగాయి.
సాఫ్ట్వేర్ కంపెనీలో యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ (UI Designer) గా పనిచేసిన నా అనుభవం ఈ వెబ్ పత్రికను ఇంతకాలం నడపగలిగేందుకు దోహదపడిందని నమ్ముతాను.
ఎంతమంది చదువుతున్నారు: ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు సుమారు 25 దేశాల నుండి సగటున నెలకు 20 నుండి 22 వేలమంది చదువుతున్నారు. కాని పత్రిక చదివే వారందరూ కామెంట్ల రూపంలో స్పందించరు. కొంతమందే మెయిల్స్ రూపంలోనూ, కామెంట్ల రూపంలోనూ, ఫోన్ల ద్వారాను వారి స్పందన తెలియజేసినపుడు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.
‘64కళలు.కాం’కు పెన్ను దన్ను: 64kalalu.com పత్రిక సకలకళల సమాహారం కాబట్టి ప్రారంభంలో నాటకం, సినిమా, సంగీతం, సాహిత్యం లాంటి పలు అంశాలలో ఆర్టికల్స్ రాయించడం, సేకరించడం కష్టంగానే అనిపించింది. అయితే నాలుగేళ్ళ తర్వాత అనేక కళారంగాలకు చెందిన రచయితలు, కళాకారులు స్వచ్ఛందంగా వ్యాసాలు రాసి పంపించి నాలో ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపిస్తున్నారు. అందుకు రచయితలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.
పత్రికకు ఆదాయం వస్తుందా?: 2015 నుండి ప్రాంతీయ భాషల్లో వెబ్ పత్రికలకు ‘గుగూల్ యాడ్సెన్స్’ ద్వారా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. 64kalalu.com పత్రికకు కూడా ప్రకటనలు వస్తున్నాయి, అయితే… ఈ పత్రికకున్న పరిమిత పాఠకుల కారణంగా యాడ్ రెవెన్యూ పరిమితంగానే వుంటుంది. ఎందుకంటే… ఇది నెట్లో చదువుకునే పత్రికేగాని, కొట్లో కొని చదివే పత్రిక కాదు.
అనేక కార్యక్రమాలు: ఈ 13 ఏళ్ళలో 64కళలు. కాం పత్రిక ఎక్స్రే సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ, సుమధుర కళానికేతన్, జాషువా సాంస్కృతిక వేదిక, శ్రీశ్రీ సాహిత్య నిధి, జాషువా సాంస్కృతిక వేదిక, క్రియేటివ్ హార్ట్స్ అకాడెమి అఫ్ ఫైన్ ఆర్ట్స్,’తానా’ ప్రపంచ సాహిత్య వేదికలతో కలసి కార్టూన్లు, చిత్రలేఖనం పోటీలు, ప్రదర్శనలు నిర్వహించింది. 2021 సం॥లో చిత్రకళా పరిషత్తో కలసి రంగుల రారాజు వడ్డాది పాపయ్య శతజయంతి ప్రత్యేక సంచిక ప్రచురణ, విశాఖపట్నం, విజయవాడలలో జయంతి సభలు నిర్వహించింది. మరెన్నో కార్యక్రమాలకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నది. 2021 సంవత్సరంలో తెలుగు వికీపీడియా వారు కూడా కళా సంబంధిత వ్యాసాలు రాయమని నన్ను వారి బృందలో చేర్చుకున్నారు. ఇప్పటికే వికీపీడియాలో కొందరి కళాకారుల గురించి వ్యాసాలు రాశాను. 13ఏళ్ళుగా పత్రికను ఆద్రిస్తున్న పాఠకులకు, కళాభిమానులకు నా కళాభివందనాలు.
2023 లో మరో బృహత్తర కార్యక్రమం: ఆంధ్ర ప్రదేశ్ చిత్ర, శిల్ప కళలకు వేల సంవత్సరాల చరిత్ర వున్నప్పటికీ సరిఅయిన పుస్తకాలు లభ్యం కావడంలేదు. ఆంధ్రకళాదర్శిని (Art of Andhra Pradesh) పేరుతో ఏ.పి. లోని సమకాలీన చిత్రకారుల, శిల్పుల మరియు కళంకారి కళాకారుల పరిచయాలతో బొమ్మలతో రంగుల్లో A4 సైజులో సుమారు 300 పేజీల సమగ్ర గ్రంథం ప్రచురించ తలపెట్టాను. చిత్రకారులు, శిల్పులు, కళాభిమానులు చిరకాలం దాచుకోదగ్గ అపురూప పుస్తకంగా రూపు దిద్దుకుంటుంది. ఇది చివరి దశకు వచ్చింది. 2024 జనవరిలో పుస్తకం మీ ముందుకు వస్తుంది.
-కళాసాగర్ యల్లపు
తాబేలు నడవడం మొదలుపెడితే, జీవితకాలంలో భూమిని చుట్టి వేయగలదట! మీ సంకల్పం గొప్పది! మీ లక్ష్యానికి మరొక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అది రేపు అని పిలువబడుతుంది ! ఒక బస్తా బరువును మోయడం చాలా సులభం. కానీ ఒక ఔన్స్ కళను మోయడం చాలా కష్టం! మీరు ఈ బృహత్కర మహోత్కృష్ట కార్యాన్ని బుజాలకెత్తుకున్నారు! ఇది మీ సుకృతం! ప్రస్తుతానికి ఒక అభినందనతోనే ముగిస్తాను!
Nice
మీరు చాలా గొప్పపని చేస్తున్నారు.. ఇలాంటి పత్రికను పదమూడేళ్లు నడపడం మాటలు కాదు. తెలుగువాళ్లు 64 కళలకు రుణపడి ఉంటారు. వీలైతే పాత సంచికలను archive.org లో అప్ లోడ్ చేసే మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. మీ కృషికి, పట్టుదలకు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞత..
గ్రేట్ సార్
మీకు అభినందనలు..ప్రశంసలు.. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే💐👏💐
మీ కళాత్మక పయనం నిరంతరాయంగా కొనసాగేలా ఆ భగవంతుడు మీకు సామర్థ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.
—- Dr. VEMPATAAPU.vsn
శుభాభినందనలు.భవిష్యత్ లో మీరు మరింత గా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను.