విశాఖ బీచ్ లో అంట్యాకుల పైడిరాజు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి వినతి పత్రం
తెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసినవారిలో ఉత్తరాంధ్రకు చెందిన అంట్యాకుల పైడిరాజు అగ్రభాగాన నిలుస్తారు. ఆయన తనదైన జానపద శైలిలో ఎన్నో చిత్రాలు సృష్టించారు. అదే విధంగా చిత్రకళా బోధనతో వందలమంది చిత్రకారుల్ని తయారు చేశారు. చిత్రకళా సాధన, బోధన సమపాళ్లుగా బాధ్యతలు నెరవేర్చినవారు బహు అరుదు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడచిన ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ ఉపాధ్యక్షుడిగా, చిత్రకళా పరిషత్ – విశాఖకు అధ్యక్షుడిగా ఎందరో ఔత్సహికుల్ని ప్రోత్సహించారు. ఆయన శిష్యులెంతోమంది చిత్రకారులుగా, చిత్రకళోపాధ్యులుగా జీవిక సాగిస్తున్నారు. పైడిరాజు కృషి కారణంగానే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పైన్ ఆర్ట్స్ డిపార్టుమెంట్ ఏర్పాటు అయింది. అందులో ఆయన సుమారు పదేళ్ళు ఉపన్యాసకులుగా సేవలందించారు.
శ్రీకాకుళంలో 1944 సం.లో పర్యటించి అప్పుడు నెలకొన్న కరువుపై అనేక చిత్రాలు గీసి, ప్రభుత్వంపై కదలిక తెచ్చిన మానవతావాది. 1947లో లండన్లో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో పైడిరాజు చిత్రించిన గృహోన్ముఖులు నగదు బహుమతితో ఆయన పేరు సంచలనం అయ్యింది. బజారుకు అనే చిత్రం రష్యా ప్రభుత్వం సేకరించింది. ఇంకా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో ఆయన చిత్రాలు వున్నాయి.
పైడిరాజు చిత్రకారుడేకాదు, కవి, రచయిత, శిల్పి కూడా! ఆయన శిల్పాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వున్నాయి. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ఠీవిగా కుర్చీలో కూర్చున్న మహాకవి గురజాడ శిల్పం ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. పైడిరాజు చాలాకాలం లాసన్స్ బే కాలనీలో నివశించారు. 1987లో ఏయూ ఆయన ప్రతిభ గుర్తించి ‘కళాప్రపూర్ణ’ తో సత్కరించింది. 2019లో ‘ఏయూ’ లలితకళా విభాగంలో ఆయన శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
విశాఖ రామకృష్ణా బీచ్లో ఆయన విగ్రహం ఏర్పాటుకు జీవిఎంసీ చర్యలు తీసుకోవాలన్నది ఆయన అభిమానుల కోరిక. అందుకు గాను విశాఖ జిల్లా కలెక్టర్ కు చిత్ర, శిల్పకారులు, పైడిరాజు అభిమానులు వినతి పత్రం సమర్పించారు. తెలుగు చిత్రకళకు వెలుగు తెచ్చిన పైడిరాజు విగ్రహం ఏర్పాటుచేస్తే, అది తెలుగు చిత్ర, శిల్పకారులకి స్పూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
-కళాసాగర్