తెలుగునాట 1880లో నాటక ప్రదర్శనలు ప్రారంభమయిన తర్వాత, నాటి మాస పత్రికలలో ఆయా నాటకాల గురించి, ప్రదర్శనల గురించి వివరణలు, వార్తలు వెలువడుతుండేవి. అంతేగాక వ్యక్తిగత ద్వేషాల వల్ల, ఇతర కారణాల వల్ల, నాటకాలలో తప్పులను, దోషాలను ఎత్తి చూపిస్తూ కొందరు పత్రికలలో వ్యాసాలు గూడా రాశారు. 1898లో కొక్కొండ వేంకటరత్నం పంతులు గారి ‘ప్రసన్నరాఘవం’ అనువాద నాటకాన్ని విమర్శిస్తూ మూలానికంటే మూడింతలు ఎక్కువగా విమర్శ రాశారుట వేదం వేంకటరాయశాస్త్రి గారు. 1900లో వెల్లాల సదాశివశాస్త్రి గారు భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహ కృతిలోని రస-నాయికా-నాయక ప్రకరణలని సహేతుకంగా విమర్శిస్తూ ఓ గ్రంథం రాశారు. ప్రాచీన లక్షణ గ్రంథం మీద తెలుగులో వచ్చిన మొట్టమొదటి విమర్శనాత్మక సమీక్ష ఇదే అయిందని పెద్దల అభిప్రాయం. 1906లో రెంటాల వెంకట సుబ్బారావు గారు, షేక్స్పియర్, ఒథెల్లో నాటకం మీద చక్కని ఆంగ్ల విమర్శ ‘Othello Unveiled’ అనే పేరు మీద ప్రచురించారు. ఇదే విధంగా వీరే 1909లో ‘హేమ్లెట్’ నాటకం మీద కూడా విమర్శనాత్మక గ్రంథాన్ని రచించి ప్రచురించారు.
ఆ కాలంలో వచ్చిన రచనలలో 1908లో కోలాచలం శ్రీనివాసరావు గారు ఆంగ్లంలో రచించిన ‘The Dramatic History of the world’ ఒక అద్భుతంగా చెప్పుకోదగ్గది. ప్రపంచ నాటక చరిత్రకు అనుబంధంగా నాటక రచయితలకు, నటులకు, సమాజాలకు, విమర్శకులకు, ప్రేక్షకులకు సంబంధించిన సిద్ధాంత సూత్రాలు కూడా వివరించారు. ఈ గ్రంథం ఒక పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత కొందరు పండితులు కొన్ని నాటకాల మీద, ప్రదర్శనల మీద విమర్శలు ప్రకటించారు. కానీ 1913లో ప్రారంభమై 1918-20 ప్రాంతాలకు బాగా వ్యాపించిన నాటక పోటీల పుణ్యమా అని ఆంధ్ర దేశంలో నాటక విమర్శ ఒక సాధారణ ప్రక్రియగా మారింది. విమర్శకులు, ప్రజలు నాటకంలో నటనా లక్షణాలను గురించి ఊహించడం ప్రారంభించారు. నాటకంలో సంగీతం ఉంటే నటనకు అవకాశం ఉండదని, హార్మోనియం, తబలా లాంటివి నాటకానికి శత్రువుల్లాంటివని కొందరు, వివిధ నాటకాలకు ప్రజల ఆదరణ ఉందా? నాటక రచనలో వ్యవహారిక భాష స్థానమేంటి?.. ఇలా అనేక విషయాల మీద విమర్శనాత్మక వ్యాసాలు మరికొందరు రాశారు.
1913లో ప్రచురించబడ్డ పానుగంటి వారి సాక్షి మొదటి సంపుటంలో నాటక రచన, ప్రదర్శనల గురించి రాసిన నాలుగు వ్యాసాలు చాలా ముఖ్యమైనవి. ఆ వ్యాసాల్లో పానుగంటివారు ‘సారంగధర’ నాటక రచనని, ప్రదర్శనని విమర్శిస్తూ నాటక శైలి ఎలా ఉండాలి? పాత్ర ఔచిత్యమంటే ఏమిటి? యుక్తి-ప్రతియుక్తి వైఖరి ఎలా ఉండాలి? నాటకాలలో పద్యాలు ఉండాలా? కూడదా?, ఉంటే ఎలాంటి పద్యాలు ఉండాలి?, విషాదాంత – సుఖాంత నాటక లక్షణాలలో గల తేడాలు ఏమిటి?… అనే అంశాల మీద కూలంకషంగా చర్చించారు. అయితే తెలుగులో సాహిత్య విమర్శకులకు కొత్త బాటలు వేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి గారు, తణికెళ్ల వీరభద్రుడు గారు, మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారని చరిత్రకారుల అభిప్రాయం.
పైన పేర్కొన్న ఈ పండితులందరూ తమ విమర్శలను ఏ ప్రాతిపదికన చేశారు? అనేవి చర్చనీయాంశాలు. సంస్కృత నాటకకర్త శ్రీ హర్షుడు తన ‘నాగానందం’ నాటకం పీఠికలో ఈ శ్లోకం రాస్తారు.
“శ్రీ హర్షో నిపుణఃకవి, పరిషద ప్యేషా గుణగ్రాహిణీ
లోకేహారిచ వత్సరాజచరితమ్, నాట్యే దక్షావయామ్ ॥”
అంటే అందరికీ తెలిసిన కథ, నిపుణుడైన కవి, దక్షత కలిగిన నటులు, నాటకంలోని గుణగణాలను గ్రహించగల పారిషదులు (ప్రేక్షకులు) ఉంటేనేకాని నాటకం అన్న పదానికి పూర్తి అర్థం రాదు అని ఆయన భావన. నాటక రచనకి పాఠకులు ఎంత అవసరమో, ప్రదర్శనకి ప్రేక్షకులు అంతే అవసరం. ‘Theatre is not complete without audience’ అన్న పాశ్చాత్య ఆర్యోక్తి ఉండనే ఉంది. మంచిగాని, చెడుగాని ప్రదర్శింపబడేది వాళ్ల కోసమే కాబట్టి వాళ్లు బాగుందని మెచ్చుకుంటే నటుడు ఉబ్బిపోతాడు. వృత్తి నటుడికి ఈ ప్రేక్షకుల అవసరం ఎంతైనా వుంది. వారిని మెప్పించకపోతే ఇతగాడికి భుక్తి ఉండదు. ఔత్సాహికుడికి ప్రేక్షకులు చప్పట్లే భుక్తి. ఎందుకంటే ప్రదర్శన ఎటూ చేతి చమురు బాగోతమే కాబట్టి. భరతముని తన నాట్యశాస్త్రంలోని 27వ అధ్యాయంలో ప్రేక్షకుడి లక్షణాలను ఇలా వివరిస్తాడు.
‘అవ్యగ్రములయిన ఇంద్రియములు కలవాడు, శుద్ధుడు, ఊహాపోహ విశారదుడు, దోషరహితుడు, అనురాగి అయినవాడే నాట్యమందు ప్రేక్షకుడుగా ఉండుటకు అర్హుడు. ఎవరు కథాగతమయిన దైన్యమందు దీనత్వమును, తుష్టియందు తుష్టిని, శోకము నందు శోకమును పొందుదురో వారే నాట్యమందు ప్రేక్షకులు అనబడుదురు’ –
శ్రీ హర్షుడు చెప్పినట్లు గుణగ్రాహణ చేయగల లక్షణం ఉన్న ప్రేక్షకులు అని భరతుడు అనలేదు. బహుశా ఆయన అప్పట్లో విమర్శకుడి అవసరం ఊహించి ఉండకపోవచ్చు.
అయితే మామూలు ప్రేక్షకులు వేరు విమర్శకులు వేరు. విమర్శ అనేది కేవలం ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారే చేయగలరు. వారికి శాస్త్ర పరిజ్ఞానం, విజ్ఞానం, అనుభవం అన్నీ ఉండాలి. నాటక వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు, ప్రేక్షకుల నాడిని నాటకకర్తకు, నటులకు తెలియచెప్పి, పరస్పర అవగాహనకు దోహదం చేసేవాడు విమర్శకుడు.
తెలుగు నాటకరంగంలో అద్భుతమైన విమర్శకులుగా పేరు పొందినవారు పురాణం సూరిశాస్త్రిగారు. వారి చిరకాల నాట్య వ్యాసంగ ఫలంగా ‘నాట్యాంబుజం’ ప్రచురించారు. ఇందులో
(1) నాటకానుభవములు (2) ఆంధ్ర నాటకములు (3) నాటక సమాజములు
ష్(4) ప్రసిద్ధ నటులు (5) ప్రదర్శన విమర్శనము (6) ఆంధ్ర నాటక విమర్శనము (7) నాటక సమస్యలు (8) నాటక విమర్శనము అనే అధ్యాయాలు ఉన్నాయి. ముఖ్యంగా నాటి ప్రసిద్ధ సమాజాల ప్రదర్శనా పద్ధతులు, నాటి ప్రసిద్ధ నటుల నటనారీతులు విమర్శింపబడ్డాయి. సూరిశాస్త్రి గారు సద్విమర్శకుడి లక్షణాలను ఇలా ప్రతిపాదిస్తారు.
“తన బుర్రలో జరిగే నాటకమంతా చూడనేర్చినపుడే నాట్య రంగాల ఆటలు సార్థకంగా చూడగలుగుతాడు. రసమందరు ఆస్వాదిస్తారు. జీవితానుభవాలు అందరికీ ఉంటాయి. బుద్ధిని మూడు పాయలుగా చీల్చి, వ్యావహారికంలో భోక్తృత్వకర్తృత్వముల కొకదాన్ని నియమించి, రెండవ దానితో జగన్నాటక విలాస శోభలను, నిత్యానందతూష్టీం భావమున అనుభవించుచూ, మూడవ దాన్ని సాక్షి భావమున ఏకాగ్ర ధారణలో వర్తింప చేయగలిగినవాడే రస రహస్యమెరిగిన విమర్శకుడగును. విమర్శక వ్యాపారమంతా లోక జ్ఞానము మీద నిలిచియున్నది. లోకానుభవానికి జ్ఞాన రూపమొనర్చుటకు, సాక్షీ భావము, యోగ సాధన అలవడవలెను”.
“అంటే ఆట చూసేటపుడు నా చిత్తము మూడు ప్రత్యేక వ్యాపారములతో మూడు కోశములుగా విభక్తమై ఉంటుంది. ఒకటి కథ మొత్తమును రామణీయకమును, అనుభవించుచూ, విమూఢ తదేక చింతతో నిస్తబ్దమయి ఉండును. నట వర్తనమందలి రసభావ తరంగములన్నీ ఈ కోశమున కదిలించుచు అనురూప వికాసమును నీ ముఖ నేత్రములందు పుట్టించుచుండును. రెండవ కోశము, నీ సంకల్పం లేకుండానే జరుగుతున్న నటనను చూస్తూ, మాటలు వింటూ, అందులో వెలుగొందు దానిని ధారణ చేయుచుండును. దాని వ్యాపారము స్వతంత్రము నాకు తెలిసి జరిగేది కాదు. నాసంకల్పం వల్ల నడిచేది కాదు. ఎందుకంటే నేను రసానుభావ పారవశ్యముతో మైమరచియున్నాను. అట్టి మైమరపు లేకుంటే రస సమాధి లేదన్న మాట. ఇదంతయూ నాటకశాలతో సరి. నేను విమర్శన రచించెడి వేళ, ధారణ గ్రస్తములైన దృశ్యశ్రావ్య విషయాలు సాక్షాత్కరించినపుడు వాని మూలమున క్రమ్మర రసావేశమేర్పడును. ఈ రెండు కోశాలు కళా విమర్శనకు సంబంధించినవి. ఇవి కాక మూడవ కోశము. అటూ ఇటూ చూచుచూ ప్రక్క వారితో మాట్లాడుచూ, లౌకిక వ్యాపారములు జరుపుచుండును. ఇదే నా అనుభవం. నాటకం చూసేటపుడు మాత్రం నా బుద్ధిలో రెండు భాగములు, ఒకటి తెలిసియు, ఒకటి తెలియకను కథా వ్యవహారముతో ఐక్యమయి ఉండును. ఏకాగ్రత వల్ల వ్యక్తి చాంచల్యము నశించును. తన్మయత్వమేర్పడును. చూస్తున్నాను, వింటున్నాను అనే కర్తృత్వమస్తమించును. ఆనందమనుభవించుటయే మన పని”.
శాస్త్రిగారి ఈ వాక్యాలలో ఉత్తమ విమర్శకుడు చేయవలసిన పనేమిటో తెలుస్తున్నది. వారు చెప్పిన విధంగానే వారి నాటక విమర్శలన్నీ రచించి ప్రకటించారు. అందుకే తెలుగు నాటక విమర్శకులలో ఆయన ప్రథముడే కాదు – ప్రధానుడు కూడా అని చెప్పక తప్పదు. ఆయన విమర్శలన్నీ కళాత్మకమయిన భావ ప్రకటనలే. ఎందుకంటే సాహిత్యం ఒక కళ అయినపుడు సాహితీ విమర్శ కూడా ఒక కళా ప్రక్రియే అవుతుంది. ‘All art is expression’ అనే నానుడిని మారుస్తూ ‘All expression is art’ అన్నాడు ఫ్రెంచి విమర్శకుడు బెండెట్టో క్రోస్. ఈ దృష్టితో చూస్తే ఓ సాధారణ వ్యక్తి మాట్లాడే మామూలు వాక్యంలో కూడా ఓ కళ కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగానే మనిషిలో ఉండే కళాత్మకత వల్ల ఇది గోచరిస్తుంది. అలాంటపుడు విమర్శక దృష్టితో మాట్లాడినపుడు, రాసినపుడు అందులో కళాత్మకత తప్పకుండా ఉంటుంది.
ఈ ఆలోచనను బలపరుస్తూ జస్పర్సన్ అనే ఆంగ్ల విమర్శకుడు ‘The Philosophy of grammar’ అనే పుస్తకంలో ఇలా రాస్తాడు.
‘In all speach there are three distinct things expression, supression and impression. It is important to note that impression is often produced by supression also and suggession is impression through supression’
ఇక్కడ ‘సజెషన్’ అనేది సంస్కృత సాహిత్యకారుల ప్రకారం ‘వ్యంజన’. వ్యంజనమంటే అన్ని రకాల కళల్లో నిగూఢంగా ఉన్న గొప్ప శక్తి. దీని ప్రేరణతోనే సాహితీ ప్రక్రియలు పుడతాయి. సంస్కృత సాహితీ విమర్శకు ఈ వ్యంజన అనేది కేంద్ర బిందువు. సాహిత్య కళా ప్రక్రియలలో ఇది అర్థమయితేనే విమర్శకుడు తన విమర్శను సృష్టించగలడు. సంస్కృత లాక్షణికుల ప్రకారం సాహిత్య విమర్శలు మూడు ముఖ్యమైన ఆలోచనలు లేదా పద్ధతులలో జరుగుతాయి. అవి ధ్వని, రస, ఉన్నయ అనేవి. ధ్వని అంటే వ్యంజన అంటే సజెషన్, అంటే సూచన ఇచ్చినట్లు చెప్పడం. రస అనేది ఉత్తమోత్తమమైన విమర్శనా పద్దతి. ఇది కేవలం భారతీయ సాహిత్యంలోనే కాదు విదేశీ సాహిత్యకారులు కూడా అవలంబించే పద్దతి.ఇహ ఉన్నయ అంటే ఊహించడం. రస పద్ధతికి ప్రాముఖ్యాన్నిస్తూ, ధ్వనిని కూడా ఒప్పుకునేవారు ఉన్నయ పద్ధతికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ రస సిద్ధాంతాన్ని ఒప్పుకునేవారు కొందరు ఉన్నారు. ఈ పద్ధతుల ఆధారంగానే సంస్కృత నాటక సాహిత్యం మీద విశ్లేషణలు, విమర్శలు అనేకం ప్రకటించబడ్డాయి. ప్రముఖ సంస్కృత పండితులు ఎస్. కుప్పుస్వామి గారు తమ ‘Highways and Biways of literary criticism in sanskrit’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు.
‘In fact vyanjana may be regarded as the central principle of literary criticism in Sanskrit, the pivotal doctrine round which the whole scheme of art critism in Sanskrit revolves. Now what is the secret of this principle? Because renderd by the term suggestion, which is impression through supression’
శాస్త్రి గారి వివరణను మనం అర్థం చేసుకుంటే విమర్శకుడు ఏవో నాలుగు మాటలు రాస్తే సరిపోదు. అతను సూచనలు ఇవ్వగలగాలి. అది నాటక సాహిత్య విమర్శ కావచ్చు. ప్రదర్శన విమర్శ కావచ్చు. నాటక విమర్శ కావచ్చు. నాటక విమర్శ అంటే కేవలం నాటక కథ రాయడం కాదు. విశ్లేషణ అనగానే దాని బాగోగుల మీద గుణ నిర్ణయం, ఆ గుణ నిర్ణయానికి తగిన సామర్థ్యం, అనుభవం విమర్శకుడికి ఉండాలి. అర్థ స్పూర్తితో ఉన్న సంభాషణలను విని ఆస్వాదించే శ్రవణస్త్రంద్రియం కావాలి. అలాగ అనేక విషయాలను చూసి అర్థం చేసుకుని సమన్వయం చేసుకునే దృశ్య భాష్యకత కావాలి. అందుకు తగిన నాటక రచన, సాంకేతిక ప్రదర్శనా విషయాల అవగాహన కావాలి. నాటకాన్ని చదివి లేదా చూసినపుడు సంభాషణలు విని నాటక అంతరార్థాన్ని అవగతం చేసుకోవడం నాటక విశ్లేషకుడికి చాలా అవసరం.చదివిన దానిని, చూసిన దానిని ప్రతి అంశాన్ని సునిశిత దృష్టితో చూడడం, చూపించడం నాటక విమర్శకుడి ధ్యేయం. పురాణం సూరిశాస్త్రిగారు చెప్పినట్లు చూసిన నాటకాన్ని ఇంకా అర్థవంతంగా ఆమోదించి ఆనందించడానికి, చూడని నాటకాన్ని చూడాలనిపించడం, చూసేటపుడు విశ్లేషణలలోని పలు అంశాలు మననం చేసుకుంటూ ఆనందించడం నాటక విమర్శకుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు. తన విశ్లేషణతోనూ, దాని ఆధారంగా చేసే విమర్శతోనూ ప్రేక్షకులలో నాటకాసక్తిని పెంచగలిగినవాడే నిజమైన విమర్శకుడు. ఆచార్య మొదలి నాగభూషణశర్మ గారి మాటల్లో చెప్పాలంటే “విమర్శకుడు నాటకాలని ప్రదర్శన దృష్టితో చదవాలి, సాహిత్య దృష్టితో చూడాలి”.
ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుడు మ్యాథ్యూ అర్నాల్డ్ విమర్శను ‘A Disintrested endavour to learn and to propogate the best that is known and Thought in the world, and thus to establish a current of fresh and true ideas’ అంటూ నిర్వచించాడు. ‘ప్రపంచంలో అత్యుత్తమ మయినదనిన పేరెన్నికగన్న సాహిత్యాన్ని గ్రహించి, దానిని నలుగురికీ తెలియజెప్పి తద్వారా నిజమైన సరికొత్త భావ పంరపరను సుస్థాపితం చేయడానికి పూనుకున్న నిష్పాక్షికమైన ప్రయత్నం సాహిత్య విమర్శ’ అంటాడు ఆర్నాల్డ్. ఇవాళ నాటక విమర్శకులు చేయవలసిన పని ఇదే. అది నాటక సాహిత్యమైనా, నాటక ప్రదర్శన అయినా నిష్పాక్షిక దృష్టితో చూడడం విమర్శకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. విదేశాల్లో నాటక విమర్శను శాస్త్రబద్ధంగా ఒక పాఠ్యాంశంగా బోధిస్తారు. మన దేశంలో ఇది చాలా తక్కువ.
1925లో పురాణం సూరిశాస్త్రి గారు ‘ఆంధ్ర నాటక సంస్కరణ – విమర్శన పారిజాతము’ అనే పుస్తకంలో తెలుగులో అంతవరకు వచ్చిన విమర్శన గ్రంథాల రచనా రీతులను ఈ క్రింది విధంగా విభజించారు.
- స్వీయ ప్రపంచానుభవమును, కళాపరిజ్ఞానమును, భావములను, రుచులను విస్తరించుచు ఆత్మీయానుభవ నిరూపకములగు స్వతంత్ర గ్రంథములు రచించుట.
- ప్రామాణిక లాక్షణికుల గ్రంథాలు చదివి, అందలి ప్రమాణములను, వాదప్రతివాదములు విస్తరించుచు, తాను అభిమానించెడి సిద్ధాంతములకు అనుకూల, ప్రతికూలముల నేర్పరిచి చూపుచూ ఏదో ఒక సిద్ధాంతమును తేల్చుట.
- ఇట్టివేమియును లేక ప్రామాణిక లాక్షణికుల రసిక విమర్శకుల భావములను వివిధాంశముల పట్ల విభజించి సంతరించి చూపుట.
- ఆంద్రేతర భాషలలోని విమర్శనముల యథాతథ అనువాదములు లేదా అనుసరణములు. తెలుగు నాటక రచన, ప్రదర్శనల మీద మంచి విమర్శలు చేసిన వారిలో అగ్రగణ్యులు బి.టి. రాఘవాచార్యులు గారు. ‘బలే చింతామణి’ అనే గ్రంథంలో, చింతామణి నాటకాన్ని గురించి, చింతామణి నాటక పోటీలను గురించి కూలంకషంగా వివరించారు రాఘవాచార్యులవారు. అలాగే 1924లో సంగీత ఇంద్రసభ అనే ప్రహసనం రూపంలో ఆనాటి నాటక ప్రదర్శనలో సంగీతాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చాలా నిశితంగా విమర్శించారు. “నటులొక పద్యముపాడి – ఇది శృంగారము, ఒక గంతు వేసి – ఇది రౌద్రము, ఒక కులుకు కులికి – ఇది శోకము అని భావింపుడనగా, అసమర్థులగు ప్రేక్షకులు కాబోలునని సంతసించి వారికి సన్మానాదులొలరించుచున్నారు” – అని రాఘవాచార్యులు గారు ప్రేక్షకుల మీద, నటీనటుల మీద ధ్వజమెత్తి సంగీత నాటకాల వల్ల తెలుగు నాటకరంగం ఎలా చెడిపోతున్నదో విమర్శిస్తూ ఈ ఇంద్రసభ ప్రహసనాన్ని రచించారు. ఇలా నాటక ప్రదర్శన రీతులను ఒక నాటక ప్రక్రియ ద్వారా విమర్శించిన గ్రంథం అంతకుముందు 1921లోనే
కె. చినరఘుపతిరావు గారి ‘నాటక కోలాహలం’ అనే ప్రహసనం రచింపబడ్డది. ఆధునిక కాలంలో నాటక కళా పరిషత్ పోటీలలో ఎంత మెలో డ్రమెటిక ప్రదర్శనలుంటున్నాయో పాతికేళ్ల కిందట యండమూరి వీరేంద్రనాథ్ ‘చీమ కుట్టిన నాటకం’ అనే నాటికలో విమర్శించాడు.
సూరిశాస్త్రి గారి తరువాత ఓ సాధికారికతతో నాటక విమర్శలు చేసినవారు శ్రీయుతులు
కాశీ కృష్ణమాచార్యులు, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, నెల్లూరు నగరాజారావు, భమిడిపాటి కామేశ్వరరావు, టేకుమళ్ల అచ్యుతరావు పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీపాద కామేశ్వరరావు, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ మొదలైన వారని చెప్పుకోవచ్చు. అయితే నాటక రచన ప్రయోగాలను గురించి తెలుగు భాషలో అధికారికమైన కొత్త గ్రంథం రాయాలని సంకల్పించి ‘ఆంధ్ర నట ప్రకాశిక’ (1930) అనే అత్యుత్తమ విమర్శనాత్మక గ్రంథాన్ని రచించినవారు పసుమర్తి యజ్ఞనారాయణశాస్త్రి గారు. ఇందులో …
(1) గాంధర్వము, అభినయమ, ఆహార్యము, (2) సంగీతము, (3) నాయికా నాయకులు,
(4) రసములు, (5) రూపక లక్షము (6)ప్రయోగము, (7) రంగము (తెలుగు నాటక సమాజాల చరిత్ర), (8) కావ్యము (తెలుగు కవుల నాటకాలు) (9) నటుడు (వివిధ నటుల అభినయ రీతులు), (10) పాత్రము (కొన్ని నాటకములలోని ప్రసిద్ధ నాయికా నాయకుల పాత్రల విమర్శ) మొదలైన అంశాల మీద విపులంగా రాశారు శాస్త్రిగారు.
1934లో ఆంధ్ర నాటక పరిషత్ ద్వారా ‘నాట్యకళ’ త్రైమాస పత్రిక నీలంరాజు వెంకటశేషయ్య గారి సంపాదకత్వంలో ప్రారంభించబడింది. ఇందులో నాటక రచన, ప్రదర్శనల మీద మంచి విమర్శనాత్మక వ్యాసాలు చాలా ప్రచురించబడ్డాయి. పరిషత్ దీని ప్రచురణ ఆపేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నాట్యకళను చాలా సంవత్సరాలు శ్రీనివాస చక్రవర్తిగారి సంపాదకత్వంలో ప్రచురించింది. 1982లో అకాడమీ మూడు ముక్కలు కాగానే పత్రిక ఆగిపోయింది. ఆ తర్వాత ఆ మూడు ముక్కలు కూడా మూసుకున్నాయి 1985లో.
1950 తరువాత తెలుగు నాటక విమర్శలో ఒక కొత్త శకం ప్రారంభమయింది. కొంత మంది పాశ్చాత్య విమర్శనా రీతులను తెలుగులో ప్రవేశపెట్టారు. కొప్పరపు సుబ్బారావు గారు. చాగంటి సన్యాసిరాజు గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారి లాంటి పెద్దలు నాటక విమర్శను కొత్త కోణంలో కొనసాగించారు. విమర్శకుడు ప్రపంచంలోని అత్యుత్తమ సాహిత్య రీతుల్ని, నాటక రీతుల్ని గ్రహించినవాడై ఉండాలి. కేవలం గ్రహిస్తే సరిపోదు. దానిని నలుగురికి తెలియజెప్పాలి. ఈపైన పేర్కొన్న వారందరూ ఆ కోవకు చెందినవారే. వీరంతా కూడా తమ రచనల ద్వారా కొత్త భావాలను స్థిరీకరించారు. ఆ భావాలు సత్యదూరం కాకుండా, రంగస్థల మర్యాదలు పాటిస్తూ, ప్రదర్శకుల మీద సానుభూతి చూపుతూ విమర్శలు చేసినవారే వీరంతా.
నాటక ప్రదర్శనా విమర్శకు, ఇతర సాహిత్య ప్రక్రియల విమర్శకు ఎంతో తేడా ఉంది. ఎందుకంటే Drama is eternal – but a performance is a ephemeral నాటకం అనస్వరం, ప్రదర్శన అశ్వరం. ఏ ప్రదర్శన అయినా చూసి ఆనందించాల్సిందే. కానీ అటువంటి ప్రదర్శనలు తన విమర్శ ద్వారా పునరావిర్భవింప చేయగల సత్తా విమర్శకుడికి మాత్రమే ఉంది. అందువల్లనే నాటక రంగ విమర్శకుడు నాటకానుభవాన్ని పునఃసృష్టి చేయగల సమర్థుడు.
కానీ మన దౌర్భాగ్యం వల్ల ఆంధ్ర నాటకరంగంలో విమర్శకులు లేరు. నాటక ప్రదర్శన జరిగితే కథ రాసి నటీనటుల పేర్లు రాసి పేపర్లో ప్రచురించే రిపోర్టర్లున్నారు. లేదా తమకంతా తెలుసుననుకునే ‘ఆర్ట్ క్రిటిక్’ అనే పేరుతో అవాకులు, చవాకులు రాసేవారున్నారు. లేదా ఫలానా కళాకారుడి మీద కోపంతోనో, ద్వేషంతోనో రంధ్రాన్వేషణ చేసి అతన్ని భ్రష్టు పట్టించే కుహనా వ్యాసకర్తలున్నారు కాని సద్విమర్శకులు లేరనేది నిస్సందేహం.
ఇక నాటకరంగ పరిశోధన విషయానికొస్తే గతంలో కన్నా ఇప్పుడు పరిశోధనలు ఎక్కువగానే జరుగుతున్నాయి అనేది వాస్తవం. దీనికి కారణం విశ్వవిద్యాలయాలు పీహెచ్ డీ కోర్సులను ప్రోత్సహించడం. డాక్టరేట్ పట్టా కోసమో లేదా మరే ఇతర డిగ్రీ కోసమో చేసే పరిశోధనలే కాకుండా విజ్ఞానం కోసం, విషయ సేకరణ కోసం చేసే పరిశోధనలు కూడా ఉన్నాయి. సాహిత్యం మీద, కళల మీద ఇతర సామాజిక, చారిత్రక అంశాల మీద అధ్యయనం చేయడం పూర్వం ప్రవృత్తిగా ఉండేది. వాటి అంతః సూత్రాలను ఆవిష్కరించాలనే తపన పరిశోధనలకు దారి తీసింది. గతంలో అభిమానం, అభినివేశం ఉన్నవాళ్లు తమ తమ అభిరుచులను పురస్కరించుకుని పరిశోధించారు. అప్పటి పరిశోధకులకు ఒక నిర్దిష్ట మార్గం లేదు. గమ్యం మాత్రమే ఉండేది. ఇప్పటివారికి గమ్యం కన్నా మార్గం ప్రధానం. అభినివేశం స్థానంలో అవసరం బలపడుతున్నది. ఈనాటి పరిశోధనా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఆచార్యులు తాము పరిశోధనలలో పాటించిన పద్ధతులను, ధర్మాలను వారికి బోధిస్తున్నారు.
పరిశోధనని రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రయోగాత్మక పరిశోధన, విశ్లేషణాత్మక పరిశోధన. ప్రయోగశాలలో ప్రయోగాలను సాగించి ఫలితాలను ప్రకటించడమే ప్రయోగాత్మక పరిశోధన. ఇది మానవుడి మనుగడకి చాలా అవసరమయింది. వైద్య, విజ్ఞాన, సాంకేతిక శాఖల్లో జరిగేవన్నీ ప్రయోగాత్మక పరిశోధనలు. దీనినే ‘Applied Research’ అంటారు. ఇక విశ్లేషణాత్మక పరిశోధన సామాజిక శాస్త్రం, చరిత్ర భాష, సాహిత్యం, కళలు మొదలైన విభాగాలుగా చెప్పవచ్చు. దీన్ని ‘Pure Research’ అంటారు. ఈ పరిశోధనల వల్ల జ్ఞానాన్ని పెంచుకోవడం, సిద్ధాంతాలు రూపొందించడం, గతంలో తెలియని కొత్త విషయాలను తెలియ పరచడం జరుగుతుంది.
పరిశోధకుడు తాను ఎన్నుకున్న పరిశోధనాంశంలో నిష్ణాతుడు కాకపోయినా ప్రవేశం ఉండాలి. ఆ అంశానికి సంబంధించిన పూర్వాపరాలను బాగా ఆకళింపు చేసుకుని ఉండాలి. ఏ రంగంలోనైనా కొత్తగా ప్రవేశించే వ్యక్తి నూతన అంశాలను ఆవిష్కరించలేడు. ఇలాంటివి నాటకరంగ పరిశోధనలో ఈనాడు చాలా జరుగు తున్నాయి. ఆ మధ్య ఓ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ పట్టా కోసం పరిశోధన చేస్తున్న ఓ విద్యార్థి నా దగ్గరకొచ్చాడు. నేను ఫలానా వారి దర్శకత్వ రీతుల మీద పరిశోధన చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు. నేను ఆయన దర్శకత్వం చేసిన నాటకాలు నువ్వేం చూశావు అని అడిగాను. అతను ఏమీ చూడలేదండీ, మీబోట వాళ్లు చెబితే రాసుకుంటాను అన్నాడు. నేను సారీ చెప్పి అతన్ని పంపించాను. అతను చేస్తున్నది పరిశోధన ఎలా అవుతుంది. అతను రాసే సిద్ధాంత వ్యాసం అతనిదెలా అవుతుంది. పరిశోధకుడికి ముందు చిత్తశుద్ధి ఉండాలి. తెలుగు నాటకరంగానికి సంబంధించి జరిపిన కొన్ని ముఖ్యమైన పరిశోధనలు గమనిస్తే 1908లోనే కోలాచలం శ్రీనివాసరావు గారు ప్రకటించిన ఆంగ్ల గ్రంథం ‘The Dramatic History of the world’ అనేది ప్రపంచ నాటకరంగ చరిత్రను గురించి భారతదేశంలో రచింపబడ్డ మొట్టమొదటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు గారు దీనిని ఏ పీహెచ్ డిగ్రీ కోసమో రాయలేదు. తమకు తెలిసినవిషయాలను పది మందికి తెలియజెప్పడం కోసం, కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం రాశారు.
1938లో పింగళి లక్ష్మీకాంతం గారి మార్గనిర్దేశకత్వంలో దివాకర్ల వెంకటావధాని గారు ‘ఆంధ్ర నాటక పితామహుడు’ అనే అంశం మీద పరిశోధన జరిపి ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఎ. (హానర్స్) పట్టా పొందారు. ఒక తెలుగు నాటకకర్త గురించే కాక ఆంధ్ర నాటక చరిత్ర, విషాదాంత నాటక స్వరూపాన్ని కూడా అవధాని గారు ఈ గ్రంథంలో వివరించారు. కోమండూరు పార్థసారథి అయ్యంగార్ ‘నెల్లూరు-నాటకకళ’ అనే అంశం మీద పరిశోధన జరిపి ప్రకటించారు. ఒక ప్రదేశానికి సంబంధించిన నాటకరంగం గురించి వచ్చిన మొదటి పుస్తకం ఇదేనని చెప్పవచ్చు. దీని స్ఫూర్తితో 1953లో బండారు రామస్వామి గారు గుంటూరు పట్టణ నాటక రంగ చరిత్రను ‘నటమిత్రమ్’ అనే పేరుతో ప్రచురించారు. గుంటూరు జిల్లా నాటకరంగ చరిత్రను పరిశోధించి కందిమళ్ల సాంబశివరావు గారు DLitపట్టాను పొందారు. అలాగే నేతి పరమేశ్వర శర్మగారు ‘తెనాలి నాటకరంగం’అనే గ్రంథాన్ని రచించారు. ఇటీవల రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి చెం కళారూపాల మీద, కళాకారుల మీద పరిశోధనలు చేయడం ఎక్కువయింది.
1961లో ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుండి పీహెచ్ డీ పట్టా కోసం ఎస్వీ జోగారావు గారు చేసిన పరిశోధన గ్రంథం ‘ఆంధ్ర యక్షగాన వాజ్ఞయ చరిత్ర’ తెలుగులో వచ్చిన మంచి పరిశోధనా గ్రంథాలలో ఒకటి. ‘తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీషు ప్రభావం’ అనే అంశం మీద కొత్తపల్లి వీరభద్రరావు గారు ప్రచురించిన గ్రంథంలో నాటక సాహిత్యం అనే అధ్యాయంలో ఆంగ్ల నాటక అనువాదాలను గురించి మంచి విశ్లేషణ చేశారు. ఐ. పాండు రంగారావు గారు 1961లో ‘ఆంధ్ర-హిందీ రూపక’ అనే అంశం మీద పరిశోధన చేసి హిందీలో రాసి నాగ్ పూర్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్ డీ పట్టా పొందారు. అలాగే ఇంకో ప్రత్యేకమైన పరిశోధన ‘Telugu stage’ అనే అంశం మీద పి.వి. పతిగారు పరిశోధన జరిపి ఫ్రెంచి భాషలో సిద్ధాంత వ్యాసాన్ని రాసి Sorbonne యూనివర్శిటీ నుంచి పీహెచీ పట్టా పొందారుట. ఇక పి.యస్.ఆర్. అప్పారావు గారి ‘తెలుగు నాటక వికాసం’ తెలుగులో ప్రచురించబడ్డ అపూర్వ పరిశోధనా గ్రంథం. దాదాపు పది సంవత్సరాల పాటు శ్రమించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను దర్శించి, కొన్ని వందల మందిని కలిసి, విషయ సేకరణ చేసి పీహెచ్ డీ పట్టా కోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఇది. పరిశోధన ఎలా జరపాలో, సిద్ధాంత వ్యాసం ఎలా రాయాలో తరువాతి పరిశోధకులకు మార్గదర్శిగా ఈ గ్రంథం నిలుస్తుంది. ఈనాడు నాటకరంగంలో ఉన్న అధ్యాపకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు తెలుగు నాటక చరిత్రకు సంబంధించి సందేహాలు తీర్చగల ఏకైక గ్రంథం అప్పారావు గారి తెలుగు నాటక వికాసం. అందుకు అందరూ ఆయనకు సదా రుణపడి ఉండాలి.
ఇంకా అనేకమంది అనేక అంశాల మీద, నాటకరంగం మీద పరిశోధనలు జరిపి తెలుగులోను, ఇంగ్లీషులోను సిద్ధాంత వ్యాసాల్ని సమర్పించి పట్టాలు పొందారు, పొందుతున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జరగాలి కూడా. అయితే కొందరు పరిశోధకులకి ఉత్తమ పరిశోధకుడికి ఉండవలసిన కనీస లక్షణాలు లేకుండా పోతున్నాయి. దానివల్ల పరిశోధనా రంగంలో స్థాపించ వలసిన ఉన్నత ప్రమాణాలు స్థాపించలేకపోతున్నాం. కేవలం డిగ్రీల కోసం పక్షపాత ధోరణిలో రాసే సిద్ధాంత వ్యాసాలు ఎక్కువవుతున్నాయి. ఎంపిక చేసుకునే పరిశోధనాంశాలు కూడా కొన్ని చాలా పేలవంగా, సత్యదూరంగా ఉంటున్నాయి. ఇటువంటి పరిశోధనలను విశ్వవిద్యాలయాలు గుర్తించి నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పరిశోధన అనేది హాస్యాస్పదం అయ్యే ప్రమాదముంది. తెలుగు నాటకరంగపు పురోభివృద్ధిలో విమర్శ, పరిశోధన కూడా ఉన్నత ప్రమాణాలను సాధించుకోవలసిన అవసరం ఉంది.
-డా౹౹ డి.యస్.యన్. మూర్తి
తెలుగు నాటకరంగం ఇంకా బ్రతికి ఉన్నదా?