రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమా తీయాలని మద్రాసు వచ్చి కొందరు కారంచేడు వాస్తవ్యులతో భాగస్వామ్యం కలుపుకొని తొలి ప్రయత్నంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో ‘అనురాగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు మెయిన్ పార్టనర్ భాస్కరరావు. రామానాయుడు ఓత్రనిర్మాణానికి సంబంధించిన ప్రతి చిన్న పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమానిర్మాణపు మెళకువలు క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ‘అనురాగం ‘సినిమా విడుదల నాటికి కుండపోతగా వర్షాలు పడడంతో ప్రేక్షకుల అభిమానానికి చేరువ కాలేకపోయింది. ఫలితం… పెట్టుబడి మొత్తం నష్టమే! తొలి పెట్టుబడి నిరుపయోగమైనా సినిమా తీసే మెళకువలన్నీ ఆకలింపు చేసుకోగలిగారు. నాయుడుకి పట్టుదల పెరిగింది. రెండు,మూడు సినిమాలు పోయినా పరవాలేదు కానీ సక్సెస్ కావాలి. వెంటనే మరో సినిమా తీయాలనుకుంటే, భాగస్వాములెవరూ ముందుకు రాలేదు. అందుకే ఒంటరి ప్రయాణానికి సిద్ధపడ్డారు. అతడు వేసిన ‘ముందడుగు’అతని గమనాన్నే మార్చివేసింది. ఆ నమ్మకమే ‘సురేష్ ప్రొడక్షన్స్’ ఆవిర్భావానికి నాంది పలికింది. కథాన్వేషణలో పడ్డారు. కొసరాజు రాఘవయ్యను కలిస్తే, ఆయన డి.వి. నరసరాజును, తాపీ చాణక్యను పరిచయం చేసారు. నరసరాజు వద్ద కాలహరణంపట్టి, ఆటకెక్కిన ‘రాముడు-భీముడు’ ద్విపాత్రాభినయ స్క్రిప్టు రెడీగావుంది. అంతకుముందు దాన్నిఎందరో నిర్మాతలు, హీరోలు తిరస్కరించారు. కానీ నాయుడుకి నచ్చింది. చాణక్యను దర్శకునిగా ఎంపిక చేస్తే విమర్శలు వచ్చాయి. కారణం అతడు తీసిన తొమ్మిది సినిమాలు వరసగా ఫ్లాపులవటమే. అయితే నాయుడు ఆలోచనే వేరు. ఎన్టీఆర్ ని సంప్రదించారు. కథ నచ్చింది. “ప్రొసీడ్ బ్రదర్”అంటూ కాల్షీట్లిచ్చారు. విజయా పిక్చర్స్ పెట్టుబడికి ముందుకొచ్చారు. తారాగణం ఎంపిక పూర్తయింది. అలా 1963 నవంబరు 16 న సురేష్ సంస్థ తొలిచిత్ర క్లాప్ ఎన్టీఆర్ మీద మోగింది.

ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెరగటంతో ఖాళీ వున్నప్పుడల్లా కాల్షీట్లు తీసుకుని, నాయుడు ముందుచూపుతో ‘రాముడు-భీముడు’ సినిమాని నాలుగు నెలలలోనే పూర్తిచేసి 1964 మే 21న ఏకంగా 30 కేంద్రాల్లో విడుదల చేయగలిగారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, నాయుడుకి రెట్టింపు లాభాలు ఆర్జించి పెట్టింది. ఆన్ని కేంద్రాల్లోనూ 10 వారాలకు పైగా ఆడి, 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. విజయావారు తెలుగులో హిట్టయిన ‘రాముడు-భీముడు’ చిత్రానికి డి.వి. నరసరాజు రచయిత అని ముందే చెప్పాను కదా, ఈ విజయవంతమైన ‘రాముడు భీముడు’. చిత్రాన్ని హిందీలో ‘రామ్ అవుర్ శ్యామ్’ పేరుతో పునర్నిర్మించాలని విజయా నాగిరెడ్డి ఆ సినిమా హక్కులు కొని, అందులో దిలీప్ కుమార్ చేత ద్వీపాత్రానయం చేయించాలని నిర్ణయించారు. హిందీ వర్షన్ కు కూడా తాపీ చాణక్యే దర్శకుడు. కథా చర్చలకు చాణక్య, రచయిత నరసరాజు, ప్రొడక్షన్ చీఫ్ రాధాకృష్ణ, బొంబాయికి చెందిన అసోసియేట్ దర్శకుడు, మరొక బెంగాలీ రచయిత, ముగ్గురు నలుగురు ప్రొడక్షన్ సిబ్బంది క్క్లిసి ఊటీ కి వెళ్లారు. సినిమా పునర్నిర్మాణమే కాబట్టి కథలో మార్పు వుండదు. అయినా చర్చలపేరుతో దిలీప్ కుమార్ ఊటీలో 20 రోజులకు పైగానే మకాం వేశారు. ఆరోజుల్లోనే వారి ట్రిప్ కు 60 వేలదాకా ఖర్చయింది. ఊటీలో చాణక్య తో దిలీప్ బృందం చర్చలు జరిపింది కేవలం మూడంటే మూడురోజులు మాత్రమే! దిలీప్ పది గంటలకు తీరిగ్గా బ్రేక్ ఫాస్ట్ కు వచ్చేవాడు. తర్వాత అలా డ్రైవ్ కు వెళ్లివస్తానని కారులో రోడ్లవెంట షికారు చేసి ఒంటి గంటకు వచ్చేవాడు. లంచ్ టైమ్ అయిందని లంచ్ తరవాత చర్చలకు కూర్చుందాం అని లంచ్ ముగించి రూమ్ కు వెళ్ళేవాడు. మరలా ఎప్పుడో సాయంత్రం 5 ఇంటికి వచ్చేవాడు. అప్పటిదాకా ఈ బృందం కంచి గరుడ సేవ చేస్తూ లాంజ్ లో ఎదురుచూస్తూ వుండేది. అప్పుడు టీ తాగి షటిల్ బ్యాడ్ మింటన్ కు వెళ్ళేవాడు. తరవాత రూమ్ కు వచ్చి మద్యం పార్టీలో కూర్చునేవాడు. అలా సాగేది రోజువారీ కార్యక్రమం. ఇక షూటింగ్ సమయంలో దర్శకుడు చాణక్యను తన స్థానంలో నిలబెట్టి కెమెరామన్ మార్కస్ బార్ట్ లే ని లైటింగ్ వెయ్యమనేవాడు. వెనక ట్రాలీలో కూర్చుని దర్శకుడు చేయాల్సిన పని తనుచేసేవాడు. షూటింగ్ ప్రారంభమయిన మొదటిరోజు బ్రేక్ లో వైజయంతిమాల నిర్మాత నాగిరెడ్డిని అడిగింది ‘’ఈ సినిమాకు దర్శకుడు చాణక్యా లేక దిలీప్ కుమారా?’’ అని. నాగిరెడ్డికి విషయం అర్ధమైంది. ఆయన తేరుకొనేలోపే వైజయంతిమాల ‘’ఇలా దిలీప్ దర్శకుడుగా పనిచేస్తే నేను ఈ సినిమాలో నటించను’’ అని నాగిరెడ్డికి చెప్పి నాగిరెడ్డి చేత టికెట్ తెప్పించుకొని బొంబాయికి వెళ్లిపోయింది. అలా రెండవ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. దిలీప్ కుమార్ ‘’వేరే హీరోయిన్ని బుక్ చేద్దాం’’ అన్నారు. వైజయంతిమాల బొంబాయి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కంప్లెయింట్ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాగిరెడ్డితో ‘’ఈ సినిమా తీయలేరు. నటీనటులెవరూ ముందుకు రావడంలేదు. మీరు వేరే పిక్చర్ ప్లాన్ చేసుకోండి’’ అని సలహా ఇచ్చారు. నాగిరెడ్డి మద్రాసు వచ్చి హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నారు. తర్వాత బొంబాయి నిర్మాతలు, ఆర్టిస్టులు కలుగజేసుకొని రాజీ కుదిర్చారు. వైజయంతిమాలకు ఇవ్వవలసిన పారితోషికం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వహీదా రెహమాన్ వైజయంతిమాల స్థానంలో వచ్చింది. మద్రాసు వాహినీలో షూటింగ్ మొదలైంది. నాగిరెడ్డి చాణక్యను పిలిసి ‘’ఈరోజు ఏ సీన్ తీస్తున్నారు’’ అని అడిగారు. చాణక్య ఏదో చెప్పారు. నాగిరెడ్డి ప్రొడక్షన్ చీఫ్ ని, అసోసియేట్ దర్శకుడిని కూడా అదే ప్రశ్న అడిగారు. ముగ్గురి సమాధానాలకు పొంతనలేదు. నాగిరెడ్డికి దడపుట్టింది. అప్పుడు డి.వి. నరసరాజును పిలిచి దిలీప్ తో మాట్లాడమన్నారు. చక్రపాణి కోపంతో ‘’అసలు దిలీప్ కుమార్ ఎవరు కథ మార్చడానికి. కథ మనది. రాజు గారూ మీరు ఖచ్చితంగా మాట్లాడండి దిలీప్ తో’’ అన్నారు. కానీ నరసరాజు సౌమ్యంగా ‘’వద్దండి. తొందరపడితే మనం నష్టపోతాం. నేను కేవలం రాముడు-భీముడు సినిమాకు రచయితను. నేను మాట్లాడితే దిలీప్ ఏమనుకుంటారో యేమో. మీరు మాట్లాడడమే సమంజసం’’ అన్నారు. అలా నాగిరెడ్డితో కలిసి నరసరాజు వెళ్ళి మాట్లాడారు దిలీప్ తో. ‘’నరసరాజు చాలా నియమబద్ధంగా పనిచేస్తారు. టైమ్ అంటే టైమే’’ అన్నారు నాగిరెడ్డి. ‘’సరే’’ అన్నారు దిలీప్. మొత్తానికి నరసరాజు గారు బ్యాలన్స్ చేస్తూ ప్రతిరోజూ దిలీప్ 9 గంటలకే షూటింగ్ కు వచ్చేలా చేశారు. అలా తయారైన ‘రామ్ అవుర్ శ్యామ్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే!

మరొకవిషయం… ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మాత మెయ్యప్ప చెట్టియార్ 1967లో ‘భక్త ప్రహ్లాద‘ చిత్రాన్ని ఈస్టమన్ రంగుల్లో నిర్మించారు. ఇరవై ఐదేళ్ళ తరవాత కూడా చిత్రపు నారాయణమూర్తే ఈ సినిమాకు దర్శకత్వం నిర్వహించటం వెనుక మెయ్యప్ప చెట్టియార్ ప్రోత్సాహం, వితరణ వున్నాయి! భక్త ప్రహ్లాద వంటి పౌరాణిక చిత్రానికి సముద్రాల గారితో కాకుండా డి.వి. నరసరాజు చేత మెయ్యప్పచెట్టియార్ కథ, మాటలు రాయించడం విశేషం. ఇదే విషయాన్ని నరసరాజు మెయ్యప్పని అడిగితే “నాకు కావలసింది పండితుడు కాదు. పురాణ కథలను ఆధునికంగా, నాటకీయంగా రాయగల ఆధునిక నాటక కర్త. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను” అన్నారట. అంతేకాదు నారాయణమూర్తి కి “నిన్ను ప్రహ్లాద తీయమంటే పాతికేళ్ళ క్రితం తీసినట్లే తీస్తావు. నరసరాజు మోడరన్ డ్రమెటిస్టు. పురాణ గాధను ఆయన ఎలా మలుస్తాడో గమనించు. ఆయన చెప్పింది విను. నీ పాత అభిప్రాయాలు ఆయనమీద రుద్దకు” అంటూ సలహా కూడా ఇచ్చారట.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap