•స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో జాతీయ కవిచక్రవర్తిగా కీర్తినొందిన శ్రీ దామరాజు పుండరీకాక్షుడు జీవితం – సాహిత్యంపై ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
•పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ల ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా అన్ని వర్గాలకు సమానమైన గౌరవాన్నిస్తూ, శాంతి, సామరస్యాలకు పెట్టింది పేరైన భారతదేశం ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనవసర అంశాలను ప్రేరేపిస్తూ భారత్ లో అశాంతిని రేకెత్తించేందుకు, మనదేశ సమగ్రతను దెబ్బతీసే లక్ష్యంతో కుట్రలు జరుగుతున్నాయని వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అక్కడక్కడ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు తనను ఎంతగానో కలచివేశాయన్న ఆయన, ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా భారతీయుల మనసుల్లో నాటుకుపోయిన సౌభ్రాతృత్వ భావన తిరిగి దేశాన్ని ఒకతాటిపైకి తెస్తుందన్నారు.
ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టు, విజయవాడ చాప్టర్ లో శుక్రవారం (15-07-22) జరిగిన కార్యక్రమంలో జాతీయ కవిచక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ దామరాజు పుండరీకాక్షుడుగారి జీవితం, సాహిత్యం గురించి పరిశోధించి రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న ఆనందకర సమయంలో ఈ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత శ్రీ యల్లాప్రగడ మల్లికార్జునరావుగారిని అభినందించారు.
తరతరాలుగా భారతీయుల మనసుల్లో పరమతసహనం అంతర్వాహినిగా ప్రవహిస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ స్ఫూర్తిని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మరింత బలోపేతమైన ప్రజా శ్రేయస్కరమైన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో మనమంతా భాగస్వాములం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ్టి పరిస్థితుల్లో కుల, మత, ప్రాంత దురాచారాలను పారద్రోలాల్సిన అవసరం మరింత పెరిగిందని, కొంతకాలంగా సామాజిక మాధ్యమాల ద్వారా మన సంస్కృతిని కించపరిచేలా కొందరు చేస్తున్న పోస్టింగులు, ప్రకటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సమాజంలో వివాదాలను సృష్టించేందుకు కుట్రపన్నుతున్న దుష్ట శక్తులకు ఇలాంటి పోస్టింగులే ఊతం కల్పిస్తున్నాయని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఇది అంగీకారయోగ్యం కాదన్న ఆయన, ఇది మన భారతీయత కాదని, ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ నిరసించి, ప్రతిఘటించాలని సూచించారు.
సర్వసత్తాక భారతదేశాన్ని తక్కువ చేస్తూ, ఇక్కడ ప్రజల్లో ఆత్మన్యూనత పెంచే విధంగా కొన్ని దేశాలు ప్రవర్తిస్తున్నాయన్న ఉపరాష్ట్రపతి, మరికొన్ని మత ప్రధాన దేశాలు మన అస్తిత్వంపై విషం చిమ్ముతున్నాయన్నారు. అలాంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ – నవ, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మనమంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సూచించారు. ఆకలిదప్పులు, అవినీతి, అరాచకం, నిరక్షరాస్యత, వివక్షకు తావు లేని భారతదేశాన్ని నిర్మిస్తూ.. సాంఘిక, ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్న ఆయన, మరీ ముఖ్యంగా లింగ వివక్షకు చోటులేకుండా చేయడం మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. వివక్ష అనే పదానికి తావులేని ప్రజాస్వామ్య భారతం సాకారం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తూ, మహాత్ముడి స్ఫూర్తిని భారతదేశంలో ప్రతి గుండెకు చేర్చిన మహనీయులు ఎందరో ఉన్నారన్న ఉపరాష్ట్రపతి, వారి ప్రతి అక్షరం, ప్రతి నినాదం కోట్లాది భారతీయుల గొంతుకలై ప్రతిధ్వనించాయన్నారు. నాడు స్వరాజ్య పోరాటం దిశగా ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతోపాటుగా సమరయోధుల త్యాగాలను సైతం జాతీయోద్యమ సాహిత్యం కళ్ళకు కట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కావ్యాలు, ఖండికలు, కవితలు, గేయాలు, దండకాలు, శతకాలు, భజనలు, కీర్తనలు, బుర్రకథలు, కథలు, నవలలు ఇలా ఎన్నో ప్రక్రియలు సాహితీ ప్రపంచంలో తమదైన పాత్రను పోషించాయన్నారు. ఈ సందర్భంగా జాతీయోద్యమ సాహిత్య సుగంధాలు వెదజల్లిన పలువురు కవులు, రచయితలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్న రోజుల్లో గాంధీజీని నాయకుడిగా చిత్రీకరిస్తూ శ్రీ దామరాజు పుండరీకాక్షుడుగారు రాసిన నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిందన్న ఉపరాష్ట్రపతి, ఎన్నో ప్రబోధాత్మక రచనలు చేయడమే గాక, రామరాజ్యం అనే పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా “గాంధీ లేనిది సాగదు నా కాలం” అంటూ నినదించినవారి స్ఫూర్తి ఆదర్శనీయమని తెలిపారు.
స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సమయంలో నాడు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొని దేశం స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు కృషి చేసిన మహనీయుల స్ఫూర్తిని భారతీయ యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, ఆ మహనీయుల జీవితాలను ఒకసారి చదవడం, అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇటీవల మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ద్వారా అల్లూరి కీర్తి దేశవ్యాప్తంగా తెలిసిందన్నారు. ఇదే విధంగా వివిధ ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
పుస్తకావిష్కరణ అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులకు ఉపరాష్ట్రపతి సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. గ్రామీణ యువత, మహిళలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి చేస్తోందన్న ఆయన, ఈ ఏడాది నుంచి గ్రాఫిక్స్ అండ్ డిజైన్ కోర్సు ప్రవేశపెట్టి, సాంకేతికంగా యువతను శక్తివంతం చేసేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్, పుస్తక రచయిత శ్రీ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహక సభ్యులు సహాపలువురు ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.