“పైడిమర్రి వారి ప్రతిజ్ఞకు వన్నె తెచ్చిన రఘునందన్ “

“భారత దేశము నా మాతృభూమి,
భారతీయులందరూ నా సహోదరులు…..”
అంటూ భారతీయత ఉట్టిపడే అద్భుతమైన ‘ప్రతిజ్ఞ’ని శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. ఈ ప్రతిజ్ఞలో వీరు వినయశీలత, విధేయత, కుల, మత ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయులందరిని సోదర, సోదరీమణులుగా భావించి అందర్నీ భారతమాత ముద్దుబిడ్డలుగా భావించి చక్కని ప్రతిజ్ఞను అందించి దానిని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టారు. ప్రతినిత్యం పిల్లలందరి చేత భారతదేశ ఉన్నతిని కోరే విధంగా అమృతతుల్యమైన వాక్కులని పలికిస్తున్న పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్రను అద్భుతంగా అక్షరీకరించారు. అంతే కాదు వారు సాహితీ వినీలాకాశంలో ఎగరవేసిన విజయబావుటాల్ని మరింత అందంగా విరబూయించి పైడిమర్రి వారి కుటుంబ సభ్యులను కూడా ఈ రచన ద్వారా వెలుగులోకి తెచ్చి పుస్తక రచయిత రేపాక రఘునందన్ గారు తెలుగు జాతికి మట్టిలోమాణిక్యాన్ని పరిచయం చేసిన ఘనత దక్కించుకున్నారు.

రేపాక రఘునందన్ గారు సాహితీ సవ్యసాచి. వీరు డబుల్ ఎం.ఎ, బి.ఎడ్, ఎంఫిల్ చేసిన సరస్వతీ మాత మానస పుత్రులు. అలాగే వీరు సాహిత్యాన్ని కూడా ఉగ్గుపాలతో అవపోసన పట్టారు. వీరి రచనలన్నీ కూడా కోయిలమ్మ కుహూ రాగాలంత అందంగా, సమాజానికి ఆదర్శంగా ఉంటాయి. ఇప్పుడు వీరు భారతమాత ఔన్నత్యాన్ని తెలిపే “ప్రతిజ్ఞ” రూపకర్త శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జీవితం+ సాహిత్యాన్ని రెండింటినీ సమపాళ్ళలో మేళవించి అందంగా అక్షరీకరించి చెప్పారు.

“వారసత్వ సంపద ప్రతిజ్ఞ” అధ్యాయంలో దేశంపై ఉన్న మమకారాన్నంతా రంగరించి దేశభక్తి ఔన్నత్యాన్ని చాలా చక్కగా తెలియజేశారు రేపాక రఘునందన్ గారు. భావ వ్యక్తీకరణ చెయ్యడానికి గొప్పసంపద అంటూనే భావితరాలకు అందించే గొప్ప వారసత్వ సంపద “దేశభక్తి” ఈ ప్రతిజ్ఞ అంటారు రచయిత. ప్రముఖ హిందీ కవి మైథిలీ శరణ్ గుప్తా గారు భారతమాతని ప్రాణప్రదంగా ఆరాధిస్తున్న వైనాన్ని, వారిలోని భావవ్యక్తీకరణను అక్షర తూణీరాలుగా మలచి చెప్పారు రచయిత. ‘ప్రతిజ్ఞ’ ఎవరు రాశారు అన్న విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రఘు గారు తరతరాలకూ తరగని సంపద అందించిన ఖజానా అధికారి అయిన, సాహిత్యాన్ని ప్రవృత్తిగా చేసుకున్న పైడిమర్రి వారి గురించి ఎన్నో సరికొత్త విషయాలను ఈ జీవిత చరిత్ర పుస్తకంలో మన తర్వాత ఎన్ని తరాలైనా గుర్తించుకునేంత చక్కగా మలచి చెప్పారు.

అలాగే రఘు గారు పైడిమర్రి వారు రాసిన ప్రతిజ్ఞ పై ఉన్న మమకారాన్ని ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలో అందంగా వ్యక్తీకరించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు వెంకట్రామయ్య, రాంబాయమ్మ పుణ్యదంపతుల ఇంట 1916 జూన్ 16న నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామంలో భారతమాత ముద్దుబిడ్డగా జన్మించారు. వీరు రామాయణం, మహాభారతం రాజరికపు కథలు, జానపద కథలను తల్లి వద్ద నేర్చుకోవడం వల్ల చిన్న వయసులోనే అపారమైన జ్ఞాన సంపద ఉండేది వీరిలో. అలాగే తల్లికి చేదోడువాదోడుగా ఉంటూనే చదువులో చురుగ్గా రాణించారు. తెలుగుతో పాటు ఇంకా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం లాంటి భాషల్లో కూడా మంచి పట్టు సాధించారు. అలాగే హైస్కూల్, ఉన్నత విద్యల్ని అత్యధిక మార్కులతో పూర్తి చేసిన వైనాన్ని చాలా చక్కగా చెప్పారు రఘుగారు. పైడిమర్రి వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేక పోయినా దేశంలోని రాజకీయ స్థితిగతుల్ని అర్థం చేసుకుని భారతమాతపై అపారమైన ప్రేమని పెంచుకుని సామాజిక, సేవాభావాన్ని కూడా అలవర్చుకున్నారు. చిరునవ్వే వజ్రాభరణంగా ధరించి పైడిమర్రి వారు ఆత్మ విశ్వాసం, ఆత్మ బలం, కృషి, పట్టుదల, అకుంఠిత కార్య దీక్షతో ముందుకుసాగారు అంటారు రచయిత.

18 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఖజానా శాఖలో చిరుద్యోగిగా చేరి నిబద్ధతతో పని చేసి జిల్లా ఖజానా అధికారిగా ఎదిగారు. 19 సంవత్సరాలకి వెంకటరత్నం గారితో వివాహం జరిగింది. ఏ ఊర్లో పనిచేసినా తన సాహితీ చలోక్తులతో అందర్నీ నవ్వుల్లో ముంచెత్తేవారని రచయిత మరింత హాస్యాన్ని జోడించి చెప్పారు. అలాగే సమకాలీన రాజకీయాలపై మంచి అవగాహన ఉండేది. వీరు బహుగ్రంధ కర్త, చక్కని ఉపన్యాసకులు. ఎంతో మంది నిరుద్యోగుల్ని చిరుద్యోగులుగా చేశారాని పైడిమర్రి వారి సేవా నిరతిని కొనియాడారు రచయిత. రేపాక రఘునందన్ గారు అంటారు వీరు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ నిరక్షరాస్యులు వచ్చినా వారి పనిని ఎంత రాత్రైనా పూర్తి చేసి వారు సంతృప్తి చెందితే పైడిమర్రి వారు అది తన కుటుంబ సభ్యుల ఆనందంగా భావించే వారన్నారు రచయిత.

“కుటుంబం అధ్యాయం”లో పైడిమర్రి వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారి నైపుణ్యం గురించి చాలా చక్కగా వివరించారు. పైడిమర్రి వారికి ఇద్దరమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అందరూ కూడా చక్కని ప్రతిభాపాఠవాలతో రాణిస్తున్నారు. పైడిమర్రి వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు విద్యావేత్త,బహుభాషా కోవిదులు, సంఘ సేవకులు, సంగీతంలో ప్రవేశం, యోగా సాధకులు, సాహితీకారులు, ప్రముఖ హోమియో వైద్యులు. ఇలా అన్నీ తానై అన్నిటా తానై అన్ని రంగాల్లో ప్రముఖంగా భాశిల్లారు. అంతేకాకుండా వారి పిల్లల్ని కూడా అంతే ప్రతిభతో భాసిల్లే విధంగా పైడిమర్రి వారు తీర్చిదిద్దారని చాలా ఆదర్శవంతంగా చెప్పారు రచయిత.

“వైద్యునిగా పైడిమర్రి వారు” అధ్యాయంలో రఘునందన్ గారు పైడిమర్రివారు అందించిన ఆరోగ్య సేవల్ని ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ ఎంతో అందంగా ఆవిష్కరించారు. ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి చికిత్స, మూలికావైద్యాలపై ఎన్నో పుస్తకాలు రాశారు. అంతేకాకుండా ఈ వైద్య సేవలు అన్నింటినీ అశేష ప్రజానికానికి ఉచితంగా అందించి ఎంతో మందికి నూతన జీవితాన్ని ప్రసాదించారంటారు. అలాగే పైడిమర్రి వారు ప్రముఖులు ఇతర భాషలో రాసిన వైద్య గ్రంధాలను తెలుగులో, సంస్కృతంలో ఆవిష్కరించి వైద్య రంగానికి ఎనలేని సేవలు అందించారంటారు రచయిత. “భారతీయులందరూ నా సహోదరులు” అధ్యాయంలో మానవ జీవితం అర్ధం, పరమార్ధాన్ని ఉగ్గుపాలతో అవపోసన పట్టి తరతరాలకి చెరగని ప్రతిజ్ఞను విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని జాతియ సమైక్యత పెంపొందించే విధంగా పైడిమర్రి వారు అందించారని రచయిత కొనియాడారు. “ప్రతిజ్ఞ ఎందుకు రాయాల్సి వచ్చింది” అధ్యాయంలో 1960లో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత పైడిమర్రి వారిని బాగా కలిచివేసింది అంటారు రచయిత. దేశభక్తి పరాయణత నరనరానా జీర్ణించుకుని విద్యార్థులలో కూడా దేశభక్తిని చాటే విధంగా జాతీయ సమైక్యతను, సమగ్రతను పెంపొందించే విధంగా అద్భుతంగా ప్రతిజ్ఞను రచించారని రచయిత రఘు గారు చాలా కూలంకుషంగా చెప్పారు. అలాగే ఈ ప్రతిజ్ఞ పాఠ్యపుస్తకాలలో కూడా ముద్రించారు అని చెప్పారు.

అలాగే “పైడిమర్రివారి రచనలు” అంటూ పైడిమర్రివారు రాసిన రచనల్ని సవివరంగా వివరించారు రఘుగారు. “యోగా, ప్రకృతి వైద్యం, జల చికిత్స, దైవ, దేశభక్తి, కథలు, కవితా సంపుటాలు, నాటికలు, పద్యాలు, నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలు…” ఇలా అనేక రచనలను వివరణాత్మాకంగా పేర్లతో సహా తెలియజేశారు రచయిత. అలాగే పాఠ్యాంశాల్లో పైడిమర్రి వారి పేరు ఉండేలా ఎవరెవరు ఎలా కృషి చేసి సఫలీకృతులయ్యారో చాలా సవివరంగా, ఇంకా ఆసక్తిదాయకమైన విషయాలు కూడా తెలియజేశారు ఈ పుస్తక రచయిత.

ఇంకా వీరి జీవిత చరిత్రలో ప్రతిజ్ఞ గురించి జరిగిన సిఫార్సులు, ఆమోదాలు, 1980 నుండి 1988 వరకు వారి జీవన యాత్ర ఎలా కొనసాగింది అన్న విషయాలు ఇంకా ప్రతిజ్ఞలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు, నేడు పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ ఎలా ఉంది అన్న విషయాలు, సాహితీ దిగ్గజం పైడిమర్రి అంటూ వీరు సాహితీ వినీలాకాశంలో ఎగురవేసిన విజయబావుటాల్ని కూడా చాలా అందంగా అక్షరీకరించి చెప్పి పైడిమర్రి వారి ప్రతిభని మరింత ఇనుమడింపజేశారు రేపాక రఘునందన్ గారు.

ఇంకా ఈ జీవిత చరిత్రలో పైడిమర్రి వారి కుటుంబ సభ్యులంతా వారిపై ఉన్న ప్రేమ ఆప్యాయతల్ని, వారితో తమకున్న కుటుంబ బంధాల్ని, వారితో గడిపిన మధురానుభూతుల్ని, పైడిమర్రి వారిలోని దేశభక్తి, మానవతా విలువలు కుటుంబ సభ్యులందరి దగ్గర సవివరంగా తెలుసుకొని ఆ గోల్డెన్ లెటర్స్ ని ఈ పుస్తకంలో మరింత అందంగా పొందుపరిచారు రచయిత. అలాగే పైడిమర్రి వారి జీవన స్రవంతిలో జరిగిన మధురానుభూతులను ప్రతీది ఫోటోలతో సహా అన్నింటిని చాలా వివరంగా సమకూర్చారు. వారి కుటుంబ సభ్యుల ఫోటోలు అన్నీ కూడా చాలా చక్కగా పుస్తకంలో పొందుపరిచారు. ఓ గొప్ప మేధో సంపన్నులుగా ఇంత అద్భుతంగా ఈ పుస్తకాన్ని మలిచి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జీవితాన్ని+ సాహితీ విశేషాలను వెన్నెల పిండారబోసిన చందాన చాలా చక్కగా పైడిమర్రి వారి జీవిత చరిత్రని మనకి అందించారు రచయిత రేపాక రఘునందన్ గారు. ఈ జీవిత చరిత్ర పుస్తకం ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన చక్కని పుస్తకం.

రచనలతో పాటు ప్రస్తుతం హిందీ పండిట్ గా, హిందీ సంఘ్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు రఘు గారు. పురస్కారాల పరంపరలో భాగంగా రఘునందన్ గారు 1996లో ఎస్.ఆర్.డి. సుబ్బయ్య మెమోరియల్ పురస్కారం, 2008లో కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2012లో తెలుగు మహాసభల పురస్కారం, ఆల్ ది బెస్ట్ అకాడమీ వారి నుంచి విద్యా ప్రతిభరత్న పురస్కారం అందుకొన్న రేపాక రఘునందన్ గారికి అభినందన మందార మాలలు.

పుస్తకం వివరాలకు:
వెల: రూ. 120/-
రేపాక రఘునందన్,
తిరువూరు, కృష్ణా జిల్లా. ఫోన్ నెంబర్. 9440848924

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు, రచయిత్రి ( ఫ్రీలాన్స్ జర్నలిస్ట్), ఫోన్ నెంబర్. 9704725609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap