ప్రపంచమంతా విస్తరించిన మహావృక్షం

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 12

వృక్షశాస్త్రంలో శాఖోపశాఖలై ప్రపంచాన ఎదిగిన మహావృక్షం, బహుముఖ ప్రజ్ఞాశాలి, రేడియో సైన్స్ పితామహుడు జగదీష్ చంద్రబోస్ బెంగాలీ యుడు. చెట్లకు ప్రాణముందని అవి మనలాగే శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం చెందుతాయని తన ప్రయోగాలతో ప్రపంచానికి చాటిన మేటి వృక్షశాస్త్రవేత్త మన బోస్. అనుక్షణం వృద్ధి చెందే వృక్ష కణజాలాన్ని ఎన్నో రెట్లు పెద్దదిగా చేసి చూపించే “క్రిస్మోగ్రాఫ్” అనే పరికరాన్ని సృష్టించి, ప్రపంచ శాస్త్రజ్ఞులలో భారతీయులు ఆధ్యాత్మికత లోనే కాదు, ఆధునికతలోనూ ముందుంటారనీ నిరూపించాడు జగదీష్ చంద్రబోస్, వైర్ లెస్ సిగ్నలింగ్ పరిశోధనలోనూ అద్భుత ప్రగతిని సాధించి రేడియో సిగ్నలను గుర్తించడానికి తొలిసారిగా అర్థవాహక జంక్షన్లను వాడి రేడియో పితామహునిగా కీర్తించబడ్డాడు బోస్. రాడార్ యంత్ర పనితీరును మెరుగు పరిచి, పలు కొత్త అంశాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించి, తన బహుముఖ ప్రజ్ఞను చాటాడు బోస్. ఆధునిక పరికరాలు అంతగా లభ్యం కాని రోజుల్లోనే తన జీతం డబ్బులు వెచ్చించి, తానే సొంత ప్రయోగశాలకు కావలసిన పరికరాలను సమకూర్చుకొని ప్రతికూల పరిస్థితులలోనూ తనకనుకూలంగా ప్రయోగాలు సాగించిన ఆదర్శ శాస్త్రవేత్త బోస్. బోస్ పేరిట కలకత్తాలోని బోస్ పరిశోధనా సంస్థ, రాయల్ సొసైటీ ఫెలోషిప్, ఇండియన్ కాంగ్రెస్ అధ్యక్షత వంటివి బోస్ యొక్క అప్రతిహత ప్రతిభకు చిరుపరిచయాలు మాత్రంగానే నిలుస్తాయి. ఈ వృక్షశాస్త్ర మహావృక్షం జగదీష్ చంద్రబోస్ నేటికీ మన ధృవతార.

( జగదీష్ చంద్రబోస్ జన్మదినం 30 నవంబర్ 1858)

1 thought on “ప్రపంచమంతా విస్తరించిన మహావృక్షం

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link