‘లవ కుశ ‘ సినిమా కు 57 ఏళ్ళు

లవకుశ చిత్ర నిర్మాణం 1958 లో ప్రారంభమయ్యి, 29-03-1963 న  విడుదలయ్యింది…

లలితా ఫిలింస్ చరణదాసి అనే చిత్రాన్ని నిర్మించగా 20-12-1956 న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాత ఎ. శంకర రెడ్డి గారు, ఈ చిత్రంలో ఒక చిన్న సన్నివేశంలో అంజలీదేవి, ఎన్. టి. రామారావు గార్లు సీతారాములుగా కనిపించారు. ఆ దృశ్యం శంకర రెడ్డి గారి మదిలో ముద్ర వేసుకుని వీళ్ళిద్దరినీ సీతా రాములుగా పూర్తి స్థాయి సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
సీతారాముల గాధ అనగానే శంకర రెడ్డిగారికి 1934 లో వచ్చిన లవకుశ చిత్రం మనస్సులో మెదిలింది. ఆ చిత్ర దర్శకులు సి. పుల్లయ్యగారిని సంప్రదించారు. అప్పటివరకూ తెలుగులో పూర్తి కలర్ చిత్రం రాలేదు. అందుకని క్రొత్తదనం కోసం లవకుశ చిత్రాన్ని గేవా కలర్ లో చిత్రీకరణ చేయాలని శంకర రెడ్డి గారు, సి. పుల్లయ్యగారు నిశ్చయించుకున్నారు.
కధ,మాటలు, కొన్ని పాటలు సదా శివ బ్రహ్మం గారు రచించగా సముద్రాల సీనియర్ కొన్ని పాటలు, పద్యాలు రచించారు. కొసరాజు గారు కూడా కొన్ని పాటలు రచించారు. సంగీతం ఘంటసాల.

1934 లో వచ్చిన లవకుశ నుంచి చిన్న చిన్న మార్పులు చేశారు. శ్రీ రాముడు స్వర్ణ సీతను తయారు చేయించి అశ్వమేధ యాగం చేయాలనుకున్నప్పుడు ఆ విషయం తెలిసిన ప్రజలు తమలో ఒకడు అన్నమాట పట్టుకునే కదా శ్రీ రాముడు సీతను అరణ్యవాసానికి పంపింది అని బాధపడి తాము అందరూ కలిసి ఇచ్చే బంగారంతో స్వర్ణ సీతను చేయించవలసిందిగా శ్రీరాముని కోరతారు. ఇది మూల ఘట్టంలో లేదు. ఇవాళ మనది ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వరంగంలో ప్రజల బాధ్యత ఎలాంటిదో తెలియచేసినట్లుగా కూడా ఉంటుందని ఈ మార్పు చేశారు.
లవకుశ చిత్ర నిర్మాణం చెన్నై లోని విజయా వాహినీ స్టూడియోలో 05-03-1958 న తొలి తెలుగు రంగుల చిత్రం గా ప్రారంభమయ్యింది.

చిత్ర నిర్మాణం కొంత కాలం సాగింది. తరువాత ఆర్ధిక ఇబ్బందులవలన చిత్రీకరణ 3 సంవత్సరాలు ఆగిపోయింది. రాయవరం లో ఎం. జి. ఆర్. ఇంటికి ఎదురుగా ఉన్న తోటల్లో వేసిన వాల్మీకి ఆశ్రమం ఎండలకు, వానలకు రూపం మారిపోయింది. కుశ, లవుల పాత్రలు ధరించిన పిల్లలు ఎదిగిపొయ్యారు.
అంతవరకూ చిత్రీకరణ చేసి ఎడిట్ చేసిన 8 వేల అడుగుల చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు చూపిస్తుంటే వారు వస్తున్నారు. చూస్తున్నారు, తప్ప ఎవరూ ముందుకు రావటం లేదు. చివరగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుందర్లాల్ నహతా ఫైనాన్స్ చేయటానికి ముందుకు వచ్చారట.

దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది. కాని దర్శకులు సి. పుల్లయ్యగారి ఆరోగ్యం సరిగ్గా లేనందున సెట్లో నిలబడటం, కూర్చోవడం కూడా కష్టమయ్యింది.
ప్రముఖ దర్శకులు బి. ఎన్. రెడ్డి గారు తిన్నంగాచార్య అనే మహా కవి కుందమాల పేరుతో రాసిన సీత కధని కళాత్మకంగా సినిమాగా తీయాలనుకున్నారు. కాని అది నెరవేరలేదు. ఈ విషయం తెలుసుకున్న సి. పుల్లయ్యగారి కుమారుడు సి. ఎస్. రావు గారు బి. ఎన్. రెడ్డి గారిని కలిసి లవకుశ చిత్రాన్ని పూర్తి చేయమన్నారు.

కాని బి. ఎన్. రెడ్డి గారు “ఇది మీ నాన్నగారి సొత్తు. నువ్వే చిత్రాన్ని పూర్తి చెయ్యి” అన్నారు. దీనికి సి పుల్లయ్య గారు, సుందర్లాల్ నహతా గారు, ఎన్. టి. ఆర్. సమర్ధించారు. మిగిలిన 12 వేల అడుగుల చిత్రాన్ని సి. ఎస్ రావు. గారు పూర్తి చేశారు.
అలాగ అన్ని అవరోధాలను అధిగమించి 29-03-1963 న లవకుశ విడుదలయ్యింది. అఖండ విజయాన్ని సాధించింది. సుందర్లాల్ నహతా గారికి కనక వర్షం కురిపించింది. శంకర రెడ్డి గారికి కీర్తి దక్కింది. ఈ చిత్రానికి అపూర్వ స్పందన లభించింది. ప్రజలు తీర్ధ యాత్రలకు, పుణ్య క్షేత్రాలకు వెళ్ళినట్లు బండ్లు కట్టుకుని సినిమా చూశారు. అంజలీ దేవి, ఎన్. టి. ఆర్. లను సీతా రాములుగా ప్రజలు కొలిచారు.
అన్ని దృశ్యాలలో ఒకే వయస్సులో లవకుశులు కనబడక పోయినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. చిత్రం లో మునిగిపోయి తన్మయులై చూశారు.

ఆ రోజుల్లో కంప్యూటర్స్, గ్రాఫిక్స్ లేవు. ఉదాహరణకు చిత్రంలోని క్లైమాక్స్ లో భూమి విడిపోయి భూదేవి వచ్చి సీతాదేవిని తీసుకువెళ్ళే దృశ్యాలను చాలా కష్టపడి చిత్రీకరించారు. ఈ సన్నివేశం లో భూమి 3 భాగాలుగా విడిపోవడం చూపిస్తారు. ఒకటి అలానే ఉంటుంది. రెండు విడి పోతాయి. ఆ రెండు విడిపోయే భాగాలు, ఒకోటి వందకు పైగా ట్రాలీలమీద మట్టీ, గడ్డీ అమర్చారు. గాలి, ఎండుటాకులు ఎగిరే ఎఫెక్ట్ కోసం పెద్ద పెద్ద ప్రొఫెల్లర్స్ వాడారు. ఆ ప్రొఫెల్లర్స్ శబ్దంలో డైరెక్టర్ చెప్పేది వినబడదు. చిత్రీకరణ సమయంలో మట్టితో నిండిన ట్రాలీలను లాగేవారు. అలా కష్టపడి భూమి 3 భాగాలుగా విడిపోయినట్లు చూపారు. చాయాగ్రాహకులు పి. ఎల్. రాయ్ ఈ చిత్ర దృశ్యీకరణలో ప్రతీ ఫ్రేమును ఎంతో రసవత్తరంగా, అందంగా, అర్ధవంతంగా మనస్సుకు హత్తుకుపోయేలా చిత్రీకరించారు. రవికాంత్ నగాయిచ్ ప్రేక్షకులను ఉత్తేజపరిచేలా యారో ట్రిక్స్ చిత్రీకరించారు.
వాల్మీకి పాత్రధారి నాగయ్య గారు రావణు సంహరించి అనే పద్యం గానం చేస్తూ చిత్ర ప్రవేశం చేస్తారు. నాగయ్య గారిని చూస్తే వాల్మీకి మహర్షి ఇలాగే ఉండేవారనిపిస్తుంది.
సి. ఎస్. రావుగారికి మహానటులుగా కనిపించిన వారు ముగ్గురే ముగ్గురు.. శివాజీ గణేశన్, ఎన్. టి. రామారావు, సావిత్రి. కాని లవకుశ చిత్రం షూటింగులో నాగయ్యగారి నటనను చూసిన తర్వాత ఆ ముగ్గురితోపాటు నాగయ్యగారిని కూడా మహానటునిగా భావించినట్లు ఒక ఇంటర్వ్యూలో సి. ఎస్. రావు గారు చెప్పారు.
ఈ చిత్రం 62 కేంద్రాలలో శత దినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొన్నదని, 75 వారాలు ప్రదర్శించబడ్డ తొలి తెలుగు చిత్రం గా ఘనతకెక్కిందని వార్తా పత్రికలలో వ్యాసాలు వచ్చాయి.

ఈ చిత్రం ఏరియాలు , ఎ, బి, సి, డి, వంటి సెంటర్ల తేడా లేకుండా రాశులు పోసినట్లుగా ధనాన్ని పోగులు చేసింది. మారుమూల ప్రాంతాల జనం నాటు బళ్ళు కట్టుకుని చద్దన్నం మూటతో థియేటర్లకు తరలి వచ్చేవారు. అప్పట్లో అన్ని ఊళ్ళకూ బస్సు సదుపాయం ఉండేది కాదు. ఏ ఊరిలోనూ కరెంటు కూడా ఉండేది కాదు. అయినా ధైర్యం చేసి సినిమా చూసి లవకుశ సినిమాలోని పద్యాలు పాటలూ పాడుకుంటూ ఉత్సాహంగా ఇళ్ళకు వెళ్ళిపోయేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap