కళాప్రపూర్ణ మిక్కిలినేని

ప్రజానాట్య మండలి ‘ వ్యవస్తాపక సభ్యులు, నాటకరంగం నుండీ వెండి తెరపైకి వెళ్ళి 400కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వర్థంతి నేడు (22 ఫిబ్రవరి 2011).
మిక్కిలినేని బాల్యం –
1916లో గుంటూరు జిల్లా లింగాయ పాలెంలో కృష్ణాష్టమినాడు జన్మించి, కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగి పెద్దవాడయిన శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జీవితం ఆంధ్రదేశంలో సంభవించిన సాంఘికపరిణామానికి తార్కాణం. ఒక రైతు బిడ్డ జానపదకళాకారులను గురువులుగా భావించి, పౌరాణిక సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించి నటించటం, పెద్ద చదువులు చదవలేక, చిత్రకళాభ్యాసం మధ్యంతరంగా ఆగిపోయి, పశువైద్యాచార్యుడైనప్పటికీ చివరకు నాటకరంగోద్దారకుడుగా, చలనచిత్ర నటరత్నంగా, కళాపరిశోధకుడుగా ప్రసిద్ధి కెక్కటం కాలప్రభావమని చెప్పక తప్పదు.
నటుడుగా –
రాధాకృష్ణమూర్తి గాంధీజీ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెం కుమార రాజాకోటగిరి వేంకటకృష్ణారావుగారి నాయకత్వం క్రింద సాగిన ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నవారిలో వయసునుబట్టి చిన్నవాడాయన. అతివాదభావాలు ఆకర్షింపగా, సమసమాజవాద పక్షంలో చేరి, క్విట్ ఇండియా ఉద్యమంలో విధ్వంసకారిగా కారాగార శిక్షలనుభవించారు. యువజన, గ్రంథాలయ, నాస్తికోద్యమాలలో పనిచేశారు. సమసమాజవాది కావడంచేత ” ప్రజానాట్యమండలి” స్థాపనలో ప్రముఖ పాత్ర వహించి, అది శాఖోపశాఖలుగా విస్తరిల్లటానికి కృషి చేశారు. ప్రజానాట్యమండలి ప్రదర్శించిన నాటకాల్లో తనతోపాటు తనభార్య కూడా ప్రధాన పాత్రలు ధరించేటట్లు చేసి మాటకు చేతకూ తేడా లేకుండా నడుచుకొన్నారు. దక్షిణ భారత దేశంలో సాంస్కృతిక సంస్థలకూ విశ్వవిద్యాలయాలకూ పలుహోదాల్లో నాటకరంగాభివృద్ధికి తోడ్పడ్డారు. పొరుగు దేశాలు భారత దేశంమీద దండెత్తినప్పుడు రాయలసీమ, దివితాలూకా ప్రజలు కష్టాలపా లయినప్పుడు శ్రీ మిక్కిలినేని సహనటులతో కూడి లక్షలకొలది డబ్బు సేకరించి ప్రజాసేవ చేశారు. దాదాపు అర్ధ శతాబ్ది జీవితకాలంలో 400కు పైగా సాంఘిక, జానపద పౌరాణిక చలనచిత్రాల్లో గణనీయమయిన విభిన్న పాత్రలు ధరించి కళాప్రియుల మన్ననలు పొందారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో ముఖ్యపాత్ర వహించి చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.

రాధాకృష్ణమూర్తి గొప్ప పరిశోధకుడు. ఆంధ్రనాటక రంగ చరిత్ర, నటరత్నాలు, తెలుగు వారి జానపదకళారూపాలు వారి పరిశోధన పాటవాన్ని చాటుతున్నాయి. ఈ గ్రంథాలు తెలుగు భాషాసమితి, సాహిత్య అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం బహుమానాలు పొందాయి. ఈ చలనచిత్ర నటీనటుల ఛాయాచిత్రాలు సేకరించి అనేక ప్రదేశాల్లో ప్రదర్శించారు. విశ్వవిద్యాలయాల్లో, సాంస్కృతిక సంస్థల్లో అనేక ప్రసంగాలు చేశారు. ఆకాశవాణిలో చలనచిత్ర పరిణామాన్ని గూర్చి ధారావాహిక ప్రసంగాలు చేశారు.
పరిశోధకుడుగా –
ఆంధ్రవిశ్వవిద్యాలయం శ్రీ రాధాకృష్ణమూర్తిని “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించింది. వారు విశ్వవిద్యాలయాల నుండి, సాంస్కృతిక సంస్థలనుండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి, శతాధికంగా సన్మానాలు పొందారు. “అమెరికన్ బయోగ్రఫికల్ ఇన్స్టిట్యూట్” వారికి నాలుగు అవార్డులు ఇవ్వటమే కాకుండా వారిని తన “అడ్వయిజరీ బోర్డు” సభ్యుడుగా ఎన్నుకొన్నది.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు 22 ఫిబ్రవరి 2011 న విజయవాడలో కన్నుమూసారు.

-కళాసాగర్ 

(పైన ఫోటో నేను రచించిన ‘ఆంధ్రకళాదర్శిని ‘ పుస్తకాన్ని 2004 లో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఆవిష్కరిస్తున్న దృశ్యం.)

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link