చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

నా చిన్నతనంలో పెద్దవాల్లనుండి అప్పుడప్పుడూ నేను వినే ఒక మాట ఇది. పూర్వం సత్యలోకం అనే ఒక విశిష్టమైన లోకం వుండేదని, ఆ లోకంలో వున్న మనుషులందరూ నీతి నియమాలతో పాటు గొప్ప మానవతా విలువలను కలిగి వుండే వారని, అంతే గాక ఎంతటి అసామాన్యమైన ప్రతిభా పాటవాలు కలిగి వున్నప్పటికీ వారు అతి సామాన్యులవలె వుంటూ తోటి వ్యక్తుల పట్ల ఎంతో ప్రేమ, దయ, ఆదరాభిమానాలను కలిగి వుండేవారని వారి భందాలకు కొలమానంగా ధనిక పేద అనే భేదం కాకుండా కేవలం నీతి నిజాయితి ప్రేమాభిమానాలు మాత్రమే వుండేవని సకల జీవరాశిని ఆధరంతో చూసేవారని పూర్వం పెద్దలు చెప్పగా వినడం నాకు గుర్తు..

అడుగడుగునా స్వార్ధం నిండిన నేటి కాలంలో కించిత్ ప్రతిభకే కొండంత ప్రచారం చేసుకుంటూ తోటి మనుషులను తక్కువగా చూసే నేటి లోకంలో కూడా అలనాటి సత్యకాలపు మానవతా విలువలు పుణికి పుచ్చుకున్న వ్యక్తులు మనకు తారస పడితే నిజంగా ఆశ్చర్యపడడం ఒక ఎత్తైతే అలాంటి గొప్ప వారితో స్నేహం ఏర్పడడం వారితో కలిసి కాసేపైనా మాట్లాడే అదృష్టం మనకు దక్కితే అంతకంటే గొప్ప వరం వేరే ఏమైనా వుంటుందా…? అలాంటి అరుదైన వ్యక్తులు నేటికి ఒకటీ అరా నేటి సమాజంలో కనిపించడం గొప్ప విశేషమైతే అలాంటి విశిష్టమైన వ్యక్తులలో ఒకరు శీలా వీర్రాజుగారు, వారు గొప్పరచయిత, కవి, చిత్రకారులు, బహువిదమైన కళాకోవిదులు. అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. వారి ఇంటినే ఒక మ్యూజియంగా మార్చిన గొప్ప కళాభిమాని, జీవితకాలం తాను సృజియించిన చిత్రకళా ఖండాలను ఇటీవలనే తాను పుట్టిన రాజమహేంద్రవరం లోని దామెర్లరామారావు స్మారక చిత్రకళా ప్రదర్శన శాలకు ఉచితంగా ఇచ్చేసిన గొప్ప వితరణ శీలి. అలాంటి గొప్ప కళాకారుడు అయిన శీలా వీర్రాజు గారు ఇటీవలనె (01-06-2022) ఇహ లోకం నుండి పరలోకానికేగడం నిజంగా చిత్రకళా సాహితీ లోకానికి గొప్ప తీరని లోటు. ఈ సందర్భంగా వారి స్మృత్యర్ధం వారిచిత్రకళా సాహితీ ప్రస్తానం గురించి స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

artist Seelavi

బంధాలు ఏర్పడతాయి మనుషులమధ్య రెండు రకాలుగా. అవి ఒకటి ప్రత్యక్షంగా, రెండు పరోక్షంగా, వీటిలో పరోక్షం నుండి ప్రత్యక్షంగా మారే బంధాలు కొన్నైతే, ప్రత్యక్షంగా మొదలై రాను రాను పరోక్షంగా మారిపోయే భంధాలు మరికొన్ని. ఇందులోరెండవ రీతి భందం కంటే మొదటి రీతిలో ఏర్పడ్డ భందంలో ఘాడత ఎక్కువ వుంటుంది. నాకు శీలావి గారికి మధ్య ఏర్పడ్డ భంధం ఇలాంటిదే. ఆటో మొబైల్ రంగం అంతగా అభివృద్ధి కాని తొలి రోజుల్లో సరుకు రవాణాకు ప్రధాన మార్గం నీటి మార్గాలే. రాజమండ్రికి (40) కిలో మీటర్ల దూరంలో గల గోదావరీ పరీవాహక ప్రాంతమైన మా వూరు కందులపాలెం వెంబడి సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడి పుణ్యమా అని ప్రవహించే రెండు కాల్వల వెంబడి, ఇసుక, సిమెంట్, ఇనుము తదితర సామాన్లను మనుషులు లాక్కుంటూ గమ్యానికి చేర్చే దృశ్యాలు ఇప్పటికి ఓ యాబై ఏళ్ళ క్రితం మాకు సర్వసాధారణ ద్రుశ్యాలే. బాల్యంలో ప్రత్యక్షంగా చూసే ఆలాంటి కమనీయ దృశ్యాలను ఒక చిత్ర రూపంలో చూస్తే మనసుకు హత్తుకోకుండా ఎలా వుంటుంది?నా చిన్నతనంలో నాటి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ముఖచిత్రంగా “యేటి కెదురు” అన్నపేరుతో అచ్చ్చయిన అలనాటి ఆ దృశ్యాన్ని చిత్రరూపంలో చూసినప్పుడు నాకు నిజంగా అలాంటి సుందరమైన అనుభూతే కలిగింది. అప్పుడు ఆ చిత్రకారుడేవరో నాకు తెలియదు . ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆ చిత్రాన్ని సృష్టించింది శీలా వీర్రాజుగారనే విషయం తెలుసుకుని హైదరాబాద్ లో ఒక ఆర్ట్ మ్యూజియంలా వున్న వారి ఇంటిలో వారిని, వారి కుటుంభాన్ని స్వయంగా కలిసి ప్రత్యక్షంగా అలనాటి ఒరిజినల్ చిత్రంతో పాటు వారి కుంచె సృష్టించిన మరెన్నో చిత్రాలను చూసినప్పుడు నేను పొందిన అనుభూతి నిజంగానే ఒక అనిర్వచనీయం. కారణం వారి చిత్ర సాహిత్య కళా సంపద ఒకటైతే, ఎనబై ఏళ్ళ వయసులోనూ వారు తన కంటే ఎంతో చిన్నవాడినైన నా పట్ల వారు చూపిన ఆదరణ నిజంగా అబ్బురమనిపించింది.

లలితకళలలో విశిష్టమైన చిత్రకళ, సాహిత్య కళలు రెండింటా కూడా సమాన స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన శీలావీర్రాజుగారు కళల కాణాచి అయిన రాజమహేంద్రవరంలో ఎలాంటి కళా నేపధ్యం లేని ఒక మధ్య తరగతి కుటుంభంలో 1939 ఏప్రిల్ 22న జన్మించారు. అయితే ఊరికి నీటి అంచుగా వున్న గోదావరి అందులో నాడు నిత్యం తూగుటుయ్యాల వూగే పడవలు, రాజ హంసల్లా సాగే లాంచీలు, నదికి ఆవల ఉభయ సంధ్యల్లో పరుచుకునే రంగులు చిన్నతంలో శీలావిగారిలోని చిత్రకారున్ని మేల్కొలిపాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజమహేన్ద్రిలోనే ఉన్న దామెర్ల రామారావు స్మారక చిత్ర కళాశాల నందలి ప్రఖ్యాత చిత్రకారులు ఆచార్య వరదా వెంకట రత్నంగారి శిష్యరికంలో చిత్రకళలో మెలకువలు నేర్చుకున్నారు ఆ తర్వాత తనదైన కృషితో దానికి మరింత పదును పెట్టి తనదైన చిత్రకళాలోకాన్ని సృస్టించుకున్నారు

చిత్రకళ పై ఒక నిర్దిష్ట అభిప్రాయం కలిగి వున్న వ్యక్తి శీలా వీర్రాజుగారు. చిత్రించే వస్తువు సాంప్ర దాయకమైనదైనా ఆధునికమైనదయినా లేదా ఆబ్ స్త్రాక్ట్ రూపమైనా సామాన్యుని అవగాహనా పరిధికి లోబడి వుండాలనేది శీలా వీర్రాజుగారి సిద్ధాంతం. ప్రజా జీవన రీతులకు అద్ధం పట్టడానికి నేటి ఆధునిక యుగంలో కనుమరుగౌతున్న సామాజిక జీవన రీతులను ప్రజల కళ్ళెదుట నిలపడానికి వీరు ప్రయత్నం చేసారు. అందుకే ఆరున్నర దశాబ్దాల చిత్రకళా యానంలో వారు సృష్టించిన ప్రతీ చిత్రం కూడా సమాజ జీవనానికి దర్పణం పట్టేలా వుంటాయి వీరి చిత్రాలు. సంస్కృతిని వ్యక్తం చేసేలా వుంటాయి. తరతరాల మన ససాంప్రదాయాలను మన కళ్ళెదుట నిలబెడతాయి అందుచేతనే వీరి చిత్రాలు పండితులైన పామరులైన ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేలా వుంటాయి. కారణం వీరు ఎంచుకున్న శైలి, సబ్జెక్ట్, రచనా సంవిధానం అని చెప్పవచ్చు.

ఉదాహరణకు తాను సమాచార శాఖలో వుద్యోగం చేస్తున్నకాలంలోనే 1970 లలో సెలవు రోజుల్లో శిల్ప చిత్రకళల పట్ల ఆసక్తి తో మన రాష్ట్రంలో లేపాక్షిని దర్శించి అక్కడ శిల్పాలకు చిత్రాలకు నకళ్ళు తన స్కేచ్ బుక్ లో గీసుకుని వాటిని శిల్పరేఖ పేరుతో అచ్చువేసిన రేఖా చిత్రాలన్నీ అంతరించిపోతున్న లేపాక్షి చిత్ర శిల్ప కళారీతులను మనకు చూపిస్తాయి. అలాగే అజంతా బేలూరు హలిబీడు, కోణార్క్ ఎల్లోరా తదితర ప్రాంతాలలోని శిల్పరీతులను వారు రేఖాచిత్రాలుగా మలిచి మనకు అందించడం వెనుక వారికి ఎంతటి చారిత్రక అవగాహన సాంస్కృతిక పరమైన ఆలోచన వుందో మనకు అర్ధం అవుతుంది .

మారుతున్న కాలంలో ప్రజల జీవన విధానంలో ఆచార వ్యవహారాలలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్న క్రమంలో అంతరించిపోతున్న అలనాటి ఎంతో విశిష్టమైన జీవన రీతులను భావి తరాలకు చూపించే ప్రయత్నంలో బాగంగా వీరు వందకు పైగా తైల వర్ణ చిత్రాలు వేయడం జరిగింది.

ఆటో మొబైల్ రంగం అంతగా అభివృద్ధి కాని నాటి కాలంలో నీటి గుండా సాగే నాటి రవాణా వ్యవస్థను ఏటి కెదురు అన్న చిత్రం తెలియజేస్తే, ఆర్టిసి బస్ స్టాండ్ లు లేని కాలంలో బస్ లు ఆగే ప్రదేశాలు ఎలావుండేవో అప్పటి వాతావరానాన్ని “బస్సు కోసం నిరీక్షణ “అన్న చిత్రంలో చూడవచ్చు. అలాగే పేరంటానికి, వామన గుంతలు, తల్లి మురిపెం, స్టొరీ టెల్లర్, ఒప్పులకుప్ప వయ్యారిభామ, పిండి దంచడం, చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ, ముంగిట ముగ్గు, నాగుల చవితి లాంటి ఎన్నో చిత్రాలు నేటి తరం మరచిపోతున్న నాటి మన సాంప్రదాయాలకి అద్ద్ధం పడతాయి

అలాగే శ్రమ జీవులు, కుమ్మరి, కమ్మరి మేదరి, బార్బర్ ,ఫ్రూట్ మార్కెట్, వరినాట్లు లాంటి ఎన్నో చిత్రాలలో ఒకనాటి సమాజంలోని ప్రజా జీవన రీతులను వివిధ వృత్తులలో గల జీవన వైవిధ్యాన్ని వీరు ఎంతో చక్కగా చిత్రించడం జరిగింది

అలాగే శకుంతల, వీర శైవ ప్రవక్త శ్రీపతి పండితుడు లాంటి చిత్రాల ద్వారా మన పురాణ ఇతిహాసా గాదలకు కూడా వీరు తన కుంచెతో రూప కల్పన చేసారు. వీటిని నేడు హైదరాబాదు నందలి తెలుగు విశ్వవిద్యాలయంలో చూడవచ్చు.

సాహిత్యకారుడిగా ఎన్నో పుస్తకాలు వెలువరించిన వీరు చిత్రకారుడిగా కూడా శిల్పరేఖ, శీలా వీర్రాజు చిత్రకారీయము, కుంచె ముద్రలు అనే మూడు చిత్రకళా గ్రంధాలను వెలువరించడం జరిగింది. ఈ క్రమంలో చివరిగా వేసిన మూడవ పుస్తకంలో వారి చిత్రాల గురించి విశ్లేషణా వ్యాసం రాయమని నన్నుకోరినప్పుడు ఆ వ్యాసం రాసే సందర్భంలో వారియొక్క చిత్రాలను పరిశీలించడం జరిగింది .ఆ పరిశీలనలో వీరి చిత్రాలు నాకు ఏడు విభాగాలుగా నకనిపించాయి అవి

Sramaikulu by artist Seelavi

సాంప్రదాయక చిత్రాలు,
శ్రమైక జీవన సౌందర్య చిత్రాలు,
మనోధర్పణ చిత్రాలు,
పౌరాణిక చిత్రాలు,
ప్రకృతి చిత్రాలు,
నిశ్చల చిత్రాలు,
రేఖా చిత్రాలు,

ఇంకా వీరు సమాచార శాఖలో ఉద్యోగం చేస్తూ వివిధ పుస్తకాలకు వేసిన వేలాది ముఖ చిత్రాలను తీసుకుంటే ఎనిమిదో రకం కూడా అవుతుంది

వీరి చిత్రాల్లో తైలవర్ణ చిత్రాలే అధికంగా చూస్తాము. సాధారణంగా వర్ణ చిత్రాలు అనే సరికి రంగుకి అధిక ప్రాధాన్యం వుండి రేఖలకు తక్కువ ప్రాధాన్యత వుంటుంది. కాని శీలావిగారి చిత్రాల్లో రంగులకంటే రేఖలకే అధిక ప్రాధాన్యం కనిపిస్తుంది.. ఒక చిత్రాన్ని లేదా ఒక భావాన్ని రంగుల్లో వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు ఆ భావం తాలూకు రూపాన్ని తొలుత రేఖలతో కచ్చితమైన రూపాన్ని వీరు రూపొందించిన తదుపరి ఆ రేఖల మధ్య ఆ భావానికి సరితూగే రంగులను నింపి ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారు. అందుచేతనే వీరి చిత్రాల్లో భావ వ్యక్తీ కరణ అనేది రంగుల్లో కంటే రేఖల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది.

ఉదాహరణకు వీరి స్టోరీ టెల్లర్, తారంగం తారంగం, ఒప్పుల కుప్ప వొయ్యరి భామ, బడుగు జీవులు, దీర్గాలోచని., మంగళ సూత్ర ధారణ, సుఖనిద్ర, చంటాడికి తలంటి స్నానం, పేరంటానికి పిలుపు, తల్లి మురిపెం, లాంటి ఎన్నో చిత్రాలలో కూర్చిన వ్యక్తుల మోముల్లో ఆ భావ వ్యక్తీకరణను మనం ఎంతో స్పష్టంగా చూస్తాము .

శీలా వీర్రాజుగారి చిత్రాలు బాగా పరిశీలించినట్లయితే మరొక విచిత్ర మైన రీతి మనకు కనబడుతుంది వీరు 1960 కి ముందు జలవర్నాల్లో వేసిన రంగుల రాగాలు, కొడగట్టిన సూరీడు, వర్ష ప్రకృతి, సూర్య ప్రతాపం, పుష్ప విలాపం లాంటి చిత్రాలు ఎంతో ఆధునికంగా వుంటే నేటి ఆధునిక కాలంలో ఇటీవల వేసిన చిత్రాలు చాల సాంప్రదాయకంగా వుండడం వారి ఆలోచన రీతిలో వొచ్చిన మార్పుకు సంకేతంగా మనం భావించవచ్చు.

artist Seelavi

చిత్రకళలో తన తొలి గురువైన వరదా వెంకట రత్నం గారివలేనే ఎంతటి ప్రతిభ వున్నప్పటికీ ఎలాంటి డాంబికం ప్రదర్శించని గొప్ప నిగర్వి, స్నేహశీలి శీలావీర్రాజుగారు. అందుకు ఉదాహరణ తన ప్రాణ మిత్రుడైన మాదేటి రాజాజీ గారికి తనకు సాహిత్య అకాడమి అవార్డు తెచ్చిపెట్టిన గొప్ప నవల “మైనా” ను అంకితమిచ్చి తన యొక్క గొప్ప స్నేహభావాన్ని చాటుకున్నారు. రాజాజీగారు మరణించినప్పటికీ ఆ వాత్సల్యాన్ని నేటికి రాజాజీగారి అన్నగారి అబ్బాయి రవి ప్రకాష్ తో కొనసాగిస్తున్న గొప్ప వ్యక్తి శీలావీర్రాజుగారు.

సాహిత్య పరంగా ముప్పైకి పైగా గ్రంధాలు రచించిన వీరు “పడుగు పేకల మధ్య జేవితం అనే పేరుతో తన ఆత్మ కథను “ఇంతవరకు ఎవ్వరూ రాయని రీతిలో కవితాత్మకంగా రాసిన తీరు నిజంగా అద్భుతం అని అనిపిస్తుంది. నేను ఇటీవలనే ఆ గ్రంధాన్ని చదవడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .

శీలావిగారి శ్రీమతి సుభద్రా దేవిగారు కూడా గొప్ప రచయిత్రి కుమార్తె పల్లవి కూడా చక్కటి చిత్రాలు వేసారు గత సంవత్సరమే యాదృచ్చికంగా వారి ఇంటిని నేను సందర్శించడం జరిగింది నిజంగా చిత్ర శిల్ప కళాఖండాలు సాహిత్య గ్రంథాలతో ఎంతో కళాత్మకంగా వున్నవారి ఇల్లు వారి ఆప్యాయత నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. జీవితాన్ని ఇంత గొప్పగా కళామయం చేసుకున్న గొప్ప కవి, చిత్రకారులు, గొప్ప సౌజన్య శీలి అయిన శీలా వీర్రాజుగారు ఇటీవలనే ఈ ఏటి శిఖామణి సాహితీ పురస్కారం అందుకోవడం కూడా జరిగింది. అలాగే తన జీవితకాలంలో వారి కుంచె సృష్టించిన కళాఖండాలనన్నింటినీ తన జన్మస్థానమయిన రాజమహేంద్రవరము నందలి ప్రఖ్యాత దామెర్ల రామారావు స్మారక చిత్ర కళాశాలకు ఉచితంగా అందజేసిన గొప్ప వితరణ శీలి. ఇంతటి గొప్ప ఆదర్శ కళాకారులు మననుండి శాశ్వతంగా దూరం కావడం చిత్ర సాహితీ లోకానికి ఎంతో తీరని లోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం .

వెంటపల్లిసత్యనారాయణ

writer Ventapalli with Seelavi family

1 thought on “చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

  1. ప్రముఖ చిత్రకారుడు కీర్తి శేషులు శీలా వీర్రాజు గారిగురించి శ్రీ వెంటపల్లి సత్యనారాయణ గారు వ్రాసిన ఆర్టికల్ ఎంతో సమగ్రంగా, ఆసక్తి కరంగా, స్ఫూర్తిదాయకంగా వుంది. వారిచిత్రాలతో ఒక పుస్తకం తేవాల్సిన అవసరం ఎంతో వుంది. శ్రీ వెంటపల్లి గార్కి, మీకూ అభినందనలు. Bomman, Artist &Cartoonist,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap