యువ కథకులలో ఇటీవల గుర్తింపు పొందిన కథకుడు వెంకట్ సిద్దారెడ్డి. రాయడం నా దైనందిన చర్యలో ఒక భాగం అంటూ … సినిమా రంగంలో కథకుడిగా, దర్శకుడిగా తన స్థానాన్ని వెతుక్కునే పనిలో వున్నారు. వెంకట్ సిద్దారెడ్డి కలం నుండి వెలువడిన సరి కొత్త రచన ఈ ‘సోల్ సర్కస్ ‘ పుస్తకం.
మనుషుల మధ్య అడ్డుగీతలు ఇంకా ఈ సమాజాన్ని వెంటాడుతున్నాయి. లోపం ఎక్కడ ఉంది? సరి చేయాలంటే ఎంత వెనక్కి వెళ్లాలి? ఏండ్ల కిందటి ఈ వ్యవస్థను ఏం చేయాలి? ఇప్పుడున్న మనుషులు మారితే చాలా?… ఇలాంటి ప్రశ్నలు స్పురించే సన్నివేశాలే కనిపిస్తాయి ‘సోల్ సర్కస్’లో. ‘వెలివేతకు గురైన రిసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య, కుల దురహంకారం కారణంగా సోదరి ప్రేమను తన మిత్రుడికి దక్కనివ్వని ఓ ప్రాణ స్నేహితుడు, ఆ ప్రేమను గెలవనివ్వకుండా ఇద్దరినీ చంపిన తండ్రి, న్యాయానికి నోచుకోని ఓ మైనారిటీ వ్యక్తి, ప్రేమనే ప్రేమగా ప్రేమించి ఓడిపో యాడా ? అనిపించే మరో ప్రేమికుడు’… ఈ కథ లన్నీ ప్రవాహంలా పాఠ కులను కదిలిస్తాయి. వీటిలో వేధించే జ్ఞాప కాలు, బాధించే అనుభవాలూ ఉన్నాయి. అన్ని కథల్నీ ఏకసూత్రత ఏదో కలుపుతున్నట్టు అనిపిస్తుంది. కథలను విడివిడిగా కాకుండా, ఒక సంపుటిగా చదువుతున్నప్పుడు ఆ థీమ్ మనసును మెలిపెడుతుంది. మరి ఇది రియలిజమా?
మెలోడ్రామానా? లేక రియలిజంతో కూడిన మ్యాజిక్ మెలోడ్రామానా? ఏమో మీరే చదివి చెప్పండి.
-వినోద్