
‘దుర్గాపురం రోడ్డు ‘ ఒక విభిన్నమైన ఒక వినూత్నమైన శీర్షిక. పాటకున్ని వెంటనే తనలోకి ప్రయాణించేలా చేస్తుంది. ఒళ్ళంతా వెయ్యి గాయాలైన వెదురే వేణువై మధుర గానమాలపిస్తుంది. అసహ్యకరమైన గొంగలిపురుగు తన శరీరాన్ని ఛేదించుకుని సీతాకోకచిలుక రంగుల రెక్కల గానం వినిపిస్తుంది. గుండెలోతుల్లో గుచ్చుకొన్న గాయాల నుండే కవి తన అక్షరాల డమరుకాలను మోగిస్తాడు. అలాంటి కవే దేశరాజు గారు. ఒకేఒక్క ‘సామూహిక స్వప్నావిష్కరణ ‘ కవితా సంపుటితో తెలుగు కవిత్వ రంగంలో ప్రవేశించిన వీరు, రెండు దశాబ్దాల తర్వాత ప్రచురించిన కవితా సంపుటి దుర్గాపురం రోడ్డు.
ప్రజాస్వామ్య ముసుగులో నియత్రుత్వం రాజ్యం చేస్తున్నప్పుడు ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నప్పుడు కవిత్వం జమ్మిచెట్టు లో దాసిన అక్షరాయుధాలను పైకి తీస్తాడు. పాఠకుల పట్ల ప్రతిఘటనా స్వరము అవుతాడు. ‘రాజ్యమా ఉలికి పడు ‘ లో రాజ్యం కౄర స్వభావాన్ని ఎండగడతారు. ఛీ స్వప్న ఫలాన్ని మరీ మర్మాంగం స్థాయికి దిగజార్చేస్తవనుకోలేదు. కలలు కనమనే చెప్పాం కానీ నువ్వు నిర్దేశించావ్ అంటారు. ప్రజల కలల మీద కూడా పెత్తనం చేసే రాజ్యం దుర్మార్గ స్వభావాన్ని బొమ్మ కట్టిస్తారు.
కొత్త సాహసం కూడా ఇలాంటి కవితే,
ప్రభుత్వం ఇప్పుడు దేశభక్తి మంత్రాన్ని జపం చేస్తుంది.
దీని గురించి సర్వరోగ నివారిణిలా దేశభక్తిని ప్రమోట్ చేస్తాడు..! అంటూ
ప్రజలందరూ తిరగబడాలి అంటూ కప్పి పుచ్చుకున్న తప్పులన్నిటికీ
కొత్తగా ఖరీదు కట్టే సాహసం చేద్దాం …
అని కాషాయ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఘటించ మంటారు. కవి జీవిక కోసం నగరానికి వచ్చినా తన మూలాల్ని మర్చిపోలేదు. అక్కడ ఏ అరాచకం జరిగినా ఇక్కడ స్పందించడం మానలేదు. ఉత్తరాంధ్రలో బాక్సైట్ కోసం ప్రభుత్వం కొండల్ని తవ్వుతున్నప్పుడు కవి అన్యాయాన్ని సహించలేదు.
ఉత్తరాంధ్రలో మళ్ళీ అగ్గి రాజుకుంటోదట
వస్తరా, నివురు ఊదడానికైనా నోళ్లు తెరుద్దాం ..!
అని యుద్ధం పుట్టినంట లో కవి ఆక్రోశిస్తారు.
ఉన్న ఊరును, కన్న తల్లిని వదిలి వేరే ఊరికి వెళ్లడం ఎవరికైనా ఎంత నరకమో తీరని దుఃఖమో అది అనుభవించే వారికి తెలుస్తుంది. అన్నం పెట్టని ఊరి నుంచి నగరాలకు తరలి వస్తారు. విశాలమయిన వీధులతో, వివిధ సౌకర్యాలతో ఉన్నా నగరం సొంత ఇల్లు అవదు. నగరం వారికి విడిది లాంటిదే. దీన్నే నగర హృదయపు ఔదార్యం ఎంతగొప్పదయినా అనుభందం ఎంతగా పెనవేసుకొన్నా అతిథి ఎప్పుడూ విడిది సొంతం కాదు ‘ అని నగ్న సత్యాన్ని ‘విడిది ‘ కవితలో చెప్పారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో మనదేశం పురోగమించినా ఎప్పటికీ కులమత బేధాలు నశిచవు. మనది లౌకిక ప్రభుత్వంమని చెప్పుకుంటారు గాని బాబ్రీ మసీదు ఘటనలు, గోద్రా ఘటనలు ఇక్కడే జరిగాయి. ఈ ఘటన గురించి ‘వీధి కుక్క దుక్క గీతం ‘లో
పరమతాన్ని సహించక పోవడమే లౌకికవాదమని
నెత్తురు చేతులను కాపాడుకోవడమే అభివృద్దని గోదా గొంతు నిలదీసింది,
కానీ ఎందుకనో ఓటర్లెవ్వరికీ వినబడలేదు అని
ప్రభుత్వ మతతత్వాన్ని నిరసిస్తారు.
ఈ కవితా సంపుటిలో సామాజిక కవితలే కాకుండా ప్రకృతి, ప్రేమ, పిల్లల గురించి రాగ రంజితమయిన కవితలు వున్నాయి. పచ్చివాసన లో చిన్నప్పటి ప్రేమ గురించి…
” జాడ తెలియని ఆనాటి మేఘమాలే
జాలిగా మల్లీ మల్లీ వర్షిస్తూనే ఉంది, నాకోసం
అని అచ్చమైన ఆనాటి ప్రేమ పరిమళాన్ని తలపోస్తారు.
గాలిపటాన్ని పట్టుకుని నిద్రపోతున్న పసిపాపను ‘పతంగం ‘ కవితలో మన కళ్ళముందు బొమ్మకట్టిస్తారు.
దుర్గాపురం రోడ్డు పల్లె నుంచి నగరానికి వలస వచ్చిన ఒక ఆధునిక మానవుని జీవన ప్రయాణం. తాను నివసిస్తున్న దేశంలోని సమస్యలకు ప్రతిస్పందిస్తూ అనుక్షణం జీవన పోరాటం చేస్తున్న ఒక బుద్ధి జీవి అంతరంగాలాపన. కవి తన కవిత్వాన్ని ఒక ఆలంబనగా ఆకారం దిద్దుకునే అక్షరాలివి.
ఈ సంపుటిలోని కవితలన్నీ చదివింపచేస్తాయి. రాజ్యహింసను ప్రతిఘటించే కవితలు నిప్పురవ్వలను వెదజల్లితే, మానవ జీవాలను, భావాను వ్యాఖ్యానించిన కవితలు హృదయానికి నెమలి ఈకలు హత్తుకున్నంత మెత్తగా ఉంటాయి. యానాం ప్రేయసి, ఆరంజ్ రాగా, దుర్గాపురం రోడ్డు, మనదైనది… ప్రణయ కవితలు ప్రేమ ఉయ్యాల ఊగిస్తాయి. ముఖపత్ర శీర్షిక 2 దుర్గాపురం రోడ్డు ‘ చిన్నప్పుడు కవి ప్రేమించిన అమ్మాయి దుర్గాపురం స్టేషన్ లో కనిపిస్తుందా… లేదా అనేదే ఇతివృత్తం. ప్రవాహ శైలి లో కవితలన్నీ మనస్సు మీద గాఢ ముద్ర వేస్తాయి.
అనుభవాలు, అనుభూతులు అందరికి వుంటాయి. చేయితిరిగిన కవే వాటిని కవిత్వాన్ని చేయగలడు. అలాంటి కవిత్వ మర్మం తెలిసిన ఈ కవి తన కవిత్వ ప్రయాణాన్ని ఆపకూడదని, నిరంతరం సాగుతుండాలనిఆకాంక్షిస్తున్నాను.
-మందరపు హైమవతి
దుర్గాపురం రోడ్డు
దేశరాజు కవిత్వం
వెల: రూ. 100/-
ప్రతులకు: 99486 80009
very nice review andi .the title of the book is also very intresting to readers the way of review is so nice congratulations to desiraju garu and hymavathi garu for her good review
Very good review.