మూకీ సినిమాలు ప్రదర్శితమౌతున్నంత కాలం అవి ఏ భాషా చిత్రాలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ వెండితెరమీద మాట్లాడే బొమ్మలు కనిపించడం మొదలైన తరవాత నుంచి ఆ పరిస్తితి మారింది. టాకీ సినిమాలు వచ్చాక అవి ఏ భాషా చిత్రాలో అనే విషయాన్ని వర్గీకరించడం మొదలైంది. అలా తొలి టాకీగా 1931 లో తయారైన ‘ఆలం ఆరా’ సినిమా రికార్డులకెక్కింది. ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత ఆర్దేషిర్ ఇరానీ నిర్మించిన ఈ చిత్రం తరవాత మరో ఏడు నెలలకు గాని దక్షిణాదిన టాకీ చిత్రం రాలేదు. 1931 అక్టోబర్ 31 న తమిళ-తెలుగు సమ్మిళితమైన ‘కాళిదాస్’ చిత్రాన్ని ఆర్దేషిర్ ఇరానీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో నిర్మించి విడుదల చేశారు. ఇందులో నటించిన రాజలక్ష్మి తమిళంలోనూ, వెంకటేశన్ తెలుగులోనూ, ఎల్.వి. ప్రసాద్ హిందీ లోను సంభాషణలు పలికారు. అందుకే ‘కాళిదాస’ చిత్రాన్ని తొలి తమిళ టాకీ అనేదానికన్నా, తొలి భారతీయ బహుభాషా చిత్రం అని వ్యవహరిస్తే బాగుంటుందని సినీ పండితులు అభిప్రాయపడ్డారు. అయితే పూర్తి తెలుగు సంభాషణలతో వచ్చిన తొలి టాకీ చిత్రంగా హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఆర్దేషిర్ ఇరానీ నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’ సినిమానే చెప్పుకోవాలి. ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ తరఫున ఆర్దేషిర్ ఇరానీ నిర్మించిన ఈ సినిమా భారత్ మూవీటోన్ బ్యానర్ మీద నిర్మించగా కృష్ణా ఫిల్మ్ కంపెనీ ఫిబ్రవరి 6, 1932 న బొంబాయి నగరంలో విడుదల చేసింది. ఇందులో హిరణ్యకశిపుడుగా మునిపల్లె సుబ్బయ్య (వల్లూరు వెంకట సుబ్బారావు), లీలావతిగా సురభి కమలాబాయి, ప్రహ్లాదుడుగా మాస్టర్ కృష్ణారావు షిండే, దేవేంద్రుడుగా దొరస్వామి నాయుడు, మొద్దబ్బాయిగా ఎల్.వి. ప్రసాద్, చండామార్కులుగా చిత్రపు నరసింహారావు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రహ్లాద పాత్రపోషించిన కృష్ణారావుకు అప్పుడు కేవలం 9 సంవత్సరాలు. 108 నిమిషాలపాటు నడిచిన ఈ సినిమాకు గోవర్దన్ భాయ్ పటేల్ ఛాయాగ్రాహకునిగా పనిచేయగా, హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. తెలుగు టాకీ 89 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు…
ఆరోజుల్లో పౌరాణిక నాటకాలకు విపరీతమైన ప్రేక్షక ఆదరణ వుండేది. అందుకే తొలి టాకీ చిత్రానికి ప్రజాదరణ పొందిన ‘భక్త ప్రహ్లాద’ పౌరాణిక నాటకాన్ని కథావస్తువుగా ఎంపిక చేశారు. అప్పటికి దక్షిణాదిన దాదాపు 19 రకాల ప్రహ్లాద నాటకాలు ప్రదర్శితమవుతూ వుండేవి. అయితే వాటిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకానికి మంచి పేరు వుండేది. ఈ నాటకాన్ని సురభి నాటక సమాజం వారు విస్తృతంగా ప్రదర్శిస్తూ వుండేవారు. సురభి నాటక సమాజంలోని కుటుంబ సభ్యులే పాత్రధారులుగా, రంగస్థల నటనే జీవనాధారంగా చేసుకుంటూ పల్లెలు, పట్టణాలకు వెళ్ళి కొన్నిరోజులు అక్కడే మకాం పెట్టి వివిధ పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ జీవనం గడుపుకుంటూ వుండేవారు. హెచ్.ఎం. రెడ్డి తన ప్రణాళికను సురభి కంపెనీ అధినేతలు గోవిందరావు, చిన్నరామయ్య ముందుంచి సురభి బృంద సభ్యులను ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నటించమని కోరారు. ఈ విషయంలో నాటక కర్తగా వ్యవహరిస్తున్న సి.ఎస్. ఆర్ ఆంజనేయులు సురభి వారిని ఒప్పించి, వారి బృందాన్ని మొత్తం బొంబాయి తీసుకొని వెళ్లారు. రామకృష్ణమాచార్యులు రచించిన నాటకంలోని సంభాషణలను, పద్యాలను ఈ చిత్రానికి యధాతధంగా వాడుకున్నారు. చందాల కేశవదాసు చేత కొన్ని పాటలు రాయించి పాత్రధారులచేతనే వాటిని పాడించారు.
రోజుకి దాదాపు 20 గంటలు షూటింగ్ జరిపేవారు. విషాద సన్నివేశాలకోసం గ్లిసరిన్ వంటివాటిని వాడలేదు. నటీనటులకు మూడ్ వచ్చేదాకా ఆగి చిత్రీకరణ జరిపారు. సినిమా షూటింగ్ మొత్తం 18 రోజుల్లోనే పూర్తిచేయగలిగారు. పద్దెనిమిది వేలరూపాయల వ్యయంతో నిర్మించిన ‘భక్త ప్రహ్లాద’ సినిమా 9,762 అడుగుల నిడివితో సిద్ధమైంది. ‘ఆలం ఆరా’ చిత్రం కోసం నిర్మించిన ఇంపీరియల్ స్టూడియో లోని సెట్టింగులనే ‘భక్త ప్రహ్లాద’ సినిమా చిత్రీకరణకోసం వాడుకున్నారు. హీరోయిన్ గా నటించిన కమలాబాయికి అప్పుడు పద్దెనిమి ఏళ్ళు. ఆమెకు పారితోషికంగా 500 రూపాయలు, మాస్టర్ కృష్ణారావుకు 400 రూపాయలు పారితోషికంగాఇచ్చారు. కమలాబాయి నటనకు ప్రేక్షకులనుంచి మంచి స్పందనరావడంతో ఆర్దేషిర్ ఇరానీ మరో వెయ్యిన్నూట పదహార్లు బహుమానంగా ఇచ్చి పంపించారు. ఎవరి పద్యాలు, పాటలు వారే పాడుకోగా హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి హార్మోనియం మీద సంగీత సహకారాన్ని అందించారు. ఫిబ్రవరి 6, 1932 న ‘భక్త ప్రహ్లాద’ తెలుగు సినిమా బొంబాయి లోని న్యూ చార్నీ రోడ్డులో వుండే ‘కృష్ణా సినిమా’ థియేటర్ లో తొలిసారిగా విడుదలైంది. ఆరోజుల్లోనే ఈ సినిమా 75 వేల రూపాయల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్టయింది. రెండువారాల ప్రదర్శన అనతరం ఈ సినిమాను విజయవాడ లోని పోతిన శ్రీనివాసరావుకు చెందిన శ్రీమారుతీ టాకీసులోను, రాజమహేంద్రవరం లోని నిడమర్తి సూరయ్య గారి కృష్ణా సినిమా హాలులోను ప్రదర్శించారు. అలా రెండు నెలల ప్రదర్శన అనంతరం ఏప్రిల్ 2 న మద్రాసు లోని నేషనల్ పిక్చర్ ప్యాలెస్ (న్యూ బ్రాడ్వే టాకీసు) కు మార్చారు. అక్కడ రెండు వారాలు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. రోజుకు రెండు ఆటలు మాత్రమే ప్రదర్శించడంతో టికెట్లకోసం ప్రేక్షకులు హాలు ముందు బారులు తీరేవారు. అయితే ఈ సినిమామీద కొన్ని విమర్శలు రాకపోలేదు. సినిమా ప్రింటు మసక మసకగా అగుపించిందని, సంభాషణలు, పద్యాలు మధ్య మధ్యలో తగ్గుతూ హెచ్చుతూ వినిపించాయని అనుకున్నారు. తొలి టాకీ కావడంతో అటువంటి లోపాలు సహజమేనని ప్రేక్షకులు సర్దుబాటు చేసుకున్నారు కూడా. ‘భక్త ప్రహ్లాద’ సినిమా విజయంతో చిత్తజల్లు పుల్లయ్య, హెచ్.వి. బాబు వంటి ఉద్దండులు తెలుగులో రామ పాదుకాపట్టాభిషేకం, సతీసావిత్రి, శకుంతల, సీతాకళ్యాణం, లవకుశ, అహల్య, శ్రీకృష్ణ తులాభారం, సతీసక్కుబాయి, భక్తకుచేల, సతీఅనసూయ, హరిశ్చంద్ర వంటి అనేక పౌరాణిక చిత్రాలను నిర్మించారు.
రెండవసారి భక్తప్రహ్లాద చిత్రాన్ని శోభనాచల పిక్చర్స్ సంస్థ నిర్మించి జనవరి 30, 1942 నా విడుదల చేసింది. ఇందులోంవేమూరి గగ్గయ్య, రాజేశ్వరి, నారాయణరావు, జి. వరలక్ష్మి నటించారు. మూడవసారి ఇదే చిత్రాన్ని ఏ.వి.ఎం సంస్థ కలర్ లో నిర్మించి 1967 సంక్రాంతి కానుకగా విడుదల చేసి విజయం సాధించింది. కొన్ని వేల రూపాయల టర్నోవరుతో, కొన్ని వేలమందికి ఇప్పుడు ఉపాధికల్పిస్తున్న చలనచిత్ర పరిశ్రమకు పునాది వేసింది ‘భక్త ప్రహ్లాద’ చిత్రమంటే అతిశయోక్తి కాదు.
-ఆచారం షణ్ముఖాచారి