తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.. 4 దిక్కులు కలిస్తే.. ప్రపంచం!
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 4 భాషలు కలిస్తే.. దక్షిణాది సినీ ప్రపంచం!!
దక్షిణాది చలనచిత్ర రంగం మొత్తం భాగ్యనగరానికి తరలి రాబోతున్న రోజు.. దివి నుంచి భువికి దిగివచ్చే తారలందరి మధ్య.. సినీ ప్రేక్షకులందరూ ‘సంతోషం’తో వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు.. ‘సంతోషం’ 17వ వార్షికోత్సవం జరుపుకోబోతున్న రోజు రానే వచ్చేస్తోంది. అదే.. సెప్టెంబర్ 29.
సినీ ప్రియులకు సినిమాల విశేషాలు అందించడంతో పాటు.. నటీనటులకు వారి ప్రతిభకు కొలమానంగా అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ఏకైక తెలుగు సినీ మేగజైన్ ‘సంతోషం’. 2002లో ప్రారంభమైన సంతోషం అవార్డుల ఉత్సవం విజయవంతంగా 17 వసంతాలు పూర్తి చేసుకుని 18వ వసంతంలోకి అడుగు పెట్టింది. సంతోషం మేగజైన్ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న అంగరంగ వైభవంగా ‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్ హెూటల్లో జరగనున్న ఈ వేడుకకు అతిరథమహారథులు తరలి రానున్నారు. ఈ భారీ వేడుకను హెూస్ట్ చేసేందుకు నలుగురు యాంకర్లు రెడీ అయ్యారు. ఉదయభాను, తనీష్ అల్లాడి, తేజస్వి మదివాడ, వెంకట సమీర్ ‘సంతోషం’ అవార్డుల కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించబోతున్నారు. సెప్టెంబర్ 29 ఆదివారం సాయంత్రం 5 గంటలకు వేడుక ప్రారంభం కానుంది.
నాలుగు భాషల ఇండస్ట్రీల నుంచి ఎందరో ప్రతిభ గల నటీనటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు అందుకోనున్నారు. ఈ వేడుకలో పాల్గొని తమ అభిమాన నటీనటులను చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం టికెట్లను బుక్మై షో వెబ్ సైట్ లో పొందుపరిచారు.