విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో రాగతిపండరిగారి వర్ధంతి
20 మంది కార్టూనిస్టుల కార్టూన్లతో “కార్టూన్ల ప్రదర్శన”
19-2-2020 బుధవారం సాయంత్రం నుంచీ విశాఖపట్నం పౌరగ్రంధాలయం మినీ ఏసి హాల్ ప్రాంగణం సాహితీవేత్తలతో, కార్టూనిస్టులతో, కార్టూన్ల ఇష్టులతో కళకళలాడింది. ఆ రోజు కీ.శే రాగతిపండరిగారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభ అధ్యక్షులుగా సత్యమూర్తి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు కార్టూనిస్టు శ్రీ మోదు రాజేశ్వరరావు గారు వ్యవహరించి చక్కగా సభను నిర్వహించారు. ముందుగా రాగతిపండరి గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ సభలో ముఖ్యఅతిథి శ్రీ యస్. శశిభూషణరావు గారు , రిటర్డు డి. యస్. పి. హాజరయి రాజాగారి కార్టూను సంకలనం ” అదేం నవ్వు” పుస్తకాన్ని ఆవిష్కరించారు..అలాగే “కాసేపునవ్వుతారని” పుస్తకాన్ని బి. యస్. రాజు గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకాలు ట్రస్టుతరఫున ప్రచురించారు. సభలో మేడా మస్తాన్ రెడ్డిగారు, పి. రామశర్మగారు కూడా ప్రసంగించి రాగతిపండరిగారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ముందుగా 20 మంది ప్రముఖ కార్టూనిస్టులు వేసిన వందకు పైగా చక్కటి కార్టూన్లతో “కార్టూన్ల ప్రదర్శన” ను NCCF వారు ఏర్పాటుచేశారు. ఆహూతులందరూ ప్రదర్శనను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సభలో పాల్గొన్న కార్టూనిస్టులు అనుపోజు అప్పారావు, బి.యస్. రాజు, జెన్నా, పి. రామశర్మ, దంతులూరి వర్మ, టి. ఆర్. బాబు, సదాశివుని లక్ష్మణరావు(లాల్ ), జగన్నాధ్, పొన్నాడమూర్తి, రాజా, రామారావు, ప్రేమ్, వందన శ్రీనివాస్, యమ్. యమ్. మురళి, రాగతి రమ గార్లను సముచితరీతిలో సత్కరించారు. కార్టూను ప్రదర్శనలో వీరివే కాక ప్రసాద్, కేవియస్, భాను, సుధాకర్, శంబంగి, సీతామహలక్ష్మి గారి కార్టూన్లూ ప్రదర్శించారు. స్టేజి పైన ప్రత్యేకంగా రాగతి పండరిగారి కార్టూన్లను అలంకరించారు. సభ జయప్రదమైనందుకు అందరూ నిర్వాహకులు రాజాగారికి అభినందనలు తెలిపారు.
-లాల్ , కార్టూనిస్టు