సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

(సూపర్ స్టార్ కృష్ణ జీవన ప్రస్థానాన్ని తెలిపే ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….)

అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచలంచలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు ఘట్టమనేని కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టంకట్టి, సినిమాలు నిర్మించి, నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజృంభించి నాలుగు దశాబ్దాలపాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన కృష్ణ, సెల్యూలాయిడ్ కర్షకుడు. ఇన్నేళ్లు గడుస్తున్నా కృష్ణ అనగానే గుర్తుకొచ్చేది సూపర్ స్టార్ హోదా. అటువంటి మేరు నగధీరుడు చలనచిత్రనటనకు విరమణ ప్రకటించినా అభిమానుల హృదయాల్లో సూపర్ స్టార్ గానే స్థిరంగా నిలిచి వున్నాడు. ఈ సూపర్ స్టార్ 14 నవంబర్ 2022 (సోమవారం) తెల్లవారు జామున హృద్రోగ సమస్యతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో తన అభిమాన జనసందోహాన్ని దుఃఖ సముద్రంలో ముంచి తన యనభయ్యవ పడిలో సుదూరంగా పరలోకానికి ప్రయాణం కట్టిన విషయాన్ని అభిమానులు, స్నేహితులు, హితులు జీర్ణించుకోలేక వున్నారు. ఒకసారి ఆ మహా మనీషి జీవన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ అంజలి ఘటిద్దాం.

తొలి రోజుల్లో…

31 మే నెల 1942 న జన్మించిన ఈ బుర్రిపాలెం బుల్లోడు ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో బి.యస్సీ. చదువుతుండగా నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఆ కళాశాల ప్రాంగణంలోనే పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానుల పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తనుకూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంతబాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు కృష్ణ. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి కృష్ణ వారిని కలిసారు. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజా నాట్యమండలిలో చేరి గరికిపాటి రాజారావు సహకారంతో ‘చైర్మన్’ వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి. ప్రసాద్ తనయుడు ఆనందబాబుని కలవమని అతని మామగారు ఇచ్చిన సలహాతో మద్రాసులో కృష్ణ అతనిని కలిసారు. ప్రసాద్ గారు అప్పుడే ‘కొడుకులు-కోడళ్ళు’ అనే సినిమా తీసే ప్రయత్నంలోవున్నారు. కృష్ణని ఆ సినిమాలో ఒక పాత్రకు ఎంపికజేసి, కొంత రిహార్సల్సు కూడా నిర్వహించారు. కారణాంతాలవలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. అప్పట్లో మద్రాసులో సినిమా అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న శోభన్ బాబుతో కలిసి కృష్ణ కొన్ని నాటకాల్లో నటించారుకూడా. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో కృష్ణ ఒక చిన్న పాత్రను పోషించారు. ఒకసారి కొడవటిగంటి కుటుంబరావుతో కలిసి పాండీ బజార్లో వెళ్తున్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో వున్న దర్శకనిర్మాత సి.వి. శ్రీధర్ చూసి, ‘కాదలిక్కనేరమిల్లై’(తెలుగులో ‘ప్రేమించిచూడు’)లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకుంటే, తమిళ భాషరాని కృష్ణకు ఆ అవకాశం చేజారి రవిచంద్రన్ కి దక్కింది. తరవాత కృష్ణ ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ సినిమాల్లో చిన్నపాత్రల్లో కనిపించారు. తెనాలి తిరిగి వెళ్ళాక, 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నట్టు పత్రికాప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు స్పందించి ఫోటోలు పంపిన కృష్ణకు మద్రాసు రమ్మని కబురొచ్చింది. అక్కడ స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను హీరోగా ఎంపిక చేసారు. కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని కూడా తనతోపాటు ఇంటర్వ్యూకి వచ్చినా వారెవరూ ఎంపిక కాలేదు. కృష్ణ అదృష్టవంతుడని చెప్పడానికి ఇదే మంచి దృష్టాంతం. ఆదుర్తి వద్ద కో-డైరెక్టరుగా వున్న కె. విశ్వనాథ్ కృష్ణకి డైలాగులు పలకడంలో, నృత్య దర్శకులు హీరాలాల్ డ్యాన్సు చెయ్యడంలో కఠిన శిక్షణ ఇచ్చారు. ఆదుర్తి తొలి సాంఘిక రంగుల చిత్రం ‘తేనెమనసులు’ కృష్ణని హీరో చేసి నిలబెట్టింది. ఈ సినిమాలో కృష్ణ సరసన సుకన్య, మరొక హీరో రామ్మోహన్ సరసన సంధ్యారాణి నటించగా, 31 మార్చి 1965న సినిమా విడుదలై వంద రోజులాడింది. ఈ సినిమా తరవాత కృష్ణకి ఆరు నెలలు గ్యాప్ వచ్చింది. దాంతో తెనాలి వెళ్ళిపోయారు. ఈ లోగా ఆదుర్తి కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం కృష్ణతో ‘కన్నెమనసులు’ ప్రారంభమైంది. అదే టైంలో బాండ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండడంతో, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ డూండేశ్వరరావు ‘గూఢచారి116’ సినిమాకోసం కృష్ణకు ఆఫర్ ఇస్తూ ఆదుర్తిని సంప్రదించారు. ఆదుర్తి దీవెనలతో ఆ యాక్షన్ చిత్ర అగ్రిమెంటుపై కృష్ణ సంతకం పెట్టి నటించారు. ‘కన్నెమనసులు’ జూలై 22, 1966న విడుదలైతే, ‘గూఢచారి116’ ఆగస్టు 11, 1966న విడుదలై, తొలి స్పై పిక్చర్ కావడంతో దుమ్ము రేపింది. ‘కన్నెమనసులు’ యావరేజిగా ఆడింది. ఈ సినిమా తరవాత కృష్ణ డూండీతో 25 సినిమాలదాకా చేసారు. ‘తేనెమనసులు’ చిత్రానికి కృష్ణ అందుకున్న తొలి పారితోషికం రూ. రెండువేలు. ‘గూఢచారి116’ తరవాత కృష్ణని అందరూ ‘ఆంధ్రా జేమ్స్ బాండ్’ అని పిలవడం మొదలెట్టారు. ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాల్లో బుక్ అయ్యారు. ‘తేనెమనసులు’ సినిమా ద్వారా డైలాగులు చెప్పడం, డ్యాన్సు చెయ్యడం, స్కూటరు, కారు నడపటం, హావభావాలు చక్కగా పలకటం నేర్చుకుంటే, ‘కన్నెమనసులు’ చిత్రం ద్వారా ఈత కొట్టటం, గుర్రపు స్వారీ చెయ్యడం, ఫోక్ డ్యాన్సు చెయ్యడం నేర్చునారు కృష్ణ. ఇక ‘గూఢచారి116’లో స్పీడ్ యాక్షన్ మూవ్మెంట్లు, తుపాకీ వాడకం, ఫైటింగులు చెయ్యడం అలవడింది.

బాపు తో ‘సాక్షి’ గా…

‘గూఢచారి116’ విడుదలైన 100 వ రోజు ఉదయాన విఠలాచార్య సినిమా కృష్ణ తలుపు తట్టింది. ‘ఇద్దరు మొనగాళ్ళు’ అనే జానపద సినిమా అది. కాంతారావుతోబాటు, ‘తేనెమనసులు’ సహనటులు సంధ్యారాణి, సుకన్యలతో కలిసి నటించిన ఈ చిత్రంలో చాలాభాగం కృష్ణకి మాటలే వుండవు. అయితే, 1967లో ఈ సినిమాతో కలిసి ఏకంగా ఆరు సినిమాల్లో కృష్ణ నటించారు. వీటిలో చిత్రకారుడు బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజిని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటిచిత్రం కూడ ఇదే. ‘సాక్షి’ సినిమా తొలి సన్నివేశ చిత్రీకరణ పులిదిండి గ్రామ కోవెలలో జరుగుతున్నప్పుడు నటుడు రాజబాబు కల్పించుకొని “ఇది మీసాల కృష్ణుడి గుడి. చాలా శక్తివంతమైనది. ఈ గుడిలో మీకు, కృష్ణతో జరిగే పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నిజజీవితంలో కూడా మీరిద్దరూ తప్పక భార్యాభర్తలవుతారు” అంటూ విజయనిర్మలను కవ్విస్తే ఆమె “ఛా! ఏమిటా పిచ్చిమాటలు” అన్నారు. ఆ దేవుని మహిమేమో కాని, వారిద్దరూ కలిసి మూడు నాలుగు సినిమాలు చెయ్యగానే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నారు. “ఆ క్రెడిట్ బాపు గారికే” అంటారు విజయనిర్మల. ఆమెతో నాలుగైదు సినిమాలు చెయ్యగానే ఇద్దరిమధ్యా ప్రేమ చిగురించింది. పరస్పర అంగీకారంతో 1969లో ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని, పులిదిండి వెళ్లి మరలా గుడిలో దండలు మార్చుకున్నారు. అప్పుడే ‘మరపురాని కథ’ చిత్రంలో నటించడంతో దర్శకుడు వి.రామచంద్రరావుతో కృష్ణకు మంచి స్నేహం యేర్పడింది. ఆల్ టైం గ్రేట్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ దాకా రామచంద్రరావు కృష్ణతో మొత్తం 13 చిత్రాలకు పనిచేసారు. వీటిలో ‘అసాధ్యుడు’. ‘నేనంటే నేనే’, ‘కర్పూరహారతి’, ‘అఖండుడు’, ‘మామంచి అక్కయ్య’, ‘పెళ్ళికూతురు’, ‘అబ్బాయిగారు అమ్మాయిగారు’, ‘దేవుడుచేసిన మనుషులు’, ‘గంగ-మంగ’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలున్నాయి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు చిత్రాలు విజయనిర్మలతో నటించినవి. ఈ చిత్రాల షూటింగ్ సమయంలో కృష్ణ ఎన్నో దెబ్బలు తిన్నారు. ‘తేనెమనసులు’ టైంలో స్కూటర్ మీంచి నాలుగైదు సార్లు పడి దెబ్బలు తగిలించుకున్నారు. ‘కన్నెమనసులు’ లో గుర్రం మీంచి పడి ఒళ్ళు హూనం చేసుకున్నారు. ‘ఇద్దరు మొనగాళ్ళు’ ఫైట్స్ సీక్వెన్సుల్లో కత్తిగాట్లకు రక్తం ఓడి జ్వరమొచ్చేది. ‘గూఢచారి116’ షూటింగులో మామూలు దెబ్బలమాటెలావున్నా, పహిల్వాన్ నెల్లూరు కాంతారావుని పైకెత్తబోయి పడి, ఎడమ మోకాలు దెబ్బతింది. ‘అవేకళ్ళు’లో ముక్కుమీద పెద్ద దెబ్బ తగిలి బొటబొటా రక్తం వచ్చింది. ఇన్ని దెబ్బలు కాచుకొని ముందుకురికాడు కాబట్టే కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మొదటి నాలుగైదు చిత్రాలు కృష్ణకు పాఠాలు నేర్పాయి. సాహసానికి మారుపేరు కృష్ణ. తొలి 30 సంవత్సరాల్లో కృష్ణ ఏకబిగిన 296 సినిమాల్లో నటించడం ఒక అరుదైన రికార్డు. 2011లో నటనారంగం నుంచి వైదొలగేదాకా కృష్ణ నటించిన సినిమాలు 344. ఇంతవరకు ఏ హీరో ఈ రికార్డుని బ్రేక్ చెయ్యకపోవడమే ఒక పెద్ద రికార్డు.

స్వంత నిర్మాణ సంస్థతో…

1970లో కృష్ణ స్వంతంగా పద్మాలయా సంస్థ నెలకొల్పి మొదటి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ చిత్రాన్ని నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుంటే కృష్ణ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లో నటించేవారు. 1971లో కృష్ణ రెండో సొంతచిత్రం ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించారు. తెలుగులో ఇది తొలి సినిమాస్కోప్ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ సినిమా సింహభాగాన్ని రాజస్థాన్ అడవుల్లో, హిమాచల్ ప్రదేశ్ లో తీసారు. ఈ చిత్రంలో కృష్ణని అభిమానులు కౌబాయ్ గా చూసుకున్నారు. ఈ సినిమా ఖ్యాతి దేశ విదేశాలకు విస్తరించింది. ‘ది ట్రెజర్ ఐలాండ్’ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించిన ఈ సినిమాని 125 దేశాల్లో ప్రదర్శించారు. తర్వాత నటుడు ప్రభాకరరెడ్డిని భాగస్తుడుగా చేసుకొని 60 వేల అడుగుల నిడివిగల ‘పండంటి కాపురం’ రంగుల సినిమాని కేవలం 45 రోజుల్లో నిర్మించి; క్లైమాక్స్ దృశ్యాల్ని బందరులో అశేష జనవాహినిమధ్య చిత్రీకరించి కృష్ణ రికార్డు సృష్టించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడమే కాదు, అందులో నటించిన జమునకు ‘రాణీ మాలినీ దేవి’గా గుర్తింపు తెచ్చిపెట్టింది. కృష్ణ 100వ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. ‘అసాధ్యుడు’ చిత్రంలో సీతారామరాజుగా కనిపించిన కృష్ణకు, ఆ కథను చిత్రంగా తీయాలనే అభిలాష కలిగింది. స్వాతంత్ర్య సమరాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సంగ్రామ సింహంగా, విప్లవాగ్నులు మండించిన వీరాభిమన్యునిగా, స్వేచ్చా సమరశంఖమై, బ్రిటీషు సింహాసనపు పునాదుల్నే గజగజలాడించిన విప్లవ ప్రవక్తగా సీతారామరాజుని ఈ సినిమాస్కోప్ చిత్రంలో తీర్చిదిద్దారు కృష్ణ. భారీ బడ్జెట్ సినిమాలను 13 లక్షల్లో తియ్యగలిగే ఆరోజుల్లోనే, కృష్ణ ఈ సినిమాకు 25 లక్షలు ఖర్చుచేసారు. సినిమా విజయవంతమై మంచి లాభాలను ఆర్జించింది. 1982లో వచ్చిన కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’ కూడా ఒక్క యుగళగీతం లేకున్నా బాగా ఆడింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన ‘తెలుగువీర లేవరా’ కృష్ణకు 300 వ చిత్రం.

సూపర్ స్టార్…

Sitara with Krishna

తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన ఈ అసాధ్యుడు డేరింగ్ & డాషింగ్ హీరోగా పిలిపించుకున్నారు…. సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1969-72 మధ్య నాలుగేళ్ళలోనే 60 చిత్రాలలో నటించిన ఘనత పొందారు. రోజూ మూడు షిఫ్టుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటలదాకా ఏకబిగిన నటించి నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు కృష్ణ చలనచిత్ర ప్రస్థానంలో ఎన్నో! కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘సింహాసనం’ సినిమా తెలుగులో తొలి 70ఎం.ఎం చిత్రంగా చరిత్ర పుటల కెక్కింది. బప్పిలహరిని తెలుగులో సంగీత దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణదే! తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్లో ‘సాక్షి’ సినిమాలో కృష్ణ నటనకు ప్రశ౦సలు లభించాయి. కృష్ణ నటజీవితంలో మొత్తం 80 మంది హీరోయిన్ల సరసన నటించారు. అందులో 47 సినిమాల్లో విజయనిర్మలే హీరోయిన్. జయప్రద 42 చిత్రాల్లో, శ్రీదేవి 31 చిత్రాల్లో నటించి, అందమైన జోడీలుగా గుర్తింపు పొందారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన “తెలుగువీర లేవరా” పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత బహుమతిని సాధించారు. ఒక తెలుగు చిత్రానికి జాతీయస్థాయి బహుమతి రావడం ఇదే ప్రధమం. ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘పాడిపంటలు’, ‘రామరాజ్యంలో రక్తపాశం’ వంటి కుటుంబకథా చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా కీర్తినార్జించారు. ‘దేవదాసు’ సినిమాను పునర్నిర్మించి తన సాహసాన్ని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకి పోటీగా ‘కురుక్షేత్రం’ చిత్రం నిర్మించి సంక్రాంతి కానుకగా ఒకేరోజు విడుదల చేసి ధీరుడనిపించుకున్నారు. 1980లో హిందీ చిత్రరంగ ప్రవేశం చేసి జితేంద్రను హీరోగా పెట్టి ‘సింఘాసన్’ చిత్రాన్ని నిర్మించారు. ‘సంపంగి’ తెలుగు సినిమాని ‘ఇష్క్ హై తుమ్సే’గా రీ-మేక్ చేసారు. మొత్తం 17 సినిమాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. 2009లో భారత ప్రభుత్వం కృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కాన్ని ప్రదానం చేసింది. కృష్ణకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మహేశ్ బాబు సంచలన హీరోగా అలరారుతున్నారు. మంచితనం, నిజాయితీ, నిబద్ధత కృష్ణకున్న సుగుణాలు. సగటు ప్రేక్షకుడి వినోద సాధనమైన సినిమా కన్నులపండువగా వుండాలని ఆశించి, తెలుగు సినిమాకు భారీతనాన్ని చేకూర్చి, కళ్ళముందు స్వప్నజగత్తును ఆవిష్కరించిన ఘనత కృష్ణదే! తెలుగు చిత్రసీమ కృష్ణకు ఎప్పుడూ రుణగ్రస్తురాలై వుంటుంది.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

  1. ఈనాడు చిత్రంలో చంద్రమోహన్, రాధికల మధ్య “కాని సరె కాని నీ ఆటలన్ని సాగనీ” అనే ఒక యుగళగీతం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap